తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో నేడు కూడా వర్షాలు బాగా పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. కొన్ని చోట్ల భారీ వర్ష సూచనతో ఐఎండీ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. తాజాగా ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలను అనుకుని వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సుద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్ది ఇది నైరుతి వైపునకు వంగి ఉంది. అల్పపీడనం నేడు ఈశాన్య మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల వద్ద కేంద్రీకృతమైంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. 


ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాగల మూడురోజులపాటు తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడనున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.






ఏపీలో వాతావరణం ఇలా
అమరావతి వాతావరణ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే 2 రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా అల్పపీడనం కదిలే అవకాశం ఉంటుంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో రాగల మూడు రోజులపాటు వర్షాలు పడనున్నాయి. నేడు, రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంట ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమలోనూ వానలు పడనున్నాయి. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు, రేపు, ఎల్లుండి తేలిక పాటి నుంచి మోస్తరు వానలు కురవనున్నాయి.


తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీయనున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.


"కృష్ణా జిల్లా బందరు (మచిలీపట్నం), దివిసీమ భాగాలతో పాటుగా బాపట్ల జిల్లా రేపల్లి, పలు భాగాలతో పాటుగా కాకినాడ నగరంలో కొన్ని వర్షాలు పడనుంది. కొన్ని భాగాల్లో కాస్తంత జోరుగా వర్షాలు పడనున్నాయి. 


అల్పపీడన ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రం మీదుగా కొనసాగుతోంది. ఇందువలన వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనం చూడగలము. మధ్యాహ్నం అరకు వ్యాలీ - అల్లూరిసీతాతామరాజు జిల్లాలో పడి, అలా సాయంకాలానికి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మణ్యం, విశాఖ నగరం ఉత్తర భాగాలు, విశాఖ నగర సివార ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, పిడుగులు నమోదవ్వనుంది.


అల్పపీడనం ఉత్తర దిశగా వెళ్తోంది కాబట్టి వర్షాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టాయి. కానీ అక్కడక్కడ వర్షాలు కొనసాగడం సహజం. హైదరాబాద్ లో ఈ రోజు సాయంకాలం, రాత్రి సమయంలో అక్కడక్కడ కొన్ని వర్షాలుంటాయి. మరో వైపున రాయలసీమ​, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, బాపట్ల​, పల్నాడు, ఉభయ గోదావరి, కొనసీమ​, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్లల్లో మాత్రమే ఈ రోజు వర్షాలను చూడగలము." అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.