Covid Nasal Vaccine:


ముక్కు ద్వారా టీకా..


కరోనా కేసుల కలవరం మరోసారి మొదలైంది. ప్రపంచ దేశాల్లో బాధితుల సంఖ్య పెరుగుతోంది. భారత్ కూడా అప్రమత్తమైంది. వ్యాక్సినేషన్‌నూ వేగవంతం చేయాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాలకూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రికాషనరీ డోస్ తీసుకోవాలని ప్రజలకు సూచిస్తోంది. ఈ క్రమంలోనే...బయోటెక్ సంస్థ తయారు చేసిన ఇంట్రానాసల్ కొవిడ్ వ్యాక్సిన్‌ను వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లో చేర్చుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ కింద ఈ నాసల్ వ్యాక్సిన్‌ను అందించనున్నారు. నీడిల్ లేకుండా కేవలం ముక్కు ద్వారా చుక్కల మందులా ఈ వ్యాక్సిన్ అందిస్తారు. అన్ని ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఈ టీకాలు అందుబాటులవోకి రానున్నాయి. 
Co-WIN ప్లాట్‌ఫామ్‌లోనూ ఈ టీకాలను చేర్చనున్నారు. బయోటెక్ సంస్థ తయారు చేసిన BBV154 nasal vaccineకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆమోదం తెలిపింది. నవంబర్‌లోనే ఈ ఆమోద ముద్ర లభించింది. అయితే...అత్యవసర వినియోగం కింద మాత్రమే ఇది అందించాలని చెప్పింది. అందులో భాగంగానే...ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారికి ఈ టీకాలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. సూది ద్వారా కాకుండా చుక్కల ద్వారా ఇచ్చే టీకాను తయారు చేసుకోవడం భారత్‌లో ఇదే తొలిసారి. ప్రస్తుతానికి భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కొవాగ్జిన్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కొవీషీల్డ్, రష్యాకు చెందిన స్పుత్నిక్ వి, బయోలాజికల్ ఈ లిమిటెడ్‌కు చెందిన కొర్బెవాక్స్‌ టీకాలు కొవిన్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. 


అన్ని ప్రభుత్వాలు అలెర్ట్..


సెప్టెంబర్‌ 6న DGCI ఈ నాసల్ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపినట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌ను iNCOVACC గా వ్యవహరిస్తున్నారు. చైనాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రజలకు పలు సూచనలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. అంతర్జాతీ విమానాశ్రయాల్లోనూ కరోనా ఆంక్షల్నికచ్చితంగా పాటించాలని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌ ప్రభుత్వాలతో ప్రధాని మాట్లాడారు. ఈ రాష్ట్రాల్లోని  అధికారులు, మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సలహా ఇచ్చారు. భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కరోనా వైరస్ భయం పెరుగుతుండటంతో మాస్కులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఢిల్లీ ఎయిమ్స్‌లో రూల్స్‌ కఠినం చేశారు. దీని ప్రకారం ఎయిమ్స్ సిబ్బంది ఆసుపత్రి ఆవరణలో కోవిడ్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. క్యాంపస్ లో మాస్క్ లు ధరించడం తప్పనిసరి చేశారు. ఎయిమ్స్ ప్రాంగణంలో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడడాన్ని కూడా నిషేధించారు. కోవిడ్ పరీక్షలు, జీనోమ్ సీక్వెన్సింగ్ను ముందుకు తీసుకెళ్లాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలు మాస్క్ లు ధరించేలా చూడాలని ఆయన అధికారులను కోరారు.


Also Read: Coronavirus In China: కరోనా వేళ చైనాకు భారత్‌ సాయం - మందుల పంపిణీకి రంగం సిద్ధం