Sri Rama Navami 2022: నేడు శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌లో శ్రీరామ శోభాయాత్ర (Sri Rama Navami Shobha Yatra) వేడుకగా జరగనుంది. ఇందుకోసం భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళ్‌హాట్‌లోని సీతారాంబాగ్ ఆలయం నుంచి శోభాయాత్ర ఊరేగింపు ప్రారంభం కానుంది. చివరగా కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వద్ద సాయంత్రం శోభాయాత్ర ముగుస్తుంది. ఈ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జంట నగరాలలో ప్రతి ఏడాది శ్రీరామనవమికి శోభయాత్రను వేడుకగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది ఖైరతాబాద్, అంబర్‌పేట్, నారాయణగూడ ప్రాంతాల నుంచి కూడా ఊరేగింపులు కొనసాగనున్నాయని పోలీసులు తెలిపారు.
జంట నగరాలలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions In Hyderabad)
వేడుకగా జరిగే శ్రీరామనవమి శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. శ్రీరామ శోభాయాత్ర ఉదయం 11 గంటలకు మొదలై రాత్రి 10 గంటలకు ముగిసే అవకాశం ఉంది. దాంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఆ సమయంలో పలు దారులలో వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. కొన్ని మార్గాలలో వాహనాలను దారి మళ్లించి, ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లేలా ఏర్పాటు చేశారు. గోషామహల్, సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆంక్షలు ఉంటాయి.
6.5 కిలోమీటర్ల మేరక సాగే శోభాయాత్ర సీతారాంబాగ్ ఆలయం వద్ద ప్రారంభమై.. బోయగూడ కమాన్, మంగళ్ హాట్ పీఎస్ రోడ్డు, జాలి హనుమాన్, దూల్ పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్ బజార్, సిద్దంబర్ బజార్ మసీదు, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి చౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సాగి చివరికి సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాలకు శోభాయాత్ర చేరుకుటుంది.
శ్రీరామ శోభాయాత్ర (Sri Rama Navami Shobhayatra in Hyderabad today)కు సంబంధించిన సమాచారం కోసం వాహనదారులు ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నెంబర్ 040 2785 2482, హెల్ప్ లైన్ 9010203626 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఆదివారం మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు గోషామహల్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో.. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సుల్తాన్ బజార్ పీఎస్ పరిధిలోని రోడ్లపై శోభాయాత్ర కొనసాగుతుందని.. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మరోవైపు నేడు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని మద్యం దుకాణాలు, బార్‌లు మూసివేయనున్నారు.
Also Read: Sri Rama Navami 2022: శ్రీరాముడు నవమి రోజే ఎందుకు జన్మించాడు, ఆ తిథికి ఉన్న ప్రత్యేకత ఏంటి
Also Read: Srirama Navami 2022 : రాముడు మానవుడా - దేవుడా, ఆ రెండక్షరాలు ఎందుకంత పవర్ ఫుల్