తెలుగు బుల్లితెరపై విశేష ప్రేక్షకాదరణ పొందిన షోలలో 'డ్రామా జూనియర్స్' ఒకటి. చిన్న పిల్లల్లో ఉన్న టాలెంట్ ను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో మొదలైన ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే ఈ టీవీ షో, ఇప్పటికే ఐదు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొని ఆరో సీజన్ లో అడుగుపెట్టింది. లేటెస్టుగా 'డ్రామా జూనియర్స్ 6' షో కొత్త ఎపిసోడ్ కు సంబంధించిన డిజిటల్ ప్రోమోని నిర్వాహకులు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
'డ్రామా జూనియర్స్ 6' షోకి టాలెంటెడ్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా చేస్తున్నారు. సీనియర్ నటి జయప్రద, ప్రముఖ కమెడియన్ బాబు మోహన్ మరియు ఒకప్పటి హీరోయిన్ శ్రీదేవిలు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రసారమైన ఏడు ఎపిసోడ్లకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో ''ఎక్స్ట్రార్డినరీ, అమేజింగ్ సూపర్ ఎంటర్టైన్మెంట్ స్కిట్స్ తో తమ డ్రామాతో అలరించడానికి వచ్చేస్తున్నారు మన చిచ్చర పిడుగులు'' అంటూ తాజాగా 8వ ఎపిసోడ్ ప్రోమోని జీ తెలుగు టీమ్ రిలీజ్ చేసింది. ఇందులో బాబు మోహన్ ఎమోషనలై కంటతడి పెట్టుకోవడం అందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది.
Also Read : హీరోల రెమ్యూనరేషన్లపై పార్లమెంటులో చర్చ దురదృష్టం - చిరంజీవి స్పీచ్ Full Video చూశారా?
ప్రోమోలోకి వెళ్తే, సీరియల్ నటీనటులు రవికిరణ్ - సుష్మలు ఈసారి ఎమోషనల్ స్కిట్ తో వచ్చారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన ఓ అమ్మాయి.. అనారోగ్యంతో మంచాన పడిన తండ్రి బాగోగులు చూసుకుంటూ, తనకు పెళ్ళైన తర్వాత తండ్రి పరిస్థితి ఏంటా అని బాధ పడటాన్ని ఈ డ్రామాలో చూపించారు. ఇది చూసిన బాబూ మోహన్ తన తల్లిని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. “నేను మూడో తరగతిలో ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. నాకు చిన్న చెల్లెలు ఉంది. నేనే తనకు తల దువ్వి జడ వేసేవాడిని. మా నాన్న ఎటో వెళ్లిపోయాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు” అంటూ బాబు మోహన్ కన్నీరు పెట్టుకున్నారు. ఆయన మాటలకు మిగతా జడ్జిలతో పాటుగా, షోలో ఉన్నవారంతా ఎమోషనల్ అయ్యారు. వీక్షకులను కంటతడి పెట్టిస్తున్న ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.
అయితే 'డ్రామా జూనియర్స్ 6' లేటెస్ట్ ఎపిసోడ్ లో ఎమోషనల్ స్కిట్ తో పాటుగా ఎప్పటిలాగే అందరినీ నవ్వుంచే డ్రామాలు కూడా ఉన్నాయని ప్రోమోతో హింట్ ఇచ్చారు. 'దేవతలు కూడా అలుగుతారు' అంటూ శ్రీదేవిని ప్రదీప్ కూల్ చెయ్యడం.. మేడమే ఒక రోజా పువ్వులా ఉంటారు అందుకే రోజా తీసుకురాలేదంటూ పక్కనే బుంగమూతి పెట్టుకున్న జయప్రదను బుజ్జగించడం వంటివి అలరిస్తున్నాయి. అలానే చిన్న పిల్లలు చేసిన సారపట్ట పరంపర స్కిట్, జూనియర్ బాలకృష్ణ 'బతుకు బండి విత్ బాలయ్య' స్కిట్‌లు ఈ ప్రోమోలో ఆకట్టుకున్నాయి. పూర్తి ఎపిసోడ్ ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. కామెడీ మరియు ఎమోషన్ కలబోసిన ఈ ఎపిసోడ్ ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial