Sajjala On Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు ఖమ్మం పర్యటన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అటు తెలంగాణ మంత్రులు, ఇటు ఏపీ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. ఖమ్మం పర్యటనలో చంద్రబాబు తెలంగాణలో పార్టీని వీడిన నేతలను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించారు. ఖమ్మం తనవల్లే అభివృద్ధి చెందిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీనిపై ఘాటుగా స్పందించిన తెలంగాణ మంత్రులు తెలంగాణ చంద్రబాబు వల్లే నష్టపోయిందని విమర్శలు చేశారు. తాజాగా ఈ తెలంగాణ మంత్రులతో ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు తెలంగాణ పర్యటనలపై విమర్శలు చేశారు. ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే అని ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికలు వస్తున్నాయనే చంద్రబాబు తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారన్నారు.


రాజకీయాలంటే ఆటలా 


చంద్రబాబుకు ఏ విషయంలోనూ క్లారిటీ లేదని సజ్జల విమర్శించారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మలేదన్నారు. బీజేపీకి దగ్గరవ్వడానికి చంద్రబాబు చేస్తు్న్న ప్రయత్నాలు అంటూ సజ్జల విమర్శించారు. చదువుల్లో డిజిటల్‌ విప్లవానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారన్నారు. పల్నాడులో వైసీపీ బలంగా ఉందన్నారు. టీడీపీ నేతలే దాడులకు పాల్పడి మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు ఏ రాష్ట్రంలో ఉన్నారో తెలియడం లేదని సజ్జల ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని ఉంటే మంచిదేనని, ఏపీలో కూడా చేస్తామంటే ఇంకా మంచిదన్నారు. రాజకీయాలంటే చంద్రబాబుకు ఆటలా ఉందన్నారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయని అక్కడ పర్యటిస్తున్నారన్నారు. ఆ రాష్ట్రంలో ఏం చేయాలో కూడా చంద్రబాబుకు స్పష్టత లేదన్నారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు ఇప్పుడు ఎందుకిలా మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. రాష్ట్రం అన్యాయంగా విడిపోయిందని, ప్రజలకు సేవ చేయాలని విషయంలో సీఎం జగన్‌కు స్పష్టత ఉందన్నారు. తనతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో ఉపయోగం ఉంటుందని బీజేపీకి చెప్పడమే చంద్రబాబు ఉద్దేశంగా ఉందని సజ్జల ఎద్దేవా చేశారు. 


బీజేపీ పొత్తు కోసం తాపత్రయం 


తెలంగాణలో బీజేపీని ట్రాప్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సజ్జల విమర్శించారు. చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి అని దుయ్యబట్టారు. తెలంగాణ కాంగ్రెస్‌లో చంద్రబాబు స్లీపర్ సెల్స్ ఉన్నారన్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ ఏం అవసరం అన్నారు. చంద్రబాబును అడ్డుకుంటే మాకు ఏం వస్తుందన్నారు. టీడీపీ వెంటిలేటర్ పైన ఉన్న పార్టీ అంటూ విమర్శలు చేశారు. చంద్రబాబుకు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు రెండూ తెలంగాణలోనే ఉన్నాయని సజ్జల ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఎక్కడ ఉండాలో ఏం చేయాలో స్పష్టంలేదన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణకు వెళ్లి అక్కడి ప్రజలతో ఆడుకుంటున్నారని ఆక్షేపించారు. సీఎం జగన్‌కు ఆంధ్రప్రదేశ్ లోనే ఉండాలని స్పష్టత ఉందన్నారు సజ్జల. చంద్రబాబు ఏ రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నారో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. టీడీపీ ద్వంద్వ విధానాలపై ప్రజలకుస్పష్టత ఉందన్నారు. అందుకే టీడీపీ ఆ పరిస్థితి వచ్చిందన్నారు.