క్యూరియస్ గా కనిపించే ఆ కళ్లు... ఎప్పుడూ కొత్తదనం కోసం వెతుకుతూ ఉంటాయ్..


జీనియస్ అనిపించే.. ఆ మైండ్ అద్భుతమైన ఐడియాలను సృష్టిస్తూనే ఉంటుంది. 


ఎప్పుడూ ఫ్రెష్ గా ఉండే ఆ మనసు.. ప్రతి ఒక్కరినీ రిఫ్రెష్ చేస్తూనే ఉంటుంది. 


సింపుల్ గా చెప్పాలంటే.. క్రియేటివిటీకి కళ్లజోడు పెట్టినట్లు ఉంటాడాయన.. !


"సెంచరీలు కొట్టే వయస్సు మాది అంటూ  సినిమాల్లో అనిపించిన ఆ కుర్రోడు “ 90 క్రాస్ చేసేశాడు.. అంటే  త్వరలోనే సెంచరీ.. అన్నమాట.. ఎవరి గురించో అర్థమైందా.. 


ఎస్, ఆయనే.. ఇండియన్ సెల్యూలాయిడ్ పై చేసిన సృజనాత్మకం సంతకం.. సింగీతం శ్రీనివాసరావు.. సహస్ర చంద్రదర్శనం పూర్తై చాలా ఏళ్లు గడిచిన ఈ వయసులో  కూడా చంద్రమండలం గురించి ఆరాతీయాలన్న కుతూహులం ఉన్న కుర్రాడు.. 


రిమ్ లెస్ కళ్లద్దాలు.. కాలర్ లెస్ టీషర్టులు వేసుకుని కనిపించే నేటి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను ఓ అరవై ఏళ్లకు ఫాస్ట్ ఫార్వార్డ్ చేస్తే ఎలా ఉంటారో అలానే ఉంటారు ఆ లెజండరీ డైరక్టర్. ఆ వయసుకు ..ఆ ఆహార్యానికి.. ఆ మనసుకు అసలు సాపత్యమే ఉండదు. ఇప్పటికీ చిన్నపిల్లాడిలా కుర్ర డైరక్టర్లతో కొత్త విషయాల గురించి మాట్లాడుతుంటారు. తమ మనవరాలితో కలిసి.. యూ ట్యూబ్ లో పాటలు పాడుతుంటారు. టైమ్ తో సంబంధం లేని  వ్యక్తి ఆయన.. కాలాతీతుడు అనాలేమో.. ! ఎందుకంటే ఆయన..


టాకీ యుగంలో మూకీ తీసిన సాహసి..
సర్రియలిస్టిక్ గా  సామ్యవాదాన్ని చెప్పిన మేధావి..
ఊహాలోకపు విహారాలు చేయించిన జానపదుడు..
లలిత సంగీతంలో ఓలలాడించే సింగీతం.. 
అమావాస్య రోజూ వెలుగులీనే పూర్ణ చంద్రుడు..


ఉదయగిరి నుంచి మదరాసుకు..


ఎప్పుడో 90 ఏళ్ల కిందట అప్పటి మద్రాసులోని ఇప్పటి ఉదయగిరిలో పుట్టారు సింగీతం..!  తల్లి విద్వాంసురాలు కావడంతో చిన్నప్పుడే సింగీతానికి సంగీతం కూడా ‍ఒంటబట్టింది. కాలేజీ రోజులకే క్రియేటివ్.. అప్పటికే అనేక రకాల నాటకాలు వేసి.. మద్రాసు మెయిల్ ఎక్కేశారు. తెలుగు చలన చిత్ర సీమకు మహామహులున్న వారి దగ్గర శిష్యరికం చేశారు. సింగీతం. దిగ్గజ దర్శకుడు కేవీరెడ్డి దగ్గర మాయాబజార్ కు అప్రెంటిస్ గా పనిచేశారు. ఆ తెలుగు విజువల్ వండర్‌కు  ఇప్పటి వరకూ మిగిలి ఉన్న ఏకైక రిఫరెన్స్ సింగీతమే.. ఈ మధ్య కాలంలో ఆ సినిమా ముచ్చట్లను అనేక సందర్భాల్లో పంచుకున్నారు కూడా.


