Coronavirus In China: కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో మరోసారి కరోనా చాపకింద నీరులా ప్రవహిస్తోంది. రోజూ లక్షలాది మంది కొత్త రోగులు వస్తుండటంతో ఆసుపత్రుల్లో మంచాలు కూడా దొరకడం లేదు. మందుల కొరత కూడా తీవ్రంగా ఉంది. వేసుకునేందుకు మందులు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన భారత్.. చైనాకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.


చైనాకు ఔషధాలను పంపాలని భారత్ నిర్ణయించింది. భారతదేశం ఔషధాల ఎగుమతి సంస్థ ఛైర్మన్ గురువారం (డిసెంబర్ 22) మాట్లాడుతూ.. ప్రపంచంలోని అతి పెద్ద ఔషధ తయారీదారుల్లో ఒకటైన భారత్.. చైనాకు సహాయం చేయాలని నిర్ణయించుకుందని తెలిపారు. చైనాకు జ్వరాల మందులను ఇచ్చేందుకు ఇండియా సిద్ధమైందని వివరించారు. 


భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ఆర్డర్లు..


చైనాలో విజృంభిస్తున్న కరోనా కారణంగా అక్కడ మందుల కొరత తీవ్రంగా ఉంది. డిమాండ్ కు తగ్గట్టుగా మందుల కంపెనీల్లో ఓవర్ టైం చేస్తున్నారు. జ్వరం, శరీర నొప్పులు, తలనొప్పికి ఉచితంగా మందులు ఇస్తామని చైనా ప్రభుత్వం ప్రకటించింది. జ్వరానికి సంబంధించిన మందులను చైనాకు పంపేందుకు భారత్ కూడా అనుమతి ఇచ్చింది. ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) ఛైర్‌ పర్సన్ సాహిల్ ముంజాల్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. ఇబుప్రోఫెన్ మరియు పారాసెటమాల్ మందులను తయారు చేసే కంపెనీలు చైనా నుంచి ఆర్డర్‌లను పొందుతున్నాయని తెలిపారు.


ప్రస్తుతం చైనాలో ఇబుప్రోఫెన్‌, పారాసెటమాల్‌లకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని, ఈ మందుల కొరతను ప్రజలు ఎదుర్కొంటున్నారని ముంజాల్ చెప్పారు. ఈ విషయంపై స్పందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. చైనాకు సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. తాము చైనాలోని కోరనా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. 


ఆన్ లైన్ లో మందుల ఆర్డర్..


చైనా మార్కెట్లలో యాంటీ వైరల్ మందులకు భారీ కొరత ఉంది. ఇబుప్రోఫెన్ మరియు పారాసెటమాల్ వంటి యాంటీవైరల్ ఔషధాల కొరత అక్కడి ప్రజలకు భయాందోళనలను కల్గిస్తోంది. వైరస్ ఔషధాల కొరత, నిల్వల కారణంగా చైనా మార్కెట్లలో ఔషధాల కొరత ఏర్పడింది. చైనాలో విక్రయించడానికి అనుమతిలేని మందులను కూడా చైనా ప్రజలు కొనుగోలు చేస్తున్నారని.. అక్కడి వార్తా పత్రికలు చెబుతున్నాయి. ఇందుకోసం చైనీయులు ఆన్ లైన్ స్టోర్లను ఆశ్రయిస్తున్నారి వివరిస్తున్నాయి.


షాంఘై నుంచి వస్తున్న వార్తాపత్రిక 'ది పేపర్' నివేదిక ప్రకారం.. చైనాలో చాలా మంది ఏజెంట్లు చురుకుగా మారారని, వారు వైరల్ ఫీవర్‌కు మందులను అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలిపారు. రెట్టింపు లేదా మూడు రెట్లు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నా ప్రజలు చేసేదేం లేక కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక ఏజెంట్ 50,000 కంటే ఎక్కువ విదేశీ జెనరిక్ యాంటీ వైరల్ బాక్సులను విక్రయించినట్లు ది పేపర్ తెలిపింది. గ్వాంగ్‌జౌ యునైటెడ్ ఫ్యామిలీ హాస్పిటల్‌లో వైరల్ డ్రగ్ పాక్స్‌లోవిడ్ ధర దాదాపు 2,300 యువాన్లు ఉందని  గ్వాంగ్‌జౌ డైలీ వార్తాపత్రిక చెబుతోంది. కరోనా సోకిందని తేలిన తర్వాతే ఈ మందు ఇస్తున్నారని.. ఆసుపత్రిలో రోగుల సీటీ స్క్రీనింగ్ ఖర్చు 5 వేల యువాన్లు ఉందని వివరించింది. డాక్టర్ ఫీజు వెయ్యి యువాన్లు అని పేర్కొంది.