మనిషిగా జన్మించాక ఎలా బతకాలి, ఎలాంటి జీవితం గడపాలి, వ్యక్తిత్వం ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, బంధుమిత్రులతో ఎలా మెలగాలి, ప్రజలతో(చుట్టుపక్కలవారితో ఎలా మమేకమవ్వాలి), కష్టసుఖాల్లో ఎలా ముందుకు సాగాలి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయ్. మరి ఇన్ని లక్షణాలు ఒక్కరికే ఉండడం సాధ్యమా అంటే ఈ ప్రశ్నకు ఒకేఒక్క సమాధానం శ్రీరామచంద్రుడు. పేరుకే దేవుడైనా మనిషిగా ఎలా బతకాలో బతికి చూపించాడు రాముడు. ఇంకా చెప్పాలంటే సంపూర్ణమైన మనిషి అనిపించే ఒకే ఒక్క రూపం శ్రీరాముడు. భగవంతుడు మానవజన్మ ఎత్తితే ఆ జన్మకు ఏ విధంగా సార్థకత వస్తుందో నిరూపించాడు. అలాంటి రాముడిని విగ్రహరూపంలో పూజించి వదిలేస్తారా...ఫాలో అవుతారా..


Also Read: రాముడి కోదండం ఆకారంలో ఆలయం, చుట్టూ రామాయణ ఘట్టాలు, ఈ అద్భుత ఆలయాన్ని ఒక్కసారైనా చూసితీరాల్సిందే


రాముడి ప్రత్యేక గుణాలివే



  • తండ్రి పట్ల కొడుకు ఎలా ఉండాలో చెప్పడానికి రాముడు ఒక్కడు చాలేమో. తెల్లారితే అయోధ్యకి రాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. ఆ సమయంలో తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం జరగాలని, రాముడు వనవాసం చేయాలన్న దశరథుడి మాటగా కైకేయి చెప్పడంతో మారు మాట్లాడకుండా వనవాసానికి వెళ్లిపోయాడు. తండ్రి తనని చూడకుండా ఉండలేడని తెలుసినప్పటికీ కైకేయికి ఇచ్చిన మాట దశరథుడు నిలబెట్టుకోవాలంటే కైకేయి ఆదేశాలను పాటించాల్సిందే కదా. తండ్రిపై ఉన్న గౌరవంతో ఏ మాత్రం మాట్లాడకుండా అడవులబాటపట్టాడు శ్రీరామచంద్రుడు.

  • ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య.. రాముడు ఏకపత్నీవ్రతుడు అంటారు. పెళ్లి అనే బంధానికి విలువ ఇచ్చి ఒకే స్త్రీతో జీవితం పంచుకోవడం ఈ రోజుల్లో చూడగలమా. మరో స్త్రీతో సాంగత్యం ఉంటేనే కాదు మరో స్త్రీ గురించి ఆలోచన కూడా ఈ తప్పే మరి. ఇలాంటి లక్షణాలున్నవారు మనమధ్య ఉంటే చేతులెత్తి నమస్కరించాల్సిందే...

  • రాజుకు అహంకారం అనేది సహజంగా వచ్చే గుణం. అంటే గొప్పస్థానంలోనో, అధికారంలోనో ఉన్నవారు అహంకారాన్ని అలంకారంగా భావిస్తారు. స్థాయిని బట్టి సావాసాలు ఉండేలా చూసుకుంటారు. కానీ శ్రీరామచంద్రుడు అలా కాదు.. రామయ్యకి ఎలాంటి బేధాలు లేవు. పడవ నడుపుకునే గుహుడిని గుండెలకు హత్తుకున్నాడు. అడవిలో ఉండే వానర రాజు సుగ్రీవుడితో స్నేహం చేశాడు.

  • బంగారులేడి మాయలేడి అని తెలియదా ..రాముడు దేవుడే కదా అంటారేమో... నిజమే కానీ... రాముడు ఎప్పుడూ దేవుడిలా బతకలేదు మనిషిలానే బతికాడు. అందుకే భార్య బంగారులేడి కావాలని అడిగిన వెంటనే ఉన్నపాటుగా వెళ్లాడు. నేటి తరానికి ఇక్కడ సందేశం ఏంటంటే..చుట్టూ అద్భుతంగా కనిపిస్తున్న ప్రపంచంలో మాయ, మిధ్య అనేవి చాలా ఉన్నాయ్..వాటిని గుర్తించకుండా పరుగులుతీస్తే  ఆ తర్వాత బాధపడక తప్పదు.

  • లంకలో ఉన్న సీతను తీసుకువచ్చేందుకు రాముడు వెళ్లలేడా..మధ్యలో వానరుల సాయం ఎందుకు. ఎందుకంటే.. బంగారు పళ్లానికి అయినా గోడ చేర్పు ఉండాలని చెబుతారు. ఎంత గొప్పవారైనా నిజమైన స్నేహితుడి సాయం ఉంటే అసాధ్యం అయిన సముద్రం లాంటి కష్టాలను దాటుకుని ఆవలి తీరానికి చేరుకోవడం ఎంతమాత్రం కష్టం కాదని చెప్పడమే.

  • ఎంత గొప్పవాడికి అయినా తనవెంట నమ్మకస్తుడు ఉండాలి. రాముడికి హనుమంతుడిలా. నమ్మిన బంటు అనే మాట అక్కడి నుంచే వచ్చింది.

  • స్నేహితుడిని నమ్మడం సాధారణ విషయమే. మరి శత్రువును నమ్మడం సాధ్యమేనా. శత్రువైవన రావణుడి తమ్ముడు విభీషణుడే వచ్చి శరణు కోరినా అనుమానించలేదు. శత్రువు తమ్ముడు కదా ఏం ప్రమాదం ఉంటుందో అని ఆలోచించలేదా అంటే.. శరణు అని వచ్చిన శత్రువునైనా అక్కున చేర్చుకోవాలన్న సందేశం అది. అదే సమయంలో రాముడిని ఎవరో అడిగారట... రావణుడిని చంపి లంకను ఇస్తా అని విభీషణుడికి మాట ఇచ్చావు కదా..మరి ఆ రావణుడే క్షమించమని వస్తే ఏం చేస్తావని...అప్పుడు రాముడు ఏం చెప్పాడో తెలుసా ” అదే జరిగితే రావణుడికి నా అయోధ్య ఇచ్చేస్తా..” అని. రాముడి గొప్పతనం గురించి ఇంతకన్నా ఏం చెబుతాం.

  • తన భార్యని ఎత్తుకెళ్లిన శత్రువుని చంపేసే అవకాశం వచ్చినప్పుడు కూడా ప్రాణం తీయాలని అనుకోలేదు..ముందు ఓ అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే శత్రవుని చంపడమే అసలైన శిక్షకాదు.

  • తన భార్య గురించి తనకు తెలియదా..ఎవరో ఏదో అన్నారని ఆమెని అడవుల్లో వదిలేయాలా అంటే...రాజుగా ప్రజల మాటల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రాజ్య ప్రజల మాటను గౌరవించాడు. భార్యకి దూరంగా ఉన్నాడు. అది  సీతపై అనుమానం కాదు..నిజం ఏంటో లోకానికి తెలియాలి కదా.


"శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే "


Also Read:  అనారోగ్యం, శనిబాధలు తొలగిపోవాలంటే మంగళవారం ఇలా చేయండి