హిందీ 'జెర్సీ' విడుదల ఎప్పుడు? కరోనా కారణంగా పలు వాయిదాల తర్వాత ఏప్రిల్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. మరో మూడు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అనుకుంటుండగా... అనూహ్యంగా వాయిదా వేశారు.
లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే? బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, క్రిటిక్ తరణ్ ఆదర్శ్ చెప్పిన దాని ప్రకారం... 'జెర్సీ' ఏప్రిల్ 14న విడుదల కావడం లేదు. ఏప్రిల్ 22న విడుదల చేయాలని ఆదివారం రాత్రి నిర్మాతలు నిర్ణయించుకున్నారట. అయితే ఇంకా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
ఏప్రిల్ 14న యష్ పాన్ ఇండియా సినిమా 'కెజియఫ్ 2' విడుదల అవుతోంది. దానికి దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఆ సినిమాతో పోటీ పడటం కంటే వాయిదా వేయడమే మంచిదని నిర్మాతలు భావించినట్టు టాక్.
'అర్జున్ రెడ్డి' సినిమాను 'కబీర్ సింగ్'గా రీమేక్ చేసి... భారీ విజయం అందుకున్న షాహిద్ కపూర్, ఆ సినిమా తర్వాత రీమేక్ చేసిన మరో తెలుగు సినిమా 'జెర్సీ'. తెలుగులో నాని పోషించిన పాత్రను హిందీలో ఆయన చేశారు. ఆయన సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా నిర్మాతల్లో అల్లు అరవింద్, 'దిల్' రాజు, తెలుగు 'జెర్సీ' నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఉన్నారు. అనిరుద్ రవిచంద్రన్ నేపథ్య సంగీతం అందించారు.