ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వాహనాలకు ఉన్న బ్లాక్ స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్మ్ లను తొలగించాలని కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నారు పోలీసులు. ఈ రూల్స్ ను అధిక్రమించిన వారికి ఫైన్లు విధిస్తున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తూ యాక్షన్ తీసుకుంటున్నారు. పోలీసులు ఎన్ని ఫైన్లు వేస్తున్నా.. సెలబ్రిటీలు మాత్రం మారడం లేదు. ఫైన్ల మీద ఫైన్లు కడుతూనే ఉంటున్నారు. 


తాజాగా సినీ నటుడు ప్రభాస్ కారుకి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.  శనివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్‌ 36లోని దసపల్లా జంక్షన్ వద్ద బ్లాక్‌ ఫ్రేమ్‌తో వెళ్తున్న ఓ కారును పోలీసులు ఆపారు. ఆ కారును తనిఖీ చేయగా.. అది ప్రభాస్‌ది అని తెలిసింది. కారు నెంబర్ ప్లేట్ సరిగా లేకపోవడం, కారుపై  ఎంపీ స్టిక్కర్ ఉండడం, విండోలకు బ్లాక్‌ ఫ్రేమ్‌ ఉండడంతో జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు రూ.1,450 ఫైన్ వేశారు.


పోలీసులు కారు చెక్ చేసినప్పుడు అందులో ప్రభాస్ లేరట. అతడి డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం ఎన్టీఆర్, మంచు మనోజ్, త్రివిక్రమ్ ఇలా చాలా మంది సెలబ్రిటీల కార్లను తనిఖీలు చేశారు. రూల్స్ కి వ్యతిరేకంగా బ్లాక్ ఫిల్మ్ లను వాడడంతో వారికి కూడా జరిమానాలు విధించారు. కార్లకు టింటెడ్ గ్లాస్ వాడకాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. 


వాహనం విండో పూర్తిగా పారదర్శకంగా ఉండాలని తెలిపింది. ఈ బ్లాక్ ఫిల్మ్ ల కారణంగా క్రైమ్స్ పెరిగే అవకాశం ఉందనే కారణంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కానీ సెలబ్రిటీలు మాత్రం తమ గోప్యత కోసం అద్దాలకు బ్లాక్ ఫిల్మ్స్ ను వాడుతున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన సెలబ్రిటీలు ఇలా ప్రవర్తిస్తుండంతో పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ కారుకి కూడా ఫైన్ వేసినట్లు న్యూస్ రావడంతో అది వైరల్ అవుతోంది. 


ఇక ఆయన సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'ఆదిపురుష్' సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' అనే సినిమాలో నటిస్తున్నారు. అలానే లైన్ లో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. ఒక్కో సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు ప్రభాస్.


Also Read: సెట్స్ లో చూసుకుందాం - రామ్ చరణ్ కి చిరు వార్నింగ్