Rains in Telangana AP: ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో నేడు సైతం పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలను అనుకుని వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సుద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్ది ఇది నైరుతి వైపునకు వంగి ఉంటుంది. మరో 36 గంటల్లో ఉత్తర ఒడిశా, ఛత్తీస్ గఢ్ మీదుగా పశ్చిమ, వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో 
 ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. 
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather)
నేడు తెలంగాణ రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. నేటి నుంచి 3 రోజులపాటు మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల,  జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.






హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. ఒకట్రెండు చోట్ల నగరంలో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో సెప్టెంబర్ 24 వరకు పలుచోట్ల  వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి పశ్చిమ, వాయువ్య దిశగా కదలడంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు  కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు వర్షాలు కురుస్తాయి. పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. 





దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
నేడు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షపాతం నమోదు కానుంది. నేడు మోస్తరు నుంచి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఈ రోజు తక్కువగానే వర్షాలుంటాయి.  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. రాయలసీమలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ కేంద్రం అంచనా వేసింది.