భారత్ నుంచి ఆస్కార్ బరిలో నిలిచే సినిమా అఫీషియల్ గా వెల్లడైంది. 2023 ఆస్కార్ పోటీకి గుజరాతీ సినిమా ‘ఛల్లో షో’ని అధికారికంగా పంపిస్తున్నట్లు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఈమేరకు ఎఫ్‌ఎఫ్‌ఐ  ప్రధాన కార్యదర్శి సుప్రన్‌సేన్‌ ప్రకటించారు. ఈ సినిమా ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో  పోటీ పడనుంది. జుగాడ్‌ మోషన్‌ పిక్చర్స్‌, మాన్‌సూన్‌ ఫిల్మ్స్‌ ఈ సినిమాను నిర్మించాయి. భవిన్‌ రబరి, భవేష్‌ శ్రీమాలి, రిచా మీనా, దీపేన్‌ రావల్‌, పరేష్‌ మెహతా కీలక పాత్రల్లో నటించారు.  


‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సహా వేర్వేరు భాషల్లోని 13 చిత్రాలు ఆస్కార్ కోసం పరిశీలనకు వెళ్లగా..  ‘ఛల్లో షో’ని ఆస్కార్‌ పోటీకి పంపాలని 17 మంది సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు ఎఫ్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు టీపీ అగర్వాల్‌ వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 12న 95వ ఆస్కార్‌ వేడుక జరగనుంది. ‘ఆర్ఆర్ఆర్’, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ లాంటి సినిమాలను కాదని ‘ఛల్లో షో’కు ఎందుకు ఈ అవకాశం దక్కింది? ఇంతకీ ఈ సినిమాలో కథేంటి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..


ఇంతకీ సినిమా కథేంటంటే?  


గ్రామీణ నేపథ్యంలో ఓ కుర్రాడు తన కలను నెరవేర్చుకోడానికి ఎంత కష్ట పడ్డాడు అనే ఇతివృత్తంగా ‘ఛల్లో షో’ సినిమా తెరకెక్కింది.  గుజరాత్‌లోని చలాలా అనే పల్లెటూరు. ఆ ఊర్లో పుట్టిపెరిగిన తొమ్మిది సంవత్సరాల సమయ్‌ అనే కుర్రాడికి ఓ థియేటర్‌ ప్రొజెక్టర్‌ ఆపరేటర్‌ తో దోస్తీ ఏర్పడుతుంది. అలా తరుచుగా ప్రొజెక్షన్‌ గదిలోకి వెళుతుంటాడు.  ప్రొజెక్టర్‌ నుంచి వచ్చే లైట్ తెరపై బొమ్మగా మారడం అతడికి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రొజెక్షన్‌ గదిలో సమ్మర్ మొత్తాన్ని గడుపుతాడు. అదే సమయంలో అతడికి సినిమా మీద ఎంతో ప్రేమ ఏర్పడుతుంది. సినిమా తన ప్రాణం అనేలా తయారవుతాడు.  సినిమా అతడి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది. చివరికి అతడు ఏం అవుతాడు? అనేది కథాంశం. మాస్టర్‌ భవిన్‌ రబరి ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో.. తన బాల్య జ్ఞాపకాలనే సినిమాగా మలిచారు దర్శకుడు పాన్‌ నళిన్‌. ఎంతో హృద్యంగా ఈ సినిమాను తెరకెక్కించిన తీరు జ్యూరీ సభ్యులందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా ‘ది లాస్ట్‌ షో’ పేరుతో దేశ వ్యాప్తంగా అక్టోబరు 14న ఇంగ్లిష్‌ భాషలో విడుదల కానుంది.


జీవితంలో మర్చిపోలేని రోజు- పాన్నళిన్


‘ఛల్లో షో’ సినిమా  ఆస్కార్‌ బరిలో నిలవడం పట్ల చిత్ర దర్శకుడు పాన్‌ నళిన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఇది నిజంగా తన జీవితంలో మరుపురాని రోజు అన్నారు. తన సినిమాను ఆస్కార్ కు ఎంపిక చేసిన ఎఫ్‌ఎఫ్‌ఐ జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.  నళిన్‌ ఇప్పటికే పలు అద్భుత చిత్రాలు తెరకెక్కించారు. ఆయన తీసిన ‘సంసార’, ‘వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌’, ‘యాంగ్రీ ఇండియన్‌ గాడెసెస్‌’ సినిమాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి.






‘ఛల్లో షో’ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..



  • జూన్ 10, 2021న జరిగిన 20వ ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పాట్‌ లైట్ విభాగంలో ‘ఛల్లో షో’ ప్రదర్శించబడింది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్క్రీనింగ్ చేయబడిన మొదటి గుజరాతీ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.    

  • ఈ సినిమా దర్శకుడి తొలి చిత్రం ‘సంసార’  AFI ఫెస్ట్, మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డులను గెలుచుకుంది.

  • ‘ఛల్లో షో’ గుజరాత్‌లోని సౌరాష్ట్రలోని గ్రామాలు, రైల్వే జంక్షన్‌లలో చిత్రీకరించబడింది. ఈ సినిమాలోని నటీనటులు ఎక్కువగా స్థానిక కమ్యూనిటీలకు చెందిన బాల నటులే కావడం విశేషం.

  • మార్చి 2020లో ఈ సినిమా చిత్రీకరించబడింది. కరోనా మహమ్మారి సమయంలోఈ చిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.

  • భారత్‌ తో పాటు జర్మనీ, స్పెయిన్, జపాన్, ఇజ్రాయెల్, పోర్చుగల్‌లలో కూడా ఈ సినిమా విడుదల కానుంది.

  • సెప్టెంబరు 2021లో జరిగిన 11వ బీజింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ఛల్లో షో’ టియంటన్ అవార్డులకు నామినేట్ అయ్యింది.

  • అక్టోబర్, 2021లో జరిగిన 66వ వల్లాడోలిడ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ఛల్లో షో’ ఉత్తమ చిత్రంగా గోల్డెన్ స్పైక్‌ను గెలుచుకుంది.

  • శామ్యూల్ గోల్డ్‌ విన్ ఫిల్మ్స్ అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తుంది.  ఐరోపా మార్కెట్‌ల కోసం ఆరెంజ్ స్టూడియో పంపిణీదారుగా వ్యవహరిస్తోంది. లెజెండరీ షోచికు స్టూడియోస్ జపనీస్ పంపిణీదారుగా వ్యవహరిస్తుంది.


Also Read : ఇండియా నుంచి ఆస్కార్ బరిలో గుజరాతీ సినిమా - ఆర్ఆర్ఆర్‌కు దారులు మూసుకుపోయినట్లు కాదు!


Also Read : మహేష్ కొత్త ఫోన్ కొన్నారండోయ్ - సెల్ఫీ పోస్ట్ చేశారు చూశారా? మహేష్ కొత్త ఫోన్ రేటు ఎంతో తెలుసా?