రోజాకు మంత్రి పదవి వస్తుందా ? రాదా ? అని జరిగిన విస్తృతమైన చర్చకు చివరికి వచ్చింది అనే సమాధానంతో ముగిసింది. కానీ ఎలా వచ్చిందన్నది ఇప్పటికీ చాలా మందికి అర్థం కాని చిక్కు ప్రశ్న. ఎందుకంటే రోజాకు అనుకూలంగా ఒక్కంటే ఒక్కటి పరిస్థితి లేదు. సామాజికవర్గం,  జిల్లా సమీకరణాలు, పార్టీలోని తన ప్రత్యర్థులు .. ఇలా ఎన్ని చూసినా ఆమెకు మైనస్‌లే ఉన్నాయి.  మరి ఎలా పదవి లభించింది ? జగన్ ఏ ఉద్దేశంతో ఆమెకు చోటిచ్చారు ?. అని విశ్లేషిస్తే ఒక్కటే కారణం కనిపిస్తుంది.. అదే ఆమె రెబలిజం.


మంత్రి పదవి కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న రోజా !


మంత్రి పదవి వస్తుందని రోజా మొదటి నుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్యేగా రోజా చాలా పోరాటం చేశారు. ఆమెను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినా పోరాడారు.  ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడ్ని కానీ టీడీపీ నేతల్ని కానీ ఎవరనీ వదల్లేదు. ఈ క్రమంలో తనపై . తన భాషపై విమర్శలు వచ్చినా వెనుకాడలేదు. పార్టీ హైకమాండ్ మెచ్చే స్థాయిలో పోరాటం చేశారు. అందుకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె మంత్రి పదవి ఆశించారు. కానీ సామాజికవర్గాల సమీకరణాల్లో అవకాశం మిస్సయింది. అప్పట్లోనే ఆమె అసంతృప్తికి గురి కావడంతో ఏపీ ఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చారు. రెండో సారి విస్తరణలో మంత్రి పదవి ప్రకటించారు. 


రోజాకు అన్నీ వ్యతిరేకమే !


రోజా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు. ఇదే మొదటిగా ఆమెకు మైనస్ అయింది. రెడ్డి సామాజికవర్గానికి నాలుగు మంత్రి పదవులు కన్నా ఎక్కువ ఇవ్వకూడదని జగన్ నియమం పెట్టుకున్నారు. అదే సమయంలో జిల్లా నుంచి మరో బలమైన నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి తిరస్కరించే పరిస్థితి లేదు. జిల్లాపై పూర్తి స్థాయిలో పట్టు ఉన్న నేత పెద్దిరెడ్డి. ఆయన కూడా రెడ్డి సామాజికవర్గమే కావడంతో ఒకే జిల్లా నుంచి రెండు రెడ్డి సామాజికవర్గాలకు పదవులు ఇచ్చే పరిస్థితి లేదు. అంతే కాదు రోజాకు మంత్రి పదవి ఇవ్వవొద్దని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హైకమాండ్‌పై ఒత్తిడి చేశారన్న ప్రచారం ఉంది. నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రోజాకు వ్యతిరేకంగా పార్టీ నేతలు తిరుగుబాటు చేశారు. ఆమెకు చిత్తూరు జిల్లా నేతల్లోనే మద్దతు తక్కువ. ఇన్ని వ్యతిరేకతలు పెట్టుకుని కూడా జగన్ రోజాకు మంత్రి పదవి ఇచ్చారు. చిత్తూరు జిల్లాకు మూడో మంత్రి పదవి కేటాయించి మరీ ఇచ్చారు.


రోజా రెబలిజమే ఆమెకు రక్ష !


రోజా అంటే ఫైర్ బ్రాండ్ లీడర్. ఆమె పర్యవసానాలు చూడకుండా విమర్శించడమే ఆమె స్టైల్. పెద్దా చిన్నా ఉండదు. ఒకప్పుడు కేసీఆర్‌ను  రాత్రి బార్ - పగలు దర్బార్ అని విమర్శించి సంచలనం రేపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కూడా అంత  కంటే దారుణంగా విమర్శించారు. ఆ తర్వాత చంద్రబాబునూ వదిలి పెట్టలేదు. ఆమె ఎంత వేగంగా కన్నీరు పెట్టుకుంటుందో.. అంతే వేగంగా ఫైర్ బ్రాండ్ నైజం చూపిస్తారు. ఇది ఆమెకు మంత్రి పదవి రావడానికి ప్రత్యేకంగా సహకరించిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 


ోజా అసంతృప్తిని తట్టుకోలేమనే పదవి ఇచ్చారా ?


రోజా మంత్రి పదవిపై ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో వైఎస్ఆర్‌సీపీ పెద్దలకు బాగా తెలుసు. ఆమె గత రెండు, మూడు నెలల నుంచి తిరగని గుడి లేదు. చేయని పూజల్లేవు. జగన్ ఆలోచనలకు తగ్గట్లుగా ప్రతిపక్షాలపై విరుచుకుపడటం... జగన్‌ను పొగడటానికి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో ఆమె టీడీపీలో ఉన్నట్లయియితే.. గత టెర్మ్‌లో ఐదేళ్ల పాటు మంత్రిగా ఉండేవారన్న ఓ ప్రచారం .. నమ్మకం ఆమె వర్గీయుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు అవకాశం కల్పించకపోతే బ్లాస్ అయిపోతారని.. అది పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని వైసీపీ పెద్దలు భావించినట్లుగా తెలుస్తోంది. అందుకే.. సామాజిక వర్గాలు.. జిల్లాల సమీకరణాలు ఏమీ సహకరించకపోయినా ప్రత్యేకంగా రోజా పేరును పరిగణనలోకి తీసుకుని అవకాశం కల్పించినట్లుగా తెలుస్తోంది.  ఓ రకంగా రోజా.. రెబలిజానికి ఈ పదవి దక్కిందని అనుకోవచ్చు. ఎప్పుడూ విధేయత మాత్రమే కాదు.. అంతకు మించిన సొంత ఫైర్ బ్రాండ్ నైజం కూడా పదవి తెచ్చి పెడుతుందని రోజా నిరూపించారని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు