శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
భారతదేశంలో ధర్మ బద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనం శ్రీరాముడు. ,మనిషి ఇలా బ్రతకాలి, అని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి మనిషి జన్మకు ఉన్న విశిష్టతను చాటిచెప్పిన పురుషోత్తముడు. శ్రీరామమనవి సందర్భంగా నవిమి తిథి గురించి చెప్పుకుందా..
అయనము అంటే నడక అని అర్థం . రామాయణము అంటే రాముని నడక అని అర్థం. సరిగ్గా గమనిస్తే శ్రీ మహవిష్ణువు దశావతారాల్లో ఒక్క రామావతారంలో తప్ప ఇక ఏ అవతారం గురించి ప్రస్తావనలోనూ అయనము అనే మాట వినియోగించలేదు. ఎందుకంటే రామావతారంలో స్వామి పరిపూర్ణముగా మానవుడే. అందుకే ఎక్కడా రాముడు తాను దేవుడిని అనికానీ, దైవత్వం గురించి ప్రకటించడం కానీ చేయడు. “రామస్య ఆయనం రామాయణం” అంటారు కదా మరి రాముడి కదలికకు అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది. అంటే ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం, మరో అడుగు వేస్తే అది సత్యం .ఆయన నడక ఆయన కదలిక అంతా సత్య -ధర్మములే. అందుకే “రామో విగ్రహవాన్ ధర్మః ” అన్నారు .
Also Read: ఈ లక్షణాలుంటే మీరు కూడా రాముడే-దేవుడే
రాముడు ధర్మం తప్పితే రామాయణంలో కొన్ని కాండలు లేవు. రాముడు తన అవసరం కోసం ధర్మం మానేసి ఉంటే కిష్కిందకాడంలో సుగ్రీవుడితో స్నేహం మానేసి వాలితో స్నేహం చేస్తే చాలు. రావణుడు తన జీవితకాలంలో ఓడిపోయింది వాలి, కార్తావీర్యార్జునుడు, మాంధాతతోనే. అప్పటికే వాలి-రావణుడు స్నేహితులు. అలాంటప్పుడు వాలితో స్నేహం చేస్తే సీతను తీసుకొచ్చి అప్పగించేస్తాడు కానీ రాముడు ఆపని చేయలేదు. అధర్మపరుడైన వాలితో స్నేహం కన్నా సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని సంహరించి, సేతువు నిర్మించి , రావణుడితో యుద్ధం చేసి సీతను పొందాడు. రాముడి ధర్మం గురించి చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి.
అందుకే పెద్దలు ఏం చెబుతారంటే రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలి అని. రాముడు దేవుడు అని కాకుండా మానవుడు అని చదివినప్పుడే..ఓ మనిషి సత్యం, ధర్మం పట్టుకుని ఇలా జీవించగలడా అనే ఆలోచన వస్తుంది. సహస్రనామ తత్తుల్యం:
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||
పరమశివుడు పార్వతీ దేవి తో చెప్పిన ఈ శ్లోకం అందరికీ తెలిసిందే. శ్రీ రామ రామ రామ అని మూడు సార్లు జపిస్తే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత ఫలితం వస్తుందని ఈ శ్లోకం భావం.
అదెలా అంటే కటపయాది సూత్రం ప్రకారం “య” వర్గంలో “రా” రెండవ అక్షరం కాగా “ప” వర్గం లో “మ ” ఐదవ అక్షరం రెండు * ఐదు =పది కదా , దీనిని బట్టి ఒక సారి రామ అంటే పది సంఖ్య కు సంకేతం .ఇక మూడు సార్లు జపిస్తే 10*10*10 =1000 కి సమానమవుతుంది . అందుకే పరమశివుడు అలా నిర్వచించాడట.
Also Read: రాముడి కోదండం ఆకారంలో ఆలయం, చుట్టూ రామాయణ ఘట్టాలు, ఈ అద్భుత ఆలయాన్ని ఒక్కసారైనా చూసితీరాల్సిందే
స్వామివారు జన్మించిన నవమి తిథి విషయానికొస్తే...నవమి పరమేశ్వర తత్వాన్ని సూచిస్తుంది. తొమ్మిదిని ఏం సంఖ్యతో హెచ్చించినా ఆనంబర్స్ కలిపితే మళ్లీ తొమ్మిదే వస్తుంది.
9*1=9
9*2=18 —– 8+1 =9
9*3=27 —– 2+7=9
9*4=36 —– 3+6=9
9*5=45 —– 4+5=9
దీనికి పరమాత్మ చిహ్నానికి సంబంధం ఏంటంటే..ఆయన ఎన్ని రూపాలలో ఉన్నా ఎన్ని అవతారములు ఎత్తినా ఎన్ని పేర్లు పెట్టుకున్నా అసలుతత్వము ఒక్కటే అని. శ్రీరాముడు నవమి రోజు జన్మించడం వెనుకున్న ఆంతర్యం ఇదే.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం
Also Read: త్రిజటకు తెల్లవారుజామున వచ్చిన కల విన్నాక ఏడుపు ఆపిన సీతాదేవి, ఇంతకీ ఎవరీ త్రిజట