ఆదివారం టైమ్‌పాస్ అవ్వడం లేదా? ఇదిగో ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలతో కాసేపు సరదాగా గడపండి. మెదడుకూ, చూపుకూ, ఏకాగ్రత పెరగడానికి ఈ చిత్రాలు ఉపయోగపడతాయి. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కంటి చూపుకు, మెదడు పనితీరుకు సవాలు విసిరేలా ఉంటాయి. కళ్ల ముందే అంతా స్పష్టంగా ఉన్నట్టే కనిపిస్తాయి, కానీ లోపల ఎన్నో ట్విస్టులు దాక్కుంటాయి. అందుకే ఆప్టికల్ ఇల్యూషన్ బొమ్మలు సోషల్ మీడియాలో తెగ ట్రెండవుతాయి. 


ఎన్ని ముఖాలు?
మనిషి కళ్లను మాయ చేయడంలో ఈ చిత్రాలు ముందుంటాయి. అలాంటి ఒక చిత్రమే ఇది. మీకు ఇందులో ఎన్ని ముఖాలు కనిపిస్తున్నాయో చూడండి. టక్కున నాలుగు అని సమాధానం చెప్పేస్తారు 90 శాతం మంది. కానీ బాగా పరీక్షించి చూస్తే అసలైన సమాధానం తెలుస్తుంది. ముగ్గురి పురుషుల ముఖాలు తెలుస్తున్నాయి, అలాగే ఒక మహిళ నిల్చున్న ఆకారం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ నలుగురే కాదు మరో రెండు ముఖాలు కూడా ఈ చిత్రంలో ఉన్నాయి. మొత్తం చిత్రాన్ని కాస్త దూరం నుంచి చూస్తే పెద్ద ముఖం కనిపిస్తుంది. ఇద్దరి పురుషుల ముఖాలు కళ్లలా కనిపిస్తాయి. మహిళ ముక్కు భాగంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే ఒక పురుష ముఖాన్ని గమనిస్తే, లోపల మరో మనిషి కనిపిస్తాడు. అంటే మొత్తం ఆరు ముఖాలన్న మాట. క్లారిటీ కావాలంటే కింద సర్కిల్ చుట్టిన ముఖాలు చూడండి.  


వేసింది ఎవరంటే 
ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రకారుడు ఒక ఉక్రెనియన్. పేరు ఒలెగ్ షుప్లెక్. ఆయన 2000వ సంవత్సరం నుంచి ఇలా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు వేస్తున్నారు. ఈయనకి మంచి చిత్రకారుడిగా ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది.