యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు తెరకు కథానాయకుడిగా (చైల్డ్ ఆర్టిస్ట్) పరిచయమైన సినిమా 'రామాయణం'. ఏప్రిల్ 11, 1997లో విడుదల అయ్యింది. అంటే... ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నేటికి సరిగ్గా పాతికేళ్ళు. అంటే... హీరోగా ఎన్టీఆర్ వయసు 25 ఏళ్ళు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయనకు ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్. టాలీవుడ్‌లో ఆయన ప్రవేశించి పాతికేళ్ళు అన్నమాట.
'రామాయణం' చిత్రంలో ఎన్టీఆర్ బాల రాముడిగా కనిపించారు. ఈ సినిమా కంటే ముందు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కథానాయకుడిగా నటించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' చిత్రంలో బాల నటుడిగా కనిపించారు. హీరోగా అయితే 'రామాయణం' తొలి సినిమా.
ఎం.ఎస్. రెడ్డి నిర్మించిన 'రామాయణం' చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. దీనికి ఉత్తమ బాలల చిత్రంగా నంది అవార్డు వచ్చింది. సీనియర్ ఎన్టీఆర్ పలు పౌరాణిక చిత్రాలు చేశారు. తెలుగు ప్రజలకు రాముడు అంటే ఆయనే. కృష్ణుడు అన్నా ఆయనే గుర్తు వస్తారు. రాముడిగా అద్భుత అభినయం ప్రదర్శించిన ఎన్టీఆర్, తాతకు తగ్గ మనవడు అని తొలి సినిమాతో నిరూపించుకున్నారు.
Also Read: ప్రభాస్ అభిమానులు ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది
'రామాయణం' విడుదలైన ఐదేళ్లకు 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత చేసిన 'స్టూడెంట్ నంబర్ 1' సినిమా ఎన్టీఆర్ కు భారీ విజయం అందించింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.
Also Read: 'జెర్సీ' విడుదల వాయిదా - 'కెజియఫ్' క్రేజ్ కారణమా?