Sahitya Akademi Awards : ఇద్దరు తెలుగు కవులకు ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు దక్కాయి. వారాల ఆనంద్, మధురాంతకం నరేంద్రకు ఈ అవార్డులు వరించాయి. అనువాద రచనల విభాగంలో వారాల ఆనంద్‌ రాసిన  "ఆకుపచ్చ కవితలు" పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం దక్కింది. ప్రముఖ కవి పద్మభూషణ్‌ గుల్జార్‌ రాసిన గ్రీన్‌పోయెమ్స్‌ని పవన్‌ కే వర్మ పుస్తకాన్ని తెలుగులో  ‘ఆకుపచ్చ కవితలు’ పేరుతో అనువదించారు వారాల ఆనంద్‌. ఈ పుస్తకంలో మొత్తం 58 కవితలు ప్రకృతికి సంబంధించినవి ఉంటాయి. మనిషి, ప్రకృతి మధ్య అనుబంధాన్ని ఈ కవితల ద్వారా ఎంతో అద్భుతంగా చెప్పారు రచయిత ఆనంద్. కేంద్ర సాహిత్య పురస్కారం కింద తామ్ర ఫలకం, రూ.లక్ష నగదును అందజేయనున్నారు. మధురాంతకం నరేంద్ర రాసిన "మనో ధర్మపరాగం" నవలకు తెలుగు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 



(వారాల ఆనంద్) 


సాహిత్య అకాడమీ 2022 సంవత్సరానికి సంబంధించి అవార్డులు ప్రకటించింది. ఈ జాబితాలో ఏడు పుస్తకాలు, ఆరు నవలలు, రెండు షార్ట్ స్టోరీస్, మూడు నాటకాలు, రెండు విమర్శనాత్మక కథనాలు, ఒక ఆటోబయోగ్రఫిక్ వ్యాసం, సాహిత్యానికి సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయి. బెంగాలీ భాషకు సంబంధించిన అవార్డను త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. 


మధురాంతకం నరేంద్ర


మధురాంతకం నరేంద్ర తెలుగు, ఆంగ్ల రచయిత. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగంలో ఆచార్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన ప్రముఖ కథకుడైన మధురాంతకం రాజారాం కుమారుడు. నరేంద్ర తండ్రి పేరుతో కథాకోకిల అనే పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి యేటా కొంతమంది రచయితలకు సన్మానం చేస్తున్నారు. పాలిటెక్నిక్ చదువుతున్నప్పుడు చివరికి దొరికిన జవాబు అనే పేరుతో మొదటి కథ రాశారు. తరువాత చందమామ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వార పత్రికల్లో అనేక కథలు ప్రచురితం అయ్యాయి.  నరేంద్ర చిత్తూరు జిల్లా పాకాల మండలం రమణయ్యగారి పల్లెలో 1959 జూలై 16న జన్మించారు. తండ్రి మధురాంతకం రాజారాం అదే ఊళ్లో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. నరేంద్ర పదో తరగతి పూర్తి చేసిన తర్వాత పాలిటెక్నిక్ లో డి.ఫార్మసీలో చేశారు. ప్రైవేటుగా ఇంటర్మీడియట్ పూర్తి చేసి తరువాత బీఏ పూర్తి చేశారు. ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఏ, రవీంద్రనాథ్ టాగూర్ కథలపై ఎం.ఫిల్, నయనతార సెహగల్ రచనలపై పీ.హెచ్.డి చేశారు.  



(మధురాంతకం నరేంద్ర)


23 భాషల్లో అవార్డులు 


కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను సాహిత్య అకాడమీ మొత్తం 23 భాషల్లో ఉత్తమ సాహిత్యవేత్తలకు అందజేస్తోంది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనదిగా ఈ పురస్కారాన్ని భావిస్తున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ భారతీయ సాహిత్యాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా 1954లో స్థాపించారు. రాజ్యాంగం గుర్తించిన భాషలతో పాటు తాను పరిగణనలోకి తీసుకున్న మరికొన్ని భాషలు కలిపి మొత్తం 23 భాషల సాహిత్యవేత్తలకు ఏటా ఈ పురస్కారాన్ని అందిస్తుంది. మొదటిసారిగా ఈ పురస్కారాన్ని 1955 ప్రదానం చేశారు. జ్ఞాపికతో పాటుగా నగదు బహుమతిని అందిస్తారు. మొదటిసారి జ్ఞాపికతో పాటు రూ.5 వేలు నగదు ఇచ్చారు. క్రమంగా ఆ మొత్తాన్ని పెంచారు. 1983లో రూ.10 వేలు, 2001లో రూ.40 వేలు, 2003లో రూ.50 వేలుగా నగదు బహుమతి అందించారు. 2009 నుంచి పురస్కార గ్రహీతలకు రూ.లక్ష చొప్పున నగదు బహుమతిని అందజేస్తున్నారు.