National Green Tribunal: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) భారీ జరిమానా వేసింది. ఏకంగా రూ.900 కోట్ల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని నిర్ణీత గడువులోగా చెల్లించేయాలని నిర్దేశించింది. పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల విషయంలో పలువురు జాతీయ హరిత ట్రిబ్యునల్ లో పిటిషన్లు దాఖలు చేయగా విచారణ అనంతరం ఎన్జీటీ చెన్నై ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. జరిమానా సొమ్ము మొత్తాన్ని మూడు నెలల్లోగా కట్టాలని ఆదేశించింది. ఆ జరిమానాను కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ) వద్ద జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది.


Palamuru Rangareddy Lift Irrigation: పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం సరైన అనుమతులు లేకుండా నిర్మిస్తూ ఉందనేది ఆరోపణ. ఆ మేరకు పిటిషన్లు దాఖలు కాగా.. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సహా ఇంకా అనేక ఇతర రకాల అనుమతులు లేవని, ఆ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేయాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదని ధర్మాసనం గుర్తించింది. కాబట్టి, ప్రాజెక్టులకు సంబంధించిన మొత్తం ఖర్చులో 1.5 శాతం జరిమానాగా విధిస్తున్నామని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెన్నై బెంచ్‌ తీర్పు ఇచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మించిన పట్టిసీమ, పురుషోత్తపట్నం వ్యవహారంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడా అమలు చేస్తున్నట్లు తెలిపింది. 


పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను అనుమతులు లేకుండా నిర్మాణం చేపడతున్నారంటూ కోస్గి వెంకటయ్య అనే వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే అంశం పైన కర్నూలుకు చెందిన చంద్రమౌళేశ్వర రెడ్డి, ఏపీ ప్రభుత్వం కూడా అనుబంధ పిటిషన్లు దాఖలు చేశాయి. విచారణ చేపట్టిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది.


మొత్తం జరిమానాలు ఇలా
ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసు విషయంలో పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించినందుకు గానూ తెలంగాణ ప్రభుత్వానికి రూ.300 కోట్లు జరిమానాను ధర్మాసనం వేసింది. ఇంకా పర్యావరణ నష్ట పరిహారం కింద పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో రూ.528 కోట్లు, దిండి ప్రాజెక్టులో రూ.92 కోట్ల చొప్పున జరిమానా విధిస్తున్నట్లుగా ఎన్జీటీ తన తీర్పులో చెప్పింది. 


పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు స్వరూపం


పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంచనా ఖర్చు రూ.35,200 కోట్లు. 2015 జూన్ 10న తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుంచి కృష్ణాజలాలను సేకరించి రోజుకు 2 టీఎంసీల చొప్పున సుమారు 500 మీటర్ల ఎగువకు ఎత్తిపోస్తూ 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 90 శాతం ప్రాజెక్టు పనులు కూడా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే రిజర్వాయర్లలో 70 టీఎంసీలు, కాలువల్లో సుమారు 10 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసుకునేందుకు వెసులుబాటు ఉంది.