స్వతహాగా క్రియేటివ్ అయిన ఆయనలోని తృష్ణను సినిమా మరింత రగిల్చింది. తన ఊహలకు రూపం పోసుకునేది సెల్యూలాయిడ్ పైనే అని నిర్ణయానికి వచ్చిన ఆయన కోడె వయసులో సినిమాతో ప్రేమలో పడిపోయారు. అది అలాంటి ఇలాంటి మైకం కాదు. సినిమాలపై అవగాహన కోసం ఆయన చేయని పనిలేదు. కొన్నింటికి ఎడిటర్... కొన్నింటికి స్క్రీన్ రైటర్... సౌండ్ ఇంజనీర్..  ఇంకొన్నింటికి లిరిసిస్ట్.. మరికొన్నింటికీ అసిస్టెంట్ డైరక్టర్. అసలు 24 క్రాఫ్టులలో కొన్ని తప్ప.. మిగతావన్నీ చేసేశారు. 


దర్శకుడిగా తొలి అడుగు


1972లో కృష్ణంరాజు - కాంచన జంటగా తీసిన నీతి నిజాయతీ అనే తెలుగు సినిమాతో ఆయన డైరక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు.  ఆ తర్వాత తమిళ్ లోనూ.. తెలుగులోనూ సినిమాలు చేశాక.. కన్నడ రంగంవైపు వెళ్లారు. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ తో సూపర్ హిట్ లు తీశారు.  రాజ్ కుమార్ తో పాటు.. ఆయన ఇద్దరు కుమారులతో కూడా సినిమా తీసిన ఏకైక దర్శకుడు సింగీతం ఒక్కరే..


దర్శకుడిగా పయనం ప్రారంభించిన కొత్తలోనే ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించారు. అందులో తమిళ సినిమా 'దిక్కట్ర పార్వతి' ఒకటి. మన చివరి గవర్నర్ జనరల్  రాజాజీ జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రమిది. 1974లో విడుదలైంది. ఈ సినిమాను రాజాజీ సొంత గ్రామమైన తోరపల్లెలో చీత్రీకరించారు. హోసూరు కోర్టులో నిజమైన లాయర్ల మధ్య సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాకు అనుమతి కోసం రాజాజీని స్వయంగా కలవడం అద్భుతమైన అనుభవం అని చెబుతుంటారు.. సింగీతం. 


క్రియేటివ్ జీనియస్


వరుసగా దక్షిణాది భాషల్లో అద్భుతమైన సినిమాలు ఇస్తున్న ఆయన 50 ఏళ్ల వయసు తర్వాత విజృంభించారు అనుకోవచ్చు. పరుసవేది అద్భుత సమ్మేళనంతో అపూర్వలోహాలను సృష్టించినట్లు ఆయన గ్యారేజీ నుంచి అద్భుతమైన కళాఖండాలు బయటకు వచ్చాయి. 
అలా మొట్టమొదటి సారి ప్రయోగాత్మక చిత్రంతో తానేంటో రుజువు చేశారు. ప్రమాదంలో కాలు కోల్పోయిన సుధాచంద్రన్ జీవిత కథతో వచ్చిన మయూరి సినిమా.. ఆయన సినిమాల్లో ముఖ్యమైనది. ఉషాకిరణ్ మూవీస్ తీసిన ఈ  బయోపిక్​లో నిజజీవిత నాయిక సుధాచంద్రనే నటించారు. జాతీయ ఉత్తమ చిత్రంగా (ప్రత్యేక ప్రశంస)తో పాటు.. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ చిత్రంగానూ నిలిచింది.. ఆ సినిమా.. 
అద్భుతమైన విజన్ ఉన్న ఓ దర్శకుడికి అత్యద్భుతమైన నటుడు దొరికితే చెప్పేదేముంటుంది. ఇక సంచలనాలే. .అలా సింగీతం చేతికి కమల్ చిక్కారు. క్రియేటివ్ బ్రిలియన్స్ కు కేరాఫ్ అడ్రస్ గా వాళ్ల సినిమాలు నిలిచాయి. ముగ్గురు కమల్స్ తోవచ్చిన మైకెల్ మదన కామరాజు కామెడీతో గిలిగింతలు పెడితే.. విచిత్ర సహోదరులు మనసును మెలిపెడుతుంది. పుష్పక విమానం నిశ్శబ్దవిప్లవం సృష్టించింది. చివర్లో వచ్చిన ముంబై ఎక్స్ ప్రెస్ కూడా అంతే ప్రత్యేకమైనది. 


