'ఛెల్లో షో'... 'ఆర్ఆర్ఆర్'... ఆస్కార్... ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే పదాలు వినపడుతున్నాయి, కనపడుతున్నాయి కూడా! ప్రతి ఒక్కరి డిస్కషన్, ఆ మాటకు వస్తే... డిస్కషన్స్ అన్నీ వీటి గురించే! 'RRR'ను ఆస్కార్ కు పంపించకపోవటం తప్పని కొందరు... ఆర్ట్ సినిమానే పంపాలనుకుంటే 'కశ్మీర్ ఫైల్స్' ఉందని మరికొందరు.... చాలా మంది ఎమోషనల్ అవుతున్నారు. మనకు తెలిసిన విషయం, ఎమోషన్ వేరు. రియాల్టీ వేరు. రియాల్టీ ఏంటంటే... గుజరాతీ సినిమా 'ఛెల్లో షో'ను ఆస్కార్ కు పంపాలని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. పదహారు మంది సభ్యులున్న ఇండియన్ సబ్మిషన్ ఫర్ ఆస్కార్ జ్యూరీ ఏకగ్రీవంగా 'ఛెల్లో షో'కు ఓటేసి ఆ సినిమాను భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్స్ కు పంపిస్తోంది. అయితే.... 'ఛెల్లో షో' ఎంపికపై కొన్ని సందేహాలు ఉన్నాయి. అవి కంటెంట్ గురించో లేదా క్వాలిటీ గురించో కాదు. ఎంపిక గురించి. అది ఫాలో కావాల్సిన రూల్స్ గురించి.  'ఛెల్లో షో'ను ఆస్కార్ అఫీషియల్ సబ్మిషన్ లో TOP 5 ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో ఓ సారి చూద్దాం.


గతేడాది షార్ట్ లిస్ట్ లోనూ ఉన్న 'ఛెల్లో షో':
'ఛెల్లో షో' సినిమా 2023 ఆస్కార్స్ కోసం భారత్ నుంచి అధికారికంగా పంపిస్తున్న సినిమా. కానీ ఇదే సినిమా గతేడాది కూడా ఆస్కార్స్ లో భారత్ తరపున వెళ్లేందుకు సెలెక్ట్ అయ్యింది. ఆస్కార్స్ కి ఇండియా తరపున ఒక సినిమాను పంపించేందుకు ముందు భారత్ లో ఆ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో ది బెస్ట్ 14 సినిమాలను షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత జ్యూరీ సభ్యుల నిర్ణయంతో ఆ 14 సినిమాల్లో ఒక సినిమాను భారత్ నుంచి అధికారికంగా సెలెక్ట్ చేసి ఆస్కార్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీలో పంపిస్తారు. 2021లో విడుదలైన 'షేర్షా', 'మండేలా', 'షేర్ని', 'పెబల్స్' సినిమాతో పాటు 'ఛెల్లో షో' కూడా లాస్ట్ ఇయర్ షార్ట్ లిస్టెడ్ సినిమాల్లో ఉంది. అయితే, అప్పుడు పక్కన పెట్టారు. ఒకే సినిమాను వరుసగా రెండేళ్లు షార్ట్ లిస్ట్ చేయొచ్చా? అనే అంశంపై సందేహాలు ఉన్నాయి. ఆస్కార్ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే అధికారికంగా ఏదైనా దేశం నుంచి వచ్చే సినిమా మరుసటి ఏడాది మళ్లీ ఏ విభాగంలోనూ పోటీ కి రాకూడదు. కానీ ఇది లాస్ట్ అఫీషియల్ సబ్మిషన్ కాలేదు కాబట్టి... ఈసారి పంపించి ఉంటారు.  గతంలో ఏదైనా సినిమాను ఇలా వరుసగా రెండేళ్లు కన్సిడర్ చేశారా? అనే అంశంపై ఎక్కడా స్పష్టత లేదు.


కటాఫ్ డేట్:
ఆస్కార్క్స్ కు ఇంటర్నేషన్ ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీలో పంపించే సినిమాలకు అకాడమీ కొన్ని నిబంధనలు పెట్టింది. అందులో ముఖ్యమైనది సినిమా ఎప్పుడు విడుదలైంది అని! అకాడమీకి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ లో ఏముంది ఉంటే... 1 జనవరి 2022 నుంచి 30 నవంబర్ 2022 లోపు విడుదలయ్యే సినిమాలనే విదేశీ చిత్రాల క్యాటగిరీలో పంపించాలనే నిబంధన ఉంది. కానీ, 'ఛెల్లో షో' మొదటిసారిగా విడుదలైంది ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో. 10 జూన్ 2021 న ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఛల్లో షో ను విడుదల చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ లో బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో, అక్టోబర్ లో వెల్లాడోలిడ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'ఛెల్లో షో' విడుదలైంది. 2021లో విడుదలైన సినిమాను 2023 ఆస్కార్స్ కోసం ఎలా పంపిస్తారు? అనేది మరో డౌట్. అయితే, ఇక్కడే గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే... ఈ సినిమా ఇండియాలో ఎక్కడా రిలీజ్ కాలేదు ఇప్పటికి. ఆస్కార్ నిబంధనల్లో ఏముందంటే... ఏ దేశమైతే విదేశీ చిత్రాల క్యాటగిరీలో సినిమాలను పంపిస్తుందో ఆ దేశంలో ప్రాపర్ పబ్లిసిటీతో పంపించే సినిమా కనీసం వారం రోజుల పాటు ఆడాలని ఉంది. పూర్తిగా కమర్షియల్ గా ఉండాలి ఈ ప్రాసెస్! అంటే, సినిమా టిక్కెట్లను డబ్బులకు అమ్మాలి, ఫ్రీగా చూపించకూడదు. ఇండియాలో ఇప్పటికీ రిలీజ్ కానీ 'ఛెల్లో షో'ను అక్టోబర్ 14 న రిలీజ్ చేసేందుకు రాయ్ కపూర్ ఫిల్మ్స్ ముందుకు వచ్చింది.  సో లాస్ట్ ఇయర్ షార్ట్ లిస్ట్ నుంచి అఫీషియల్ ఎంట్రీగా వెళ్లుంటే ఈ సినిమా వెళ్లుంటే అప్పుడే రిలీజ్ చేసేవాళ్లు. అప్పుడు వెళ్ల లేదు కాబట్టి విడుదల చేయకుండా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారనే స్పష్టమవుతోంది.




రీమేక్ సినిమాలకు ఛాన్స్ తక్కువ:
సాధారణంగా రీమేక్ సినిమాలకు అవార్డులు ఇవ్వటానికి చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ అంగీకరించవు. భారత్ లో కూడా జాతీయ అవార్డులను అందించేందుకు రీమేక్ సినిమాలను పెద్దగా కన్సిడర్ చేయరు. నాగార్జున, కార్తీల 'ఊపిరి' ఎంత బాగున్నా 'ఇన్ టచబుల్స్'ను చూసి తీసిన సినిమాగానే కన్సిడర్ చేస్తారు. కానీ, ఒరిజినల్ అనరు. అందుకే ఆస్కార్స్ లో స్క్రీన్ ప్లే ను రెండు గా కన్సిడర్ చేస్తారు. ఒకటి బెస్ట్ ‍‍ఒరిజినల్ స్క్రీన్ ప్లే, రెండు అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అని రెండు విభాగాల్లో ఇస్తారు. ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఓన్ గా ఆ రైటర్ రాసుకున్న కథ. అడాప్టెడ్ అంటే చాలా సందర్భాల్లో పుస్తకాల నుంచో, లేదా మరేదైనా సినిమాల నుంచి తీసుకున్నది గానో కన్సిడర్ చేస్తారు. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇన్ని క్యాటగిరీలు ఉండవు కాబట్టి ఒరిజనల్ కే కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇంతకీ ఇప్పుడు ఆస్కార్ కు వెళ్లిన 'ఛెల్లో షో' సినిమా 1988లో వచ్చిన 'సినిమా పారడైసో' (Cinema Paradiso) అనే ఇటాలియన్ సినిమాకు రీమేక్. నేపథ్యాన్ని ఇండియాకు  మార్చారు. కానీ కథ మాత్రం ఒకటే. పైగా 'సినిమా పారడైసో' సినిమాకు ఆ ఏడాది ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. సో ఈ పాయింట్ నుంచి చూస్తే 'ఛెల్లో షో' సినిమా సెలక్షన్ పై అభ్యంతరాలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఆస్కార్ అందుకున్న కథకు మళ్ళీ ఆస్కార్ ఎందుకు ఇస్తారు? అని.



