మధుమేహం ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు. నలభై ఏళ్లు నిండితే చాలు డయాబెటిస్ దాడి చేసేందుకు సిద్దంగా ఉంటుంది. ఈ మహమ్మారి వారసత్వంగా వచ్చే అవకాశం కూడా ఎక్కువే. అందుకే ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని ఎంతో కొంతమేర తగ్గించుకోవచ్చు. చెడు జీవనశైలి, తినే ఆహారం, వ్యాయామరహిత జీవితం... ఇలా ఎన్నో కారణాల వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. వారసత్వం వచ్చే డయాబెటిస్‌ను అడ్డుకునే అవకాశం లేదు కానీ, చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వచ్చే మధుమేహాన్ని మాత్రం అడ్డుకోగలం. అందుకు ఏం చేయాలో ఓ అధ్యయనం దారి చూపించింది.
పరిశోధనలో తేలిందిదే...
కొత్త అధ్యయనం ప్రకారం మొక్కల ఆధారిత ఆహారం అధికంగా తినేవారిలో డయాబెటిస్ వచ్చే ఛాన్సులు తక్కువ. అంటే పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్లు... ఇలా కేవలం మొక్కల నుంచి వచ్చే ఉత్పత్తులు మాత్రమే తినేవారు మధుమేహం బారిన తక్కువ పడతారు. అంతేకాదు మధుమేహం వచ్చినవారు కేవలం మొక్కల ఆధారిత ఆహారాన్నే తింటే వారిలో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచే గుణాలేవీ మొక్కల ఆధారిత ఆహారంలో ఉండదు. ఈ ఆహారాల్లోని మెటబాలైట్ ప్రొఫైళ్లను గమనించడం ద్వారా అవి డయాబెటిస్ రోగంపై ఎలా ప్రతిస్పందిస్తాయో పరిశీలించారు. మెటబాలైట్ అనేది ఆహారాల్లో రసాయన ప్రక్రియల ద్వారా ఉత్పత్తి అయ్యే ఒక పదార్థం. ఇది ఆహారంలోని సమ్మేళనాలను విచ్చిన్నం చేయడానికి అవసరమైన సంక్షిష్ట అణువులను కలిగి ఉంటుంది. మొక్కల ఆధారిత ఆహారం మధుమేహుల్లో ఎలాంటి తీవ్ర మార్పులకు కారణం కావడం లేదు. రక్తంలో ఒక్కసారిగా గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వంటివి కూడా పరిశోధనలో కనిపించలేదు.
కోట్ల మందిలో ఈ సమస్య
ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. 2000లో కేవలం 150 మిలియన్లున్న డయాబెటిస్ రోగుల సంఖ్య, 2019కి 450 మిలియన్లకు చేరుకుంది. 2045కి దాదాపు 700 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే మూత్రపిండాలు, కళ్లు, నాడీ వ్యవస్థ, గుండె సంబంధ వ్యాధులు, రక్తనాళాల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.
ఏం తినాలి?
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో మాంసాహారాన్ని తగ్గించాలి. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్ళు, కూరగాయల నూనెలు, టీ/కాఫీలు ఉండేలా చూసుకోవాలి. గుడ్లు, మాంసం, చేపలు వంటివి చాలా మేరకు తగ్గించాలి.
Also read: భోజనం చేశాక తమలపాకు ఎందుకు నమలాలి?