నిశ్శబ్ద విప్లవం


పుష్పక విమానం అయితే ఎవ్వరూ సాహసించలేని ఓ అద్భుత ప్రయోగం. కమల్ లాంటి అద్భుతమైన నటుడుని మాటలు లేకుండా నటింపజేయడం.. (ఓ రకంగా చెప్పాలంటే... కమల్ కాబట్టే చేశారు అనుకోవాలి) సంచలనమే. ఒక్క సంభాషణ కూడా లేకుండా.  కేవలం కంటి, ఒంటి భాషతో అద్భుతమైన మెసేజ్ ఇచ్చిన సినిమా అది. సంపదతో సుఖం వస్తుందేమో కానీ.. సంతోషం రాదని.. శాశ్వతమైనది ఏదీ ఉండదనే ఓ అద్భుతమైన సత్యాన్ని ఈ సినిమా చూపెడుతుంది. నిరుద్యోగిగా ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ కమల్ నిలబడటంతో మొదలయ్యే ఆ సినిమా మళ్లీ కమల్ అక్కడకు చేరుకోవడంతో ముగుస్తుంది. మధ్యలో జరిగింది అంతా నిజం కాదు... అతని స్థితే శాశ్వతం అని చెప్పిన సినిమా అది. దేశంలోని దాదాపు అన్ని భాషల్లో విడుదలైంది. ప్రఖ్యాత విమర్శకులంతా.. దానిని అద్భుతం అన్నారు.  ఆనందవికటన్ , సీఎన్ఎన్ ఐబీఎన్.. వంద అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా దానిని గుర్తించాయి. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ సినిమాను IFFI, కేన్స్ లోనూ ప్రదర్శించారు.


అద్భుతాల ‘ఆదిత్య’


ముప్పై ఏళ్ల కిందట సింగీతం సృష్టించిన మరో విజువల్ వండర్ ఆదిత్య 369. అంతకు ముందు ఏడాది రాఘవేంద్రరావు జగదేకవీరుడు అతిలోక సుందరి ఇంద్రలోకాన్ని సృష్టిస్తే.. సింగీతం చంద్రమండలానికే తీసుకెళ్లారు. ఈ రెండు సోషియో ఫాంటసీలు... తెలుగు వాళ్లకు ఆల్ టైమ్ ఫేవరెట్లు. ఆదిత్య 369 అయితే .. అన్ని వయసుల వాళ్లని తెరమీదకు కట్టిపడేస్తుంది. సింగీతం సృష్టించిన కాలయంత్రం రాయలవారి వైభవాన్ని కళ్లముందుకు తీసుకెళుతుంది. ఇప్పటిలా మెస్మరైజింగ్ గ్రాఫిక్స్ లేకపోయినా.. ఆ సినిమాలోని ఒరిజినాలిటీ.. జనాలకు మెమరబుల్ గా ఉండిపోతుంది. పొల్యూషన్, రేడియేషన్, ధరల పెరుగుదల వంటి భవిష్యత్ లో జరిగే పరిణామాలను 30 ఏళ్లకు ముందే సింగీతం ఆదిత్య 369 లో చూపించడం.. ఆయన విజన్ కు నిదర్శనం. 



సింగీతం మ్యాజిక్, ఇళయరాజ మ్యూజిక్, బాలకృష్ణ యాక్ట్టింగ్ అన్నీ కలిపి ఈ సినిమాను ఎవర్ గ్రీన్ చేశాయి. మోడరన్ఏజ్ లో వచ్చిన జానపదం భైరవద్వీపం. ఆ సినిమాలోని సెట్లు, పాటలు, పోరాటాలు.. జనాలను మంత్రముగ్ద్ధుల్ని చేశాయి. సింగీతానికి చిన్నప్పుడే సంగీతం ఒంటబట్టింది అనుకున్నాం కదా... ఆయన టాలెంట్ గురించి తెలిపే ఓ ఘటన ఈ మూవీలో జరిగింది. వేటూరి గారు బిజీగా ఉండి.. పాటలు ఇవ్వలేకపోతుంటే.. ఊరికే సరదాగా ‘‘విరిసినదీ వసంతగానం‘‘ పాట రాసేసి రికార్డ్ చేసేశారు. ఆ తర్వాత వేటూరి చూసి. నేను ఇంతకన్నా రాసేదేం లేదు అని దానినే ఉంచేయమన్నారు. 


కాలానికి ముందుండే దార్శనికుడు


2001 లో little John, 2003 lo Son of Aladdin సినిమా లు ఇంగ్లీష్ లో తీశారు సింగీతం. ఇందులో Son of Aladdin యానిమేషన్ సినిమా. కంప్యూటర్ల తరం జోరందుకున్న టైం లో యానిమేషన్ సినిమా తీసేశారు సింగీతం. 2016 లో ఆయనే ఈ రెండు సినిమాలను హిందీ లోకి డబ్ చేయించారు. Son of Aladdin లాస్ ఏంజిల్స్ లో ప్రదర్శితమై యానిమేషన్ ఫిల్మ్ విభాగంలోకి ఆస్కార్ కి వెళ్ళింది. కాలానికి ముందుండే దార్శనికుడు అని చెప్పటానికి ఆయన డైరెక్టర్ గా తీసిన చివరి సినిమా 'వెల్కమ్ ఒబామా'(2013). ఈ సినిమా సరోగసి(అద్దె గర్భం) నేపథ్యంలో తీశారు. అల్లు అర్జున్ 'వరుడు', వరుణ్ తేజ్ 'కంచె' సినిమాల్లో నటుడిగా మెరిసిన సింగీతం ప్రస్తుతం కుర్ర డైరెక్టర్ల తో కలిసి పని చేస్తూ తన అనుభవంతో వాళ్ళని మెంటార్ చేస్తున్నారు. నిర్మాత అశ్వనిదత్ కోరిక మేరకు 'మహానటి' సినిమాను మెంటార్ గా నడిపించిన సింగీతం శ్రీనివాసరావు ఇప్పుడు 92ఏళ్ళ కుర్ర వయసులో 500 కోట్ల రూపాయల ప్యాన్ ఇండియా భారీ సినిమా 'ప్రాజెక్ట్ K' కి మెంటార్ గా వ్యవహరిస్తున్నారు.


క్యూరియస్ క్రియేటివ్   


రెండు నేషనల్ అవార్డులు.. పొందిన గర్వం కానీ.. ఆరు నంది అవార్డులు సాధించానన్న యాటిట్యూడ్ కానీ.. మూడు ఫిల్మ్​ఫేర్ లు కొట్టిన పొగరు కానీ.. అనేక స్టేట్ అవార్డులు పొందిన సంతృప్తి కానీ ఆయనలో ఉండవు. పాషన్.. ఫ్యాషన్ కలగలిసిన ఈ 90 ఏళ్లు యువకుడు ఇప్పటికీ.. సినిమా పట్ల అంతే ప్రేమ కలిగి ఉంటారు. కుర్ర డైరక్టర్లతో కుశాలుగా మాట్లాడుతుంటారు. తనకు తెలిసింది నేర్పుతారు. తెలియంది నేర్చుకుంటారు. ఇప్పటికీ కొత్త టెక్నాలజీని గమనిస్తుంటారు. ఆయన్ను కలిసినప్పుడో..  మీడియా ఇంటర్వూల్లోనో ఆయన కళ్లల్లోకి చూడండి.. సినిమా, కళలు, జీవితం పట్ల ఆయనకు ఉన్న ప్రేమ... ఆ కళ్లల్లో మెరుపులా మెరుస్తూ ఉంటుంది. సింగీతం గారు.. మీరు... సెంచరీలు.. కొట్టేయాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే.