ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల్లో తిరిగితే వడదెబ్బ కొట్టడం ఖాయం. శరీరానికి వడదెబ్బను తట్టుకునే శక్తిని ఇవ్వాలి. ఇందుకు చలువ చేసే, ఒంట్లో నీటిని పట్టి ఉంచే ఆహారాలను తినాలి. డీ హైడ్రేషన్ సమస్య తలెత్తకుండా చేసే ఆహారాల్లో బార్లీ జావ కూడా ఒకటి. వీటినే బార్లీ నీళ్లు అని కూడా అంటారు. 


తయారీ ఇలా
ఒక గిన్నెలో లీటర్ నీటిని పోసి అందులో మూడు స్పూన్ల బార్లీ గింజలు వేయాలి. లేదా బార్లీ పొడిని వేసినా మంచిదే. దీన్ని 20 నిమిషాల పాటూ ఉడికించాలి. బార్లీ గింజలు మెత్తగా మారి, నీళ్లు జావలా అయ్యేంతవరకు ఉంచాలి. తరువాత స్టవ్ కట్టేయాలి. ఆ జావలో కాస్త నిమ్మరసం లేదా తేనె కలుపుకుని తాగేయాలి. చల్లగా తాగితే ఇంకా ఉపశమనంగా ఉంటుంది. వేసవిలో వేడి పానీయాలు తాగలేం కనుక, బాగా చల్లారాక తాగితే మంచిది. లేదా ఫ్రిజ్‌లో పెట్టుకుని రోజులో రెండు మూడు సార్లు తాగితే ఇంకా మేలు. ఎండలోనుంచి ఇంట్లోకి వచ్చాక చల్లని మజ్జిగ లేదా చల్లని బార్లీ జావ తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. 


ఇతర ఉపయోగాలు
బార్లీ జావ కేవలం వడదెబ్బ నుంచే కాదు ఇంకా అనేక ఆరోగ్యసమస్యల నుంచి కాపాడుతుంది. 


1. బార్లీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరంలోకి ప్రవేశించి హానికర ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. పొట్టలో మంచి బ్యాక్టిరియా ఉత్పత్తిని పెంచి పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. 


2. బార్లీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. శరీరం నుంచి టాక్సిన్లను బయటికి పంపిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమ ఆహారం. కాళ్లలో వాపును తగ్గించే లక్షణం దీనికి ఉంది. 


3. చర్మసౌందర్యాన్ని కాపాడి వృద్ధాప్య ఛాయలు రాకుండా నివారిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ముడతలు, గీతలు రాకుండా అడ్డుకుంటాయి. దీన్ని రోజూ తాగితే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. 


4. బార్లీలో ప్రొసైనిడిన్ బి3, నియాసిన్, థయామిన్ వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి. జుట్టు మందంగా, అందంగా పెరుగుతుంది. అలాగే ఈ విటమిన్లు ఎర్రరక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. జుట్టు రంగు నల్లగా ఉండేందుకు మెలనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. 


5. రక్తహీనత సమస్యతో బాధపడేవారు బార్లీ జావ రోజూ తాగితే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచేందుకు బార్లీ నీటిని తాగాలి. ఇందులో ఇనుము, కాపర్ పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. 


6. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి బార్లీ అవసరం. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దగ్గు, జ్వరం, జలుబును దూరం చేస్తుంది. అనారోగ్యం బారిన పడే అవకాశాలను నివారిస్తుంది. 


7. మధుమేహంతో బాధపడేవారిలో గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది బార్లీ. ఇది కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదించేలా చేస్తుంది. 


8. బార్లీలో ఉండే కరిగే ఫైబర్, కరగని ఫైమర్ రెండూ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. దీంతో గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చు. 


Also read: ప్లాస్టిక్ కణాలు పొట్టలో చేరకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే


Also read: నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా పెసరపప్పుతో కమ్మని లడ్డూలు