బజ్ లేని సినిమా :
సాధారణంగా ఆస్కార్స్ కోసం అకాడమీ కమిటీలు సినిమాలను చూస్తుంటాయి. ఆయా దేశాల నుంచి షార్ట్ లిస్ట్ అయి వచ్చిన సినిమాలను ఒక్కొక్కటిగా చూస్తూ ఫైనల్ రౌండ్ కు కొన్ని సినిమాలను సెలెక్ట్ చేస్తాయి. ఆ తర్వాత ఫైనల్ రౌండ్ జరుగుతుంది. చివరకు ఓ ఐదు సినిమాలను మాత్రమే నామినేషల్ లోకి తీసుకుంటాయి. సో ఇదంతా జరిగేలోపు చాలా సినిమాలు సైడ్ కు వెళ్లిపోతాయి. ఉదాహరణకు గతేడాది ప్రపంచవ్యాప్తంగా 93 దేశాలు తమ దేశాల తరపున ఆస్కార్ కు అఫీషియల్ ఎంట్రీగా సినిమాలను పంపించాయి. అంటే 93 సినిమాలను అకాడమీ మెంబర్స్ చూసి సినిమాలను సెలెక్ట్ చేయాలి. ఇలాంటి సందర్భాల్లో అసలు ఎలాంటి బజ్ లేని సినిమాలను చూసి వాటికి స్కోర్ వేసే కంటే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న సినిమాలను ముందు చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇది ఏ ఫిల్మ్ ఫెస్టివల్ లోనైనా జరిగేది. అలాంటప్పుడు సినిమాకున్న బజ్ ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా బజ్ ఉన్న సినిమాలకు ఆస్కార్ రేసులో దూసుకెళ్లేందుకు కొంచెం ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ మధ్య రూల్స్ మారాయి కానీ మొన్నటి దాకా అకాడమీ స్క్రీనింగ్స్ లో పర్సెంటేజ్ ఉండేది. అంటే... 'సినిమాలో ఏదో ఓ సన్నివేశం చూసి లేదా ఇంత ఫస్టాఫ్ చూశాం. సెకండాఫ్ చూశాం. క్లైమాక్స్ చూశాం' లాంటివి చెప్పేవాళ్లు అకాడమీ మెంబర్స్. మీరు నమ్మలేకున్నా ఇది నిజం. ఇలానే చాలా బజ్ లేని సినిమాలు అకాడమీ స్క్రీనింగ్ లో మరుగున పడిపోతాయి. అదే సినిమాకు బజ్ ఉంటే మెంబర్స్ మొత్తం చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనేది ఫ్యాక్ట్.
   
'ఛెల్లో షో' వెనుక ఉంది ఎవరు?
సోషల్ మీడియాలో ఇది గుజరాతీ సినిమా కాబట్టి ఆస్కార్స్ కు పంపిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నా అది సరైనది కాదు. ఎందుకంటే... గతేడాది అంటే 2021లో తమిళ్ సినిమా 'పెబుల్స్'ని ఆస్కార్ కు పంపిస్తే... 2020లో మలయాళం సినిమా 'జల్లికట్టు'ను పంపించారు. సో... సౌత్ సినిమా అనే చిన్న చూపు చూస్తున్నారనే భావన సరి కాదు. కానీ 'ఛెల్లో షో'కు లాబీయింగ్ భారీ స్థాయిలో జరిగిందనే విమర్శల్లో లాజిక్ ఉంది. అదేంటంటే... ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు భారత్ లో ముందుకు వచ్చింది రాయ్ కపూర్ ఫిల్మ్స్. దాని అధినేత సిద్దార్డ్ రాయ్ కపూర్. ఆయన విద్యా బాలన్ భర్త. ఈయన UTVకి మాజీ సీఈఓ. ఇప్పుడు Walt Disney Indiaకి ఎండీ. అంతే కాదు ప్రొడ్యూసర్ గిల్డ్ ఇండియా కి ప్రెసిడెంట్, CII Media& Entertainment Chairman. భారత్ నుంచి సినిమాలను ఆస్కార్ కు అఫీషియల్ సబ్మిట్ చేసే బాధ్యత ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, స్టూడియో ఓనర్లతో ఏర్పాటైన అపెక్స్ బాడీ. 18వేల మంది ప్రొడ్యూసర్లు, ఇరవై వేల మంది డిస్ట్రిబ్యూటర్లు, 12వేల మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్న ఈ అపెక్స్ బాడీలో లాబీయింగ్ చేయాలంటే చాలా కష్టమైన పని అయినప్పటికీ ప్రొడ్యూసర్ గిల్డ్ ఇండియాకి ప్రెసిడెంట్ గా ఉన్న సిద్ధార్థ్ తన సినిమాను వరుసగా రెండేళ్లు ఫెడరేషన్ లో షార్ట్ లిస్ట్ అయ్యేలా పుష్ చేయగలిగారనేది ప్రధానంగా  వినిపిస్తోన్న విమర్శ.


Also Read : ఆస్కార్ బరిలో నిలిచిన ‘చల్లో షో’ కథ ఏంటీ? అందుకే, ఆ చిత్రానికి అంత హైప్?


          సో ఇవి ఇన్ని రీజన్స్ కలిసి 'ఛెల్లో షో' అనే సినిమా ఆస్కార్ కు భారత్ తరపున అఫీషియల్ ఎంట్రీగా వెళ్లేలా ప్రభావితం చేశాయని వినిపిస్తున్న, లాజిక్ కు ఏ మాత్రం అందకుండా కనిపిస్తున్న కొన్ని విషయాలు. రూల్స్ వయొలేట్ చేసి మరీ 'ఛెల్లో షో'ను భారత్ నుంచి పంపించారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి.


Also Read : ముందుంది అసలైన యుద్ధం - రంగంలోకి దిగిన 'ఆర్ఆర్ఆర్' టీమ్