Upcoming Movies Web Series In April 2022: స్ట్రయిట్ తెలుగు సినిమాలు ఏవీ ఈ వారం థియేటర్లలోకి రావడం లేదు. ఆ లోటు లేకుండా విజయ్, యష్ తమ సినిమాలు విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్ 'బీస్ట్', 'కె.జి.యఫ్ 2'కు తెలుగు సినిమాలు దారి ఇచ్చాయి. అయితే... ఓటీటీలో మాత్రం తెలుగు వీక్షకుల ముందుకు అచ్చ తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో ప్రజల ముందుకు వస్తున్న ఎంటర్‌టైనర్స్ ఏవో చూడండి.
ఏప్రిల్ 13న 'బీస్ట్'
సాధారణంగా శుక్రవారం సినిమాలు విడుదలవుతాయి. కొన్ని సందర్భాల్లో ఫ్రైడే కంటే ముందు సినిమాలు వస్తాయి. 'బీస్ట్'తో తమిళ హీరో విజయ్ బుధవారం థియేటర్లలోకి వస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా సినిమాపై ఆసక్తి నెలకొంది. ఒక మాల్‌ను తీవ్రవాదులు హైజాక్ చేస్తే... అందులో ఉన్న ఒక సైనికుడు వాళ్ళను ఎలా అంతం చేశాడనేది కథ అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. పక్కా యాక్షన్ థ్రిల్లర్ ఇది. 'కో కో కోకిల', 'డాక్టర్'తో తెలుగులో విజయాలు అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు.
ఏప్రిల్ 14న 'కె.జి.యఫ్ 2'
పాన్ ఇండియా ప్రేక్షకులకు 'కె.జి.యఫ్ 2' గురించి పరిచయం అవసరం లేదు.... అలాగే, యష్ గురించి కూడా! ఎందుకంటే... 'కె.జి.యఫ్' ఫస్ట్ చాఫ్టర్ సాధించిన విజయం అటువంటిది. దర్శకుడు ప్రశాంత్ నీల్ న్యూ ఏజ్ యాక్షన్ సినిమాను ప్రేక్షకులకు అందించారు. దానికి కొనసాగింపుగా వస్తున్న 'కె.జి.యఫ్' సెకండ్ చాప్టర్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. గురువారం ఈ సినిమా విడుదల కానుంది. రాకీ భాయ్ ఈసారి ఏం చేశాడనేది ఆసక్తికరం.
సోనీ లివ్ ఓటీటీలో ఒకేరోజున 'ఆడవాళ్ళు మీకు జోహార్లు', 'జేమ్స్'
శర్వానంద్, రష్మిక జంటగా నటించిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'ను తొలుత ఏప్రిల్ 2న సోనీ లివ్ ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు జరిగాయి. ఏమైందో? ఏమో? ఈ గురువారం విడుదలవుతోంది. అదే రోజున పునీత్ రాజ్ కుమార్ ఆఖరి సినిమా 'జేమ్స్' కూడా సోనీ లివ్ ఓటీటీలో విడుదల కానుంది.
రామ్ గోపాల్ వర్మ 'దహనం'
రామ్ గోపాల్ వర్మ ఓటీటీ కోసం కొన్ని సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ తీశారు. ఈసారి ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీ కోసం 'దహనం' వెబ్ సిరీస్ నిర్మించారు. ఇషా కొప్పికర్, అభిషేక్ దుహన్, నైనా గంగూలీ, అశ్వత్ కాంత్ శర్మ, అభిలాష్ చౌదరి, పార్వతి అరుణ్, సయాజీ షిండే, ప్రదీప్ రావత్ నటించిన ఈ వెబ్ సిరీస్‌కు అగస్త్య మంజు దర్శకుడు. ట్రైలర్ చూస్తే... ఫ్యాక్షనిజం, నక్సలిజం మేళవించి పగ, ప్రతీకారం నేపథ్యంలో తీసినట్టు ఉన్నారు. ఇదీ ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమైంది.
Also Read: అసలైన వేట ఎలా ఉంటుందో చూపిస్తా! - ఇది రామ్ గోపాల్ వర్మ 'దహనం'
సాయికుమార్, రాధిక నటించిన 'గాలివాన'
ఓటీటీ వేదికల్లో ఈ వారం వస్తున్న వెబ్ సిరీస్‌లలో అంచనాలు ఉన్న వెబ్ సిరీస్ 'గాలివాన'. ఇందులో సాయికుమార్, రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రధారులు. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఓ జంటను ఎవరు హత్య చేశారనే మిస్టరీ. బిబిసి స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో 'జీ 5' ఓటీటీ సంస్థ నిర్మించింది. చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, శరణ్య ప్రదీప్, అశ్రిత, అర్మాన్, నందిని రాయ్, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో నటించారు.
Also Read: రాజుగారి అమ్మాయి - అల్లుడిని హత్య చేసిందెవరు?
బ్లడీ మేరీ
నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'బ్లడీ మేరీ'. ఆహా ఓటీటీ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. ఈ నెల 15న విడుదలవుతోంది. ఇదీ థ్రిల్లర్ ఫిల్మ్. చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకుంది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: 'జెర్సీ' విడుదల వాయిదా - 'కెజియఫ్' క్రేజ్ కారణమా?
ఓటీటీ వేదికల్లో ఈ వారం విడుదలవుతున్న హాలీవుడ్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు:
- కొరియన్ వెబ్ సిరీస్ 'హ్యాపీనెస్' (Happiness On Netflix) నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇది సైన్స్ ఫిక్షన్ & ఫాంటసీ డ్రామా.
- ఇంగ్లీష్ టీవీ షో 'హార్డ్ సెల్' (Hard Cell On Netflix) నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇది కామెడీ షో.
- 'ద కర్దాషియన్స్' రియాలిటీ షో (The Kardashians on disney plus hotstar) డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
- 'అల్ట్రా మ్యాన్' వెబ్ సిరీస్ సీజన్ 2 (Ultraman Season 2 On Netflix) ఏప్రిల్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇది జపనీస్ యానిమేషన్ షో. యాక్షన్ అండ్ అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్ స్టోరీతో తెరకెక్కించారు.
- 'అనాటమీ ఆఫ్ ఎ స్కాండల్' (Anatomy of a Scandal ) మినీ వెబ్ సిరీస్ ఏప్రిల్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
- 'డెత్ ఆన్ ద నైల్' (Death on the Nile) సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలైంది. ఏప్రిల్ 15న డిస్నీ ప్లస్ హాట్ సార్ ఓటీటీ వేదికలో విడుదలవుతోంది.
హిందీ వెబ్ సిరీస్ 'Mai' కూడా ఏప్రిల్ 15న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. ఈ వారం చెప్పుకోదగ్గ వెబ్ సిరీస్, సినిమాలు ఇవే.