ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన "ఏపీ సినిమా (నియంత్రణ), సవరణ బిల్లు -2021" బిల్లు ప్రభావం సినిమా పరిశ్రమపై తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా భారీ చిత్రాలపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఆర్ఆర్ఆర్ వంటి అతి భారీ చిత్రాలు ఏపీలో ఇప్పటి వస్తాయని పెట్టుకున్న కలెక్షన్ల అంచనాలను తారు మారు చేసుకోవాల్సిందే. ఒక్క ఆర్ఆర్ఆర్ మాత్రమే కాదు..  బడా హీరోలుగా పేరు తెచ్చుకున్న ప్రతి ఒక్కరికి... పెద్ద సినిమాలు నిర్మించే ప్రతి ఒక్కరికి ఈ చట్టం శరాఘాతమే.


Also Read : 'సిద్ధ' వచ్చేది అప్పుడే.. ఊరించి ఉసూరుమనిపించిన ‘ఆచార్య’ టీమ్


ఆన్ లైన్ టిక్కెట్ల ఇష్యూ కాదు ఇంకాఎన్నో నిబంధనలు !


ఇప్పటి వరకూ ప్రభుత్వం ఆన్ లైన్‌లో టిక్కెట్ల అమ్ముతుందట అనే అంశంపైనే చర్చలు జరిగాయి. దానిపై రకరకాల విశ్లేషణలు వచ్చాయి. కానీ కొత్త చట్టంలో అనేక నిబంధనలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది నాలుగు షోలకు మాత్రమే అనుమతి. బెనిఫిట్ షోలను రద్దు చేయడం. ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగు షోలకు మాత్రమే అనుమతి ఇచ్చేలా చట్టంలో ఉంది. బెనిఫిట్ షోలను రద్దు చేసేశారు. మామూలుగా అయితే బెనిఫిట్ షోల పేరుతో అర్థరాత్రి నుంచి ధియేటర్లలో షోలు వేస్తారు. ఆ టిక్కెట్ల ధరలు రూ. ఐదు వందల నుంచి రూ. రెండు, మూడు వేల వరకూ వసూలు చేస్తారు. డిస్ట్రిబ్యూటర్లకు ఇదో పెద్ద ఆదాయం. భారీ మొత్తం వెచ్చించి పెద్ద హీరోల సినిమాలను కొనుగోలు చేసేవారుఇలా వీలైనంత వేగంగా తమ పెట్టుబడిని కలెక్షన్ల రూపంలో వెనక్కి తెచ్చుకోవాలనుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన చట్టంతో ఈ అవకాశం కోల్పోయినట్లయింది. నిజానికి పెద్ద సినిమాలు విడుదలైన వారం లేదా రెండు వారాలు మాత్రమే అదనపు షోలు, టిక్కెట్ రేట్ల పెంపు ఉంటుంది. ఇప్పుడు ఆ అవకాశం కూడా ఉండదు.


Also Read:  స్కైలాబ్ పోస్టర్‌తో ఫోటో దిగి పంపిస్తే... బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తానంటున్న నిత్యా మీనన్


టిక్కెట్ రేట్లు మరో అతి పెద్ద సమస్య !


ఏప్రిల్‌లో ఏపీ ప్రభుత్వం సినిమా ధియేటర్లలో టిక్కెట్ రేట్లు ఎంతెంత ఉండాలో డిసైడ్ చేస్తూ జీవో జారీ చేసేసింది.  ఈ జీవో ప్రకారం.. కార్పొరేషన్ ప్రాంతాల్లో మల్టిప్లెక్స్ లలో ప్రీమియం సీట్ల టిక్కెట్ రేట్లు రూ. 250 మాత్రమే ఉండాలి. మిగతా టిక్కెట్లు రూ. 150, 100 ఉండాలి. సింగిల్ ధియేటర్లు ఏసీ సౌకర్యం ఉంటే అత్యధిక రేటు రూ. 100 మాత్రమే. ఏసీ లేకపోతే.. అత్యధిక టిక్కెట్ ధర రూ. 60 . ఈ టిక్కెట్ రేట్లు జనాభా స్థాయిని బట్టి పట్టణాల్లో మారుతూ ఉంటాయి. పంచాయతీల్లో ఉన్న ధియేటర్లలో మరింత తక్కువ. ఈ రేట్లన్నీ పదేళ్ల కిందటివి. ప్రస్తుతం పెరిగిపోయిన ఖర్చులు, సిబ్బంది జీతాలు, నిర్వహణ కారణంగా ఈ టిక్కెట్ రేట్లతో సినిమాలు ప్రదర్శిస్తే ధియేటర్ నిర్వహణకే సరిపోవన్న అభిప్రాయాలు వినిపించాయి. అందుకే టిక్కెట్ రేట్లను పెంచాలని చాలా మంది నిర్మాతలు అదే పనిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే జారీ చేసిన జీవో ఉన్నందున ఆ జీవో ప్రకారమే.. కొత్త చట్టంలోనూ నిర్దేశిస్తే ఇక ఏపీలో సినిమాలకు కలెక్షన్లు ఎంత వచ్చినా.. అన్ని ఖర్చులు పోను వచ్చే షేర్ మాత్రం అతి తక్కువ.


Also Read: 'కె.జి.యఫ్' రేంజ్‌లో NTR31... ఆ సినిమా గురించి ఎన్టీఆర్ ఏమన్నారంటే?


పెద్ద హీరోల సినిమాలకు కోలుకోలేని దెబ్బ ! 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల పెద్ద హీరోలు, పెద్ద బడ్జెట్ సినిమాలకు గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది. ఇండస్ట్రీలో పెద్ద హీరోలుగా ఉన్న చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, బాలకృష్ణ వంటి హీరోల సినిమాలకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నష్టం చేస్తాయి. వారి సినిమాలకు మాత్రమే బెనిఫిట్ షోలు ఉంటాయి. టిక్కెట్ రేట్లను పెంచాల్సిన అవసరం ఉంటుంది. అదనపు షోలు కూడా వారి సినిమాలకే అవసరం అవుతాయి. ఇతర హీరోలు ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు. వారికి మామూలుగా రిలీజ్ అయి నాలుగు షోలు హౌస్ ఫుల్ అయితే వారికి సక్సెస్ లభించినట్లే. ప్రస్తుత పరిస్థితుల్లో నాగార్జున, వెంకటేష్ వంటి వారికి కూడా బెనిఫిట్‌షోలు వేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమోదించినందున వీరి సినిమాలకు నష్టం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. లాభనష్టాలు నిర్మాతలకు మాత్రమే దక్కుతాయి. కానీ సినిమా వ్యాపారం మీదే హీరోల రెమ్యూనరేషన్ ఆధారపడి ఉంటుంది. అందుకే అంతిమంగా హీరోలు కూడా నష్టపోతారు.


Also Read: నాటు నాటు... ఆ స్టెప్పులు అంత ఈజీ ఏం కాదు! ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే?


ఇండస్ట్రీ నిలబడుతోంది భారీ బడ్జెట్ సినిమాల మీదనే !


ఏ ఇండస్ట్రీకి అయినా పెట్టిన పెట్టుబడికి తిరిగి వస్తున్న ఆదాయమే ముఖ్యం. టాలీవుడ్‌కు కూడా అంతే. చిన్న సినిమాలు విడుదలైనా.. ఓ ఐదు లేదా పది కోట్ల రేంజ్‌కు చేరుకొంటే సూపర్ హిట్.  ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో సినిమా ధియేటర్లకు వచ్చి చిన్న సినిమాలను చూసే వారు తగ్గిపోయారు. సినిమా బాగుందని బాగా ప్రచారం జరిగితేనే వస్తున్నారు. ఇలా పేరు తెచ్చుకుంటున్న సినిమాలు చాలా తక్కువ. అదే భారీ బడ్జెట్ బడా సినిమాలు అయితే తొలి రోజే.. నలభై, యాభై కోట్ల గ్రాస్ వరకూ చేరుకుంటాయి. అయితే ఒక్క ఏపీలో ఆరేడు కోట్ల వరకూ ఉండొచ్చు. ఈ మొత్తం ఇప్పుడు మైనస్ అవుతుంది. భారీ బడ్జెట్ సినిమాలు దెబ్బతింటే ఇండస్ట్రీ కూడా ఆటోమేటిక్‌గా వీక్ అవుతుంది. అప్పుడు చిన్న సినిమాలూ గడ్డు పరిస్థితుల్లోకి వెళ్తాయి.


Also Read: 'రిపబ్లిక్' సినిమాను థియేటర్లో చూడని సాయితేజ్.. తొలిసారి ఓటీటీలోనే..


టిక్కెట్ రేట్లను ప్రభుత్వం నిర్ణయించడం కోర్టులో నిలబడుతుందా ?


సినిమా అనేది పూర్తిగా ప్రైవేటు వ్యాపారం.  ధర ఎంత ఉండాలి అనేది నిర్ణయించుకునే హక్కు తయారీదారునికి ఉంటుంది. కొనాలా వద్దా అనేది వినియోగదారు ఇష్టం. అయితే ఇప్పటి వరకూ ప్రభుత్వం టిక్కెట్ రేట్లపై నియంత్రణ పెట్టింది. అయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు పెంచుకునేందుకు పర్మిషన్ ఇస్తూ వస్తోంది. ఎవరూ ఎప్పుడూ న్యాయపోరాటం అనే ఆలోచన చేయలేదు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత న్యాయపోరాటం చేస్తారని.. టిక్కెట్ రేట్లను పెంచుకునేందుకు కోర్టుకెళ్తారన్న ప్రచారం జరిగింది.కానీ దాన్ని ఆయన ఖండించారు. కోర్టుకెళ్లం కానీ.. ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామన్నారు. అయితే ఇప్పుడు ఎలాంటి సంప్రదింపులకు చాన్స్ లేకుండా చట్టం చేసేశారు. ఇప్పుడు న్యాయపోరాటం చేయకుండా ఉంటారా.. అదే రేట్లకు.. అదే నాలుగు షోలతో రిలీజ్ చేస్తారా అన్నది అర్థం కాని విషయం. ఒక వేళ న్యాయపోరాటానికి దిగితే ప్రభుత్వం .. న్యాయస్థానానికి చాలా అంశాల్లో క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సినిమా ప్రొడక్షన్, ఎగ్జిబిషన్, థియేటర్ల  నిర్వహణ ఇవన్నీ పూర్తిగా ప్రైవేటు వ్యవహారాలు. వాటి ఖరీదు,  ధర ఎంతుండాలనేది ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందనేది కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. బ్రాండెడ్ వస్తువుల ధరలను ఆయా కంపెనీలు ఎలా నిర్ణయించుకుంటాయో.. అలా సినిమా వాళ్లూ టిక్కెట్ ధరలను ఎందుకు నిర్ణయించుకోకూడదో చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. అలా నియంత్రించే చాన్స్ భారతీయ చట్టాల్లో లేదనేది నిపుణుల అభిప్రాయం.


Also Read : ఏపీలో ఇక ఓన్లీ ఆన్ లైన్ మూవీ టిక్కెట్స్.. చట్టం ఆమోదం !


ఏపీ మార్కెట్ పై టాలీవుడ్ ఆశలు వదిలేసుకోవాల్సిందేనా !?


ఏపీలో ప్రస్తుతం ఆమోదించిన చట్టం ప్రకారం ... టిక్కెట్ రేట్ల ప్రకారం సినిమాలు రిలీజ్ చేసుకోవడం కన్నా ఓటీటీలో రిలీజ్ చేసుకోవడం మంచిదన్న అభిప్రాయం పెద్ద సినిమా నిర్మాతల్లో ఉంది. ఏపీ మార్కెట్‌పై ఆశలు వదిలేసుకుని కుదిరితే ఇతర ప్రాంతాల్లో విడుదల చేసుకుని...వీలైనంత త్వరగా ఓటీటీ మార్కెట్‌కు సినిమాను అమ్మేసుకుంటే బాగు పడతామన్న అంచనా నిర్మాతల్లో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టాలీవుడ్ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. 


Also Read : బుల్లితెరపై అల్లు అర్జున్.. రేటింగ్స్ తగ్గేదే లే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి