వైఎస్ఆర్‌సీపీలో జగన్ మాటంటే మాట. ఎదురు చెప్పే వారు ఎవరూ లేరు. అందుకే వంద శాతం కేబినెట్‌ను మారుస్తామన్నా అందరూ సై అన్నారు కానీ ఒక్కరూ కూడా అదేంటని అడగలేదు. కానీ తీరా మంత్రివర్గాన్ని మార్చేసిన తరవాత సీన్ మారిపోయింది. ఒక్క సారిగా అసంతృప్తి ఎగసి పడింది. బయటపడిన అసంతృప్తి కొంతే కానీ.. లావాలా పార్టీ నేతలు గుండెల్లో దాచుకున్నది ఎంతో ఉందన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. పార్టీపై జగన్‌కు ఉన్న పట్టులో లోపం ఉందా ? అసంతప్తిని ఎందుకు ముందుగానే అంచనా వేయలేకపోయారు ? 


రోడ్డెక్కిన వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ !  
 
వైసీపీలో జగన్ ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లు  ! ఆయన మాటకు తిరుగులేదు. మంత్రి పదవుల్ని ప్రకటించే వరకూ ఇదే. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎక్కడ చూసినా అసంతృప్తే కనిపిస్తోంది. ప్రతి పార్టీలోనూ అసంతృప్తి సహజం. ఎందుకంటే  అన్ని అవకాశాలూ అందరికీ ఇవ్వలేరు. కానీ వాటిని ఆశించేవారు ఎక్కువ మందే ఉంటారు. అయితే వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి వేరు. ఆ పార్టీలో అసంతృప్తి ఉన్నా  బయటపడుతుంది అని ఎవరూ అనుకోలేదు. రోడ్డెక్కుతారని.. రాజీనామాల వరకూ వెళ్తారని భావించలేదు. కానీ ఇక్కడ బాలినేనిశ్రీనివాస రెడ్డి, సుచరిత వంటివాళ్లు రాజీనామాలకు సిద్ధపడ్డారు. తమకు ఎమ్మెల్యే పదవులు కూడా వద్దంటున్నారు. చాలా చోట్ల నేతలు మీడియా ముందే కన్నీరు పెట్టుకున్నారు. తలుపుకుని వేసుకుని ఏడుస్తున్న వారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి అభిమానులు. అనుచరులు రోడ్లపైకి వచ్చి చేస్తున్న రచ్చతో వారి అసంతృప్తి వెల్లువెత్తుతోంది. 


అంచనాలను తప్పడమే అసంతృప్తికి కారణం !


వైఎస్ఆర్‌సీపీ పూర్తి వ్యవస్థపై హైకమాండ్‌కు పట్టు ఉంది. కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే అసలు అసంతృప్తికి బయటకు కనిపించేది కాదన్న అభిప్రాయం ఉంది. ఇలా అసంతృప్తి బయటపడటానికి మొదటి కారణం పూర్తి స్థాయి కేబినెట్‌ను మార్చుతామని చెప్పి. చివరికి దాదాపుగా సగం మందిని కొనసాగించడం. ఇప్పుడు తీసేసిన వారు చాలా ఫీలవుతున్నారు.  బాలినేని శ్రీనివాసరెడ్డి తనను ఏ కారణంతో తీసేశారో అంతుబట్టడం లేదు. జిల్లాలో మరో మంత్రి ఆదిమూలం సురేష్‌ను కొనసాగించి తనను తీసేయడంతో ఆయన పరువు పోయినట్లుగా ఫీలవుతున్నారు. అచ్చగా ఇలాంటి పరిస్థితే హోంమంత్రి సుచరితది. నిజానికి వీరు పార్టీ చెప్పింది చేశారు .. పార్టీ కోసం చేశారు తప్ప.. సొంత రాజకీయం ఎప్పుడూ చేయలేదు.  అందుకే తమ ప్రాధాన్యం ఉంటుందని అనుకున్నారు. కానీ ఏ ప్రయోజనమూ లేకుండా పోయింది. అసంతృప్తి వెల్లువెత్తడానికి వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ చేసిన వ్యూహాత్మక నిర్ణయాలే కారణం అనుకోవచ్చు. 


ఆశావహులు ఎక్కువ కావడమూ మరో కారణం !


ఏపీలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేల్లో 151 మంది వైఎస్ఆర్‌సీపీకే ఉన్నారు. అందులో చాలా మంది సీనియర్లు ఉన్నారు. మాజీ మంత్రులు ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో చక్ర ంతిప్పిన వారు ఉన్నారు. ఇంకా ముఖ్యంగా జగన్ వెంట మొదటి నుంచి నడిచిన వారున్నారు.  పదేళ్ల పాటు అనేక ఖర్చులు పెట్టుకుని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు వస్తాయని ఎదురు చూస్తున్న వారికి రెండో సారి కూడా చాన్స్ మిస్సయింది. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి లాంటి నేతలంతా ఇప్పుడు మా పరిస్థితి ఏమిటని అసంతృప్తికి గురవుతున్నారు. అది వారి అనుచరులు వ్యక్తం చేస్తున్నారు.  మొదటి విడతలో మంత్రి పదవులు రాక అసంతృప్తికి గురైన చాలా మంది ఇప్పుడు అవకాశం వస్తుందని ఎదురు చూశారు. కానీ ఇప్పుడూఅవకాశం దక్కలేదు.   


మధ్యలో పార్టీలోకి వచ్చిన వారికి అందలం ఎక్కించడం క్యాడర్ అసంతృప్తికి మరో కారణం !


మధ్యలో పార్టీలోకి వచ్చిన వారికి పదవులు దక్కాయి. టిక్కెట్ హామీతో పార్టీలో చేరిన విడదల రజనీతో పాటు పదవులన్నీ అనుభవించిన తర్వాత జగన వెంట నడిచిన ధర్మాన ప్రసాదరావు, బొత్స , పెద్దిరెడ్డి వంటి వారికి పదవులు లభించాయి. రాజకీయాల్లో ఎవరికైనా  పదవులు పొందాలనే ఆశ ఉంటుంది. అదే లక్ష్యంతో ఎవరైనా పని చేస్తారు. నిజానికి వారికి మొదట్లో పదవులు ఇవ్వకపోతే పెద్దగా ఫీలయ్యేవారు కాదు కానీ ఇచ్చి తీసేయడం వల్ల ఎక్కువ ఫీల్ అవుతున్నారు. అయితే బయటపడింది కొంతేననని.. మనసులో గూడు కట్టుకుపోతున్నది చాలా ఉందని వైసీపీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది.  


వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ అసంతృప్తి టీ కప్పులో తుఫానేనా ? నిజంగానే తుఫాన్ అవుతుందా ?


మంత్రివర్గ కూర్పు విషయంలో ఎవరినీ బుజ్జగించాల్సిన అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి రెండు రోజుల కిందట చెప్పారు. ఆయన ఉద్దేశం రెండు రకాలుగా ఉండొచ్చు. ఎందుకంటే ఎవరైనా అసంతృప్తికి గురైనా బుజ్జగించబోమని ఇష్టం వచ్చింది చేసుకోమన్న సందేశం ఒకటి... అలాగే జగన్ మాటను ఎవరూ జవదాటరని అందరూ సంతృప్తి చెందుతారని బుజ్జగించే అవకాశం రాదన్న అభిప్రాయం మరొకటి ఉందని అనుకోవచ్చు. కానీ మంత్రుల పేర్లు ప్రకటించిన తర్వాత ఆ పరిస్థితి లేదు . స్వయంగా సజ్జల రెండు సార్లు బాలినేని ఇంటికి వెళ్లారు. ఇతర నేతల ఇళ్లకు బుజ్జగింపులకు ప్రతినిధుల్ని పంపారు. అయితే వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తి టీ కప్పులో తుఫానేనని.. అంతా సర్దుకుంటుందని ఆ పార్టీ అగ్రనాయకత్వం నమ్ముతోంది. అయితే పరిస్థితి అలా లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.  ఎక్కువ మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఇక తమకు రాజకీయ  భవిష్యత్ ఉండదన్న ఆలోచనలో ఉన్నారని అందుకే వారు బాలినేనితో ప్రత్యేక చర్చలు జరుపుతున్నారని అందరూ కలిసి షర్మిలను కలుస్తారని అంటున్నారు. అయితే ఇంత ఎక్స్‌ట్రీమ్ స్టెప్ వేస్తారా అనే సందేహాలు సహజంగానే వస్తాయి. రాజకీయాల్లో ఏదైనా  అసాధ్యం కాదు. కానీ ప్రస్తుతానికి వైఎస్ఆర్‌సీపీ అధికార పార్టీ. ఇంకా రెండేళ్ల పాటు అధికారం ఉంది. అందుకే అసంతృప్తిని చల్లార్చడం ఆ పార్టీ అగ్రనాయకత్వానికి పెద్ద సమస్య కాదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.