Bathukamma 2022 Celebrations:  తెలంగాణలో మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన పండుగ 'బతుకమ్మ'. భాద్రపద  అమావాస్య రోజు ఎంగిలి బతుకుమ్మతో ప్రారంభమైన వేడుకలు ఆశ్వయుద్ధ శుద్ధ అష్టమి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ప్రకృతిలో లభించే ప్రతీ పూవును ఏరికోరి బతుకమ్మలను తయారు చేయడం, వాటిని ఇంటి ముందు, వీధుల్లో, ఆలయాల ముందు ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ ఆడిపాడడం ఎంతో ఆనందాన్నిస్తుంది. గుమ్మడి పూలలోని పసుపు వర్ణంలో ఉన్న దిద్దుని గౌరీ దేవిగా భావిం చి అందులో పసుపు గౌరమ్మను నిల్పి  ముస్తాబు చేస్తారు. మహిళలు, పిల్లలు అనే వయోబేధం లేకుండా ఆడిపాడుతారు. 


Also Read: ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయే చందమామ, ప్రకృతిని ఆటపాటలతో పూజించే 'బతుకమ్మ' వెనుక ఎన్ని కథలో!


సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 3 వరకూ ఏ రోజు ఏ బతుకమ్మను పూజిస్తారంటే...
సెప్టెంబరు 25 - ఎంగిలి పూల బతుకమ్మ
మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ పితృ అమావాస్య (మహాలయ అమావాస్య – భాద్రపద అమావాస్య) నాడు జరుగుతుంది.
సెప్టెంబరు 26 - అటుకుల బతుకమ్మ
రెండో రోజు అటుకుల బతుకమ్మ ఇది ఆశ్వయుజమాసం (నవరాత్రి కలశ స్థాపన)మొదటి రోజు జరుపుకుంటారు
సెప్టెంబరు 27 - ముద్దపప్పు బతుకమ్మ
ఆశ్వయుజ మాసం (ప్రీతి విదియ)లో రెండో రోజు  ముద్దపప్పు బతుకమ్మ
సెప్టెంబరు 28 - నానే బియ్యం బతుకమ్మ
ఆశ్వయుజ  మూడోరోజైన తదియ రోజు నానేబియ్యం బతుకమ్మ
సెప్టెంబరు 29 - అట్ల బతుకమ్మ
ఆశ్వయుజ మాసంలో నాలుగో రోజైన చవితి రోజు అట్ల బతుకమ్మ
సెప్టెంబరు 30 - అలిగిన బతుకమ్మ
ఆశ్వయుజ మాసంలో పంచమి రోజు అలిగిన బతుకమ్మ
అక్టోబరు 1 - వేపకాయల బతుకమ్మ
ఆశ్వయుజ మాసంలో షష్టి రోజు వేపకాయల బతుకమ్మ
అక్టోబరు 2 - వెన్నముద్దల బతుకమ్మ
ఆశ్వయుజ మాసం సప్తమి రోజు వెన్నముద్దల బతుకమ్మ
అక్టోబరు 3 -సద్దుల బతుకమ్మ
బతుకమ్మ పండుగ చివరి రోజు ఆఖరి రోజును సద్దుల బతుకమ్మ అంటారు. బతుకమ్మలను సాధారణ రోజుల కంటే పెద్ద పరిమాణంలో తయారు చేసి నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ పండుగను దుర్గా అష్టమి రోజు జరుపుకుంటారు..అప్పుడప్పుడు తిథులు తగులు-మిగులు వచ్చినప్పుడు మహర్నవమి రోజు కూడా చేస్తారు.


Also Read: బతుకమ్మని పూలతోనే ఎందుకు పేరుస్తారు, తప్పనిసరిగా వినియోగించాల్సిన పూలు ఏవి!


బతుకమ్మ ఎప్పుడు ప్రారంభమైంది
బతుకమ్మ పండగ తెలంగాణలో ఎప్పుడు ప్రారంభమైందో చెప్పడానికి సరైన ఆధారాలు లేవు కానీ..వేల సంవత్సరాల నుంచీ ఇది కొనసాగుతూ వస్తోందని చెప్పేందుకు చాలా కథలు చెబుతారు. అందులో ముఖ్యమైనది అమ్మవారి కథ. జగన్మాత మహిషాసురుడిని చంపిన తర్వాత అలసటతో మూర్చపోయిందట. ఆమెను మేల్కొల్పేందుకు స్త్రీలంతా కలిసి గుమిగూడి పాటలు పాడారట. ‘బతుకమ్మా’ అంటూ ఆమెను వేడుకున్నారట. సరిగ్గా పదో రోజు ఆమె నిద్ర లేచిందట. అప్పటి నుంచీ ఆమె స్థానంలో పూలను ఉంచి పూజించడం ఆనవాయితీగా మారిందని చెబుతారు. బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల్లో అలిగిన బతుకమ్మ రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులూ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు.. ఆ ఒక్కరోజు అమ్మవారు అలుగుతుందని అందుకే అలిగిన బతుకమ్మ అంటారని చెబుతారు.