17 Ministers From Backward Classes in AP Cabinet, YS Jagan retains 11 ministers: ఏపీలో నేడు కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కొత్త కేబినెట్‌లో బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారు. తాజా కేబినెట్‌లో ఏకంగా 10 మంది బీసీలకు మంత్రి వర్గం లో చోటు కల్పించారు. దళిత సామజిక వర్గానికి చెందిన అయిదుగురిని మంత్రి పదవులు వరించాయి. బీసీ నేతల్లో ఉత్తర కోస్తాంధ్ర నుంచి ధర్మాన ప్రసాద రావు, సీదిరి  అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడుకు ఏపీ కొత్త కేబినెట్‌లో చోటు కల్పించారు సీఎం జగన్. వారితో పాటు మిగతా బీసీ నేతలు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, విడుదల రజని, గుమ్మునూరి జయరాం, ఉషశ్రీ చరణ్‌లకు కలిపి మొత్తం బీసీలకు 10 మంత్రి పదవులు లభించాయి.


దళితులకు 5 మంత్రి పదవులు
సంక్షేమానికి పెద్దపీట, అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తామని చెప్పే సీఎం జగన్ మరోసారి తన కేబినెట్‌లో అయిదుగురు దళిత నేతలకు అవకాశం కల్పించారు. ఎస్సీల నుంచి తానేటి వనిత, పినిపే విశ్వరూప్, కె.నారాయణ స్వామి, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జునలకు కొత్త కేబినెట్‌లో చోటు దక్కింది. గత మంత్రివర్గంలో ఉన్న హోం మంత్రి మేకతోటి సుచరితను తప్పించి, ఆమె స్థానంలో మేరుగ నాగార్జునని కేబినెట్‌లోకి తీసుకున్నారు జగన్. కొత్త కేబినెట్‌లో పలువురు పాత మంత్రులకు ఛాన్స్ ఇచ్చి, తనను తప్పించడంపై సుచరిత మనస్తాపానికి లోనయ్యారు. కనీసం కోర్ కమిటీని సైతం కలిసే అవకాశం తనకు లభించలేదని తన సన్నిహితుల వద్ద ఆమె వాపోయారు. 


రెడ్లు, కాపులకు చెరో నాలుగు మంత్రి పదవులు
ఏపీ కొత్త కేబినెట్‌లో అధికంగా లబ్ది చేకూరింది రెడ్లు, కాపులకే. అత్యధికంగా ఈ సామాజికవర్గాల నుంచి నలుగురు చొప్పున మొత్తం 8 మంత్రి పదవులు అందుకున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి నలుగురు నేతలు గుడివాడ అమర్‌నాథ్, దాడిశెట్టి రాజా, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబులకు వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆర్కే రోజా, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకు పదవులు లభించాయి. కొత్తగా రోజా, కాకాణిలపై సీఎం జగన్ నమ్మకం ఉంచారు.


ఎస్టీ, మైనార్టీలకు చోటు
ఏపీ కొత్త మంత్రివర్గంలో ఎస్టీ, మైనార్టీ కేటగిరీల నుంచి ఒక్కొక్కరి చొప్పున మంత్రి పదవులు దక్కాయి. ఎస్టీ సామాజిక వర్గం నుంచి పీడిక రాజన్న దొర, మైనార్టీ నుంచి అంజద్ బాషా కేబినెట్‌ బెర్త్ దక్కించుకున్నారు. సీఎం జగన్ చెప్పినట్లుగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మొత్తంగా 17 మంత్రి పదవులు ఇవ్వగా, రెడ్లు-కాపుల నుంచి 8 మందికి ఛాన్స్ లభించింది. ఎన్నికల వ్యూహంలో భాగంగా ఆయా వర్గాలను ఆకర్షించేందుకు ఏపీ కొత్త కేబినెట్‌కు జగన్ శ్రీకారం చుట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియులకు నో ఛాన్స్ 
ఏపీలో కీలక సామాజిక వర్గాల్లో ఒకటైన కమ్మ నేతలకు ఏపీ కొత్త కేబినెట్‌లో చోటు దక్కకపోవడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో కొడాలి నాని ఈ సామాజికవర్గం నుంచి మంత్రిగా చేశారు. తాజాగా ఈ కేటగిరీ నుంచి ఎవరికీ పదవి దక్కలేదు. ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియులను సైతం వైఎస్ జగన్ కొత్త కేబినెట్‌లోకి తీసుకోలేదు. ఆర్యవైశ్యుల నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ ని తప్పించినా మరొకరికి  పదవి ఇవ్వలేదు. క్షత్రియుల నుంచి మంత్రిగా ఉన్న చెరుకువాడ రంగనాథ రాజలను తప్పించారు, కానీ ఆ సామాజివక వర్గాల నుంచి మరొకరికి అవకాశం ఇవ్వకపోవడంతో ఆ వర్గాల వారు తీవ్ర నిరాశచెందినట్లు తెలుస్తోంది. 


Also Read: AP New Cabinet: ఏపీ కేబినెట్‌పై ఉత్కంఠకు తెర - జిల్లాల వారీగా కొత్త మంత్రుల ఫైనల్ లిస్టు ఇదే 


Also Read : AP New Ministers : కొత్త కేబినెట్ లో ఊహించని ట్విస్టులు, రోజా, అంబటికి లక్కీ ఛాన్స్, కొడాలి ప్లేస్ గల్లంతు!