Minister Harish Rao : కరోనా కొత్త వేరియంట్ చైనాను వణికిస్తుంది. ఈ వేరియంట్ తో ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలతో భారత ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం అయింది. అన్ని రాష్ట్రాలకు కరోనా మార్గదర్శకాలు జారీచేసింది. కేంద్ర మార్గదర్శకాల నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా పరిస్థితులపై మంత్రి హరీశ్ రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ కేసుల పెరిగితే చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సమయం కావడంతో కోవిడ్ విస్తరించకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై అధికారులతో మంత్రి చర్చించారు. 


ఆందోళన వద్దు... అప్రమత్తంగా ఉండండి


కరోనా పట్ల ఆందోళన వద్దని, అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. పలు దేశాల్లో కరోనా వ్యాప్తిని గమనిస్తున్నామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు.  ప్రజలందరూ బూస్టర్‌ డోసు వేసుకోవాలని సూచించారు. కొత్త వేరియంట్‌పై ప్రజలు భయాందోళనకు గురికావొద్దన్నారు. ఇప్పటికే పలు దశల్లో కరోనాను విజయవంతంగా ఎదుర్కొన్నామన్నారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిందన్నారు. కరోనా వ్యాప్తి అంతగాలేకపోయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. మందులు, ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కరోనా పాజిటివ్‌ నమూనాలు  జీనోమ్‌ సీక్వెన్స్‌ కోసం గాంధీ ఆసుపత్రికి పంపాలన్నారు. శంషాబాద్‌  ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని  మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.


 కొత్త కేసులు 


తెలంగాణలో రోజుకి పదిలోపే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒకటి రెండు మినహా మిగతా కేసులన్నీ హైదరాబాద్‌లోనే నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లో సున్నా కేసులు నమోదవుతున్నప్పటికీ కొత్త వేరియంట్‌ భయాలులేకపోలేదు. ఇప్పటికే దేశంలో బీఎఫ్‌.7 కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.  


IMA సూచనలు 


ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ పలు మార్గదర్శకాలు జారీ చేయగా..ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కూడా పలు సూచనలు చేసింది. తక్షణమే ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించడం మొదలు పెట్టాలని తెలిపింది. విదేశీ ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని చెప్పింది. ప్రస్తుతానికి భారత్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా లేదని, భయపడాల్సిన పని లేదని వెల్లడించింది. "కొవిడ్ సోకాక చికిత్స అందించడం కంటే అది రాకుండానే చూసుకోవడం మంచిది. అందుకే ప్రజలందరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని
కోరుతున్నాం" అని ప్రకటించింది IMA.




1. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించండి. 
2. భౌతిక దూరం పాటించాలి. 
3. సబ్బు, నీళ్లు లేదా శానిటైజర్‌లతో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. 
4. పెళ్లిళ్లు, రాజకీయ సమావేశాలు, ఇతరత్రా మీటింగ్‌ల లాంటి సామూహిక కార్యక్రమాలు నిర్వహించకూడదు. 
5. విదేశీ ప్రయాణాలు మానుకోవాలి. 
6. జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, విరేచనాలు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 
7. వీలైనంత త్వరగా ప్రికాషనరీ డోస్‌ను తీసుకోవడం మంచిది. 
8. ప్రభుత్వాలు ఇచ్చే మార్గదర్శకాలను తుచ తప్పకుండా పాటించాలి