నిత్యామీనన్, సత్యదేవ్ జంటగా నటిస్తున్న సినిమా ‘స్కైలాబ్’. ఇది వినోదాత్మకమైన సైన్స్ ఫిక్షన్ మూవీ. డిసెంబర్ 4న ఈ సినిమా విడుదల కానుంది. దీంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. తాజాగా ట్విట్టర్ లో ఓ వీడియో ట్రెండయ్యింది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నిత్యమీనన్ స్కైలాబ్ చిత్ర పోస్టర్లు చూడటానికి స్వయంగా వెళ్లింది.  పోస్టర్ల పక్కన నిల్చుని సెల్ఫీలు దిగింది. తనలాగే పోస్టర్ పక్కన ఫోటో దిగి, స్కైలాబ్ పోస్టర్స్ అని హ్యాష్ ట్యాగ్ తో పోస్టు చేయమని కోరింది. అలా చేస్తే తాము బిగ్ సర్ ప్రైజ్ ఇస్తామని చెప్పింది. చూడాలి నిత్య మీనన్ పిలుపుకు ఎంతమంది స్పందిస్తారో. 


ట్రైలర్ సూపర్
ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ఎంతోమందిని ఆకట్టుకుంది. ఇందులో సత్యదేవ్ వైద్యుడిగా, నిత్యా మీనన్ గౌరీ అనే పాత్రలో కనిపించనున్నారు. వారి లుక్స్ కూడా పాతకాలానికి తగ్గట్టే ఉన్నాయి. 1979లో జరిగిన స్కైలాబ్ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను నిర్మించారు. కాస్త వినోదాన్ని జోడించారు. అందుకే ఆ కాలం నాటి లుక్స్ వచ్చేలా పాత్రలను తీర్చిదిద్దారు. డిసెంబర్ 4న ఈ సినిమా విడుదల కానుంది. స్కైలాబ్ గురించి పాత తరానికి తప్ప, కొత్త తరానికి ఏమీ తెలియదు.  అప్పటి కథను ఈ తరానికి కొత్తగా చెప్పేందుకు ఈ ప్రయత్నం చేశారు మేకర్స్. ఈ సినిమాకు నిత్యా మీనన్ సహనిర్మాతగా ఉంది. విశ్వక్ దర్శకత్వం వహిస్తున్నారు.


  ట్రైలర్లో ‘ఎంత పెద్ద వర్షం పడ్డా ఆకాశం తడవదు. గుర్తు పెట్టుకోండి’ అంటూ నిత్యమీనన్ చెప్పిన డైలాగ్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. బండలింగం పల్లి ఊరి చుట్టూ కథ తిరుగుతుంది.  అంతరిక్షంలోకి వెళ్లిన స్కైలాబ్ ఉపగ్రహం బండం లింగపల్లిలోనే పడుతుందనే ప్రచారం మొదలవుతుంది. అప్పుడు ఆ ఊళ్లో వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు కలిగాయనే అంశంపై, వినోదాత్మకంగా చిత్రాన్ని తెరకెక్కించారు.