విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేందుకు నేడు (సెప్టెంబరు 21) రంగం సిద్ధం అయింది. ఈ మేరకు సంబంధిత సవరణ బిల్లును నేడు శాసనసభలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రవేశపెట్టనున్నారు. ఈ యూనివర్సిటీ పేరు మార్చేందుకు గానూ గతంలోనే మంత్రివర్గ కూడా ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. 


అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పెట్టాలనే ఆలోచన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుది. 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో యూనివర్సిటీలను పరిశీలించి, వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్లుగా 1986 నవంబరు 1న ఏపీ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ పేరుతో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మరణం తర్వాత అందరి ఆమోదంతో యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టారు. పాతికేళ్లుగా ఆ పేరు అంతే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఎవరూ పేరు గురించి ఆలోచించలేదు. పేరు మార్చాలన్న ఆలోచనే ఎవరికీ రాలేదు.


అప్పట్లో విజయవాడ సిద్దార్థ మెడికల్ కాలేజీ ప్రైవేటు కాలేజీగా ఉండేది. వైద్య, దంతవైద్య, నర్సింగ్‌, పారా మెడికల్‌ కళాశాలలైన 26 సంస్థలను కలిపి తొలుత యూనివర్సిటీ కార్యకలాపాలను మొదలుపెట్టారు. రాష్ట్రంలో వైద్యవిద్య కోర్సుల కాలేజీలు, అనుబంధ కాలేజీలు భారీగా పెరగడంతో 2000 నవంబరు 1న విశ్వవిద్యాలయాన్ని సిద్దార్థ వైద్య కాలేజీ నుంచి కొత్త బ్లాకులోకి అంటే ఇప్పుడు ఉన్న భవనంలోకి మార్చారు. 


ఎన్టీఆర్ ఆ యూనివర్సిటీని స్థాపించారు కాబట్టి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1998 జనవరి 8న ప్రత్యేక గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చారు. మళ్లీ 2006 జనవరి 8న అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్పు చేసింది. విశ్వవిద్యాలయం 25 ఏళ్ల వేడుకల సందర్భంగా ప్రాంగణంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆయన కుమార్తె, అప్పటి కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి 2011 నవంబరు 1న ఆవిష్కరించారు. 


మొత్తానికి ఎన్టీఆర్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టాలని ఇప్పుడు జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మంత్రి వర్గం ఆమోదించడం, నేడు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతోంది. అయితే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విద్యార్థుల ఫీజులు, కౌన్సెలింగ్‌ రుసుములతో యూనివర్సిటీ వద్ద ఉన్న రూ.400 కోట్లను జగన్‌ ప్రభుత్వం ఇటీవలే మళ్లించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.


వైఎస్ఆర్‌కు, ఎన్టీఆర్ వర్సిటీకి ఏం సంబంధం - చంద్రబాబు
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్‌ పేరు పెట్టడంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్‌కు ఏం సంబంధమని నిలదీశారు. ఎన్టీఆర్ నిర్మించిన విశ్వవిద్యాలయానికి తండ్రి పేరు ఎలా పెట్టుకుంటాడని నిలదీశారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందే అని స్పష్టం చేశారు. ఉన్న సంస్థలకు పేర్లు మార్చితే పేరు రాదని, కొత్తగా నిర్మిస్తే పేరు వస్తుందని హితవు పలికారు. తెలుగు దేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందని చంద్రబాబు అన్నారు.