పవన్ కల్యాణ్, అనుష్క శెట్టి హీరో, హీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు  ఓ సినిమాను ప్లాన్ చేశారు. జీసస్ జీవితం చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ సినిమా కోసం అనుష్క, పవన్ సంతకాలు కూడా చేశారు. ఈ చిత్రంలో అనుష్కను దేవదూతగా చూపించాలని సింగీతం ప్రయత్నం చేశారు. అరుంధతి చిత్రంలో ఆమె చేసిన పాత్ర చూసిన ఆయన ఈ సినిమాలో ఎంపిక చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు  ‘ప్రిన్స్ ఆఫ్ పీస్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీలో పవన్ కల్యాణ్ ను ఆర్కిటెక్ గా చూపించాలి అనుకున్నారట. కొండా కృష్ణంరాజు నిర్మాతగా ఈ సినిమా తెర మీదకు వచ్చింది. 


దైవ కుమారుడిగా క్రీస్తు రాక నుంచి మొదలయ్యే ఈ కథలో పాత్రల కోసం పలువురు బాల బాలికలను ఎంపిక చేశారట. వారిలో చాలా మంది 10 నుంచి 14 ఏళ్ల లోపు వారేనట.  క్రీస్తు, మేరీ మాత పాత్రలకు ప్రముఖుల పిల్లల్ని తీసుకున్నట్లు తెలిసింది. 14 సంవత్సరాల బాలుణ్ని 30 సంవత్సరాల క్రీస్తుగా చూపించేందుకు అప్పట్లోనే ప్రత్యేక మెకప్ టెక్నిక్స్ సైతం వాడాలని భావించారట. ఈ సినిమాను తెలుగులో అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారట.


ఈ ప్రతిష్ట్మాత్మక చిత్రాన్ని అప్పట్లోనే తెలుగు, హిందీ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించాలని భావించారు. ఇందులో భాగంగా సినిమా యూనిట్ జెరూసలేంలో పర్యటించింది. జీసెస్ చరిత్రకు సంబంధించిన పలు విషయాలను పరిశీలించింది. పవన్ కళ్యాణ్, సింగీతం కలిసి జోర్డాన్ వెళ్లి మరీ లొకేషన్స్ చూసి ఫైనలైజ్ చేసుకున్నారు. జె.కె.భారవి, సింగీతం శ్రీనివాసరావు, కొండా కృష్ణంరాజు ఈ సినిమాకు సంబంధించి రెండేళ్ల పాటు కథను తయారు చేసారట. అన్నీ ఓకే అయి సినిమా సెట్స్ మీదకు పోతుంది అనుకున్న తరుణంలో  చిత్రం ఆగిపోయిందనే ప్రకటన వచ్చింది. ఈ సినిమా ఆగిపోవడానికి ప్రధాన కారణం బడ్జెట్. ముందుగా  అనుకున్న బడ్జెట్ కన్నా చాలా ఎక్కువ అవుతోందని తేలిందట. దీంతో సింగీతం, కృష్ణం రాజు కలిసి సినిమా ఆపేయాలనే నిర్ణయానికి వచ్చారట.


కొంత కాలం క్రితం ఈ సినిమాకు సంబంధించి సింగీతం శ్రీనివాసరావు కీలక విషయాలు వెల్లడించారు. ఈ సినిమాకు సంబందించి తను కేవలం ప్రెస్ మీట్ మాత్రమే పెట్టానని చెప్పారు. “వాస్తవానికి సినిమా షూటింగ్ ఇంకా మొదలు పెట్టలేదు. జెరుసలేంలో ప్రెస్‌మీట్ పెట్టాం అంతే. కానీ తొలి షెడ్యూల్ అయిపోయింది, రెండో షెడ్యూల్ అయిపోయింది అని వార్తలొచ్చాయి. వాటి గురించి నాకైతే తెలీదు” అన్నారు. అయితే, ఈ సినిమాలో పవన్ ది గెస్ట్ రోల్ అని చెప్పారు. తాము జీసెస్ కథ ఆధారంగా సినిమా చేయాలనుకున్నామని చెప్పారు.  ఈ సినిమా కోసం జీసస్‌కి సంబంధించిన చాలా  పుస్తకాలు చదివినట్లు చెప్పారు. చివరకు బైబిల్ కూడా చదివినట్లు వెల్లడించారు. ఈ సినిమా పుణ్యమా అంటూ క్రీస్తు పుట్టిన బెత్లహాంకు వెళ్లామన్నారు. ప్రశాంతత అంటే ఏంటో అక్కడ తనకు తెలిసిందన్నారు. అయితే, బడ్జెట్ సహకరించకనే ఈ సినిమా నిర్మాణాన్ని ఆపేసినట్లు సింగీతం వెల్లడించారు.


Also Read: క్రియేటివిటీకి కళ్లజోడు పెడితే.. సింగీతం శ్రీనివాసరావు 



Also Read : రాంగ్ రూట్‌లో ఆస్కార్స్‌కు 'ఛెల్లో షో'? - సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న డౌట్స్ ఇవే!