ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు మరో విజయం దక్కింది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో కేవలం మూడు పరుగుల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది.


సిక్సర్లతో చెలరేగిన షిమ్రన్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు ఆరంభంలోనే కష్టాలు ఎదురయ్యాయి. 10 ఓవర్లలో 67 పరుగులకే టాప్-4 బ్యాటర్ల వికెట్లను రాజస్తాన్ కోల్పోయింది. అనంతరం షిమ్రన్ హెట్‌మేయర్ (59 నాటౌట్: 36 బంతుల్లో, ఒక ఫోర్, ఆరు సిక్సర్లు), రవిచంద్రన్ అశ్విన్ (28: 23 బంతుల్లో, రెండు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. అశ్విన్ రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగినా... చివర్లో హెట్‌మేయర్ సిక్సర్లతో చెలరేగడంతో రాజస్తాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.


స్టోయినిస్ చెలరేగినా...
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు కష్టాలు మొదటి ఓవర్ నుంచే మొదలయ్యాయి. ఓపెనర్ కేఎల్ రాహుల్ (0), వన్‌డౌన్ బ్యాటర్ కృష్ణప్ప గౌతంలు (0) మొదటి రెండు బంతుల్లోనే అవుటయ్యారు. ఆ తర్వాత నాలుగో ఓవర్లోనే జేసన్ హోల్డర్ (8) కూడా అవుటయ్యాడు. అయితే మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ (39: 32 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) 16వ ఓవర్ వరకు క్రీజులో ఉన్నాడు. దీంతో పాటు చివర్లో మార్కస్ స్టోయినిస్ (38 నాటౌట్: 17 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) సిక్సర్లతో చెలరేగడంతో లక్నోకు గెలుపుపై ఆశలు చిగురించాయి. కానీ చివరి ఓవర్లో కుల్‌దీప్ సేన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 162 పరుగులకు పరిమితం అయింది.