ప్లాస్టిక్ వినియోగం అధికమైపోతుంది. ధర తక్కువ కావడం, ఎక్కువ రోజులు మన్నే అవకాశం ఉండడంతో చాలా మంది ప్లాస్టిక్ వస్తువులను వాడేందుకు ఇష్టపడుతున్నారు. మార్కెట్ ను కూడా ప్లాస్టిక్ ముంచెత్తుతోంది. ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో మానవరక్తంలో మైక్రోప్లాస్టిక్ కణాల ఉనికిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంటే ప్లాస్టిక్ ఎలాగోలా శరీరంలోకి కూడా చేరిపోతోంది. కొన్ని అలవాట్లే వల్లే మానవశరీరంలోకి ప్లాస్టిక్ చేరగలుగుతోంది. ఇది చాలా ప్రమాదకరం. శరీరంలో ప్లాస్టిక్ చేరకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
టీబ్యాగ్లు వద్దు
టీ తాగే వారు టీ ఆకులతో టీ చేసుకోవాలి. టీ బ్యాగ్‌లు పనిని సులువు చేస్తాయి నిజమే కానీ, అవి ఆరోగ్యకరమైన ఎంపిక మాత్రం కావు. టీ బ్యాగులను పాలీ ప్రొఫైలిన్ అంటే ప్లాస్టిక్ రకాన్ని కలిపి చేస్తారు. వీటిని వేడి నీటిలో ముంచినప్పుడు వాటి కణాలు టీలో కలిపి శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది.
ఆ కప్పులు వద్దు
టీ లేదా కాఫీ తాగేటప్పడు టేక్ అవే కప్పులనే ఇప్పుడు అందరూ వాడుతున్నారు. ఈ అలవాటు మైక్రోప్లాస్టిక్ ను శరీరంలో చేరేలా చేయవచ్చు. ఆ కప్పులు కాగితం లేదా ప్లాస్టిక్ తో చేసినవి కావచ్చు. వాటిలో వేడి కాఫీ వేసినప్పుడు ప్లాస్టిక్ కణాలు విడుదలవుతాయి. కాఫీ ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి రోజూ కాఫీని కప్పుల్లో తాగే అలవాటను మానుకుంటే మంచిది.
మైక్రోవేవ్ చేయద్దు
చాలా మంది ఫుడ్ ను వేడి చేసేందుకు మైక్రోవోవెన్లో పెట్టి వేడి చేస్తారు. అలా చేయద్దని చెప్పడం లేదు, గ్లాస్ కంటైనర్లో అలా చేసుకోవడం ఉత్తమం. కానీ చాలా మంది ప్లాస్టిక్ బాక్సుల్లో, యూజ్ అండ్ త్రో బాక్సుల్లో చేస్తారు. దీనివల్ల మైక్రో ప్లాస్టిక్ ఆహారంలో కలిసే ప్రమాదం ఉంది కాబట్టి వాటిల్లో వేడి చేయడం మానేయాలి.
సముద్ర చేపలు తగ్గించాలి
సముద్ర చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి, కానీ అవి నివసించే సముద్రం మాత్రం కలుషితం అయిపోయింది. దానికి మనమే కారణం. విష వ్యర్థాలన్నింటినీ సముద్రంలో కలిపి దాన్ని విషతుల్యం చేస్తున్నాం.ఎన్నో ప్లాస్టిక్ వ్యర్థాలు నీటి ద్వారా చేపల శరీరాల్లోకి చేరుతున్నాయి. వాటిని తినడం ద్వారా ఆ ప్లాస్టిక్ మన శరీరంలోకి వస్తుంది. అందుకే సముద్రం చేపలను తినడం తగ్గించుకోవాలి.
సౌందర్య ఉత్పత్తులతో జాగ్రత్త
మీరు రోజూ ఉపయోగించే బ్యూటీ ఉత్పత్తులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. వాటి వల్ల కూడా మైక్రోప్లాస్టిక్ దాడికి గురయ్యే అవకాశం ఉంది. స్క్రబ్స్, క్లెన్సర్లు వంటి ఉత్పత్తులలో మైక్రోబీడ్స్, హానికరమైన రసాయనాలు ఉంటాయి. బ్యూటీ ఉత్పత్తులను ఎంపిక చేసుకునేటప్పుడు అందులో వాడే పదార్థాలను ఓసారి చెక్ చేసుకోండి. కొన్ని రకాల ఉత్పత్తులు చర్మ క్యాన్సర్ కు కారణమవుతున్న సంగతి తెలిసిందే.
Also read: నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా పెసరపప్పుతో కమ్మని లడ్డూలు