ఎంఎం కీరవాణి (MM Keeravani) స్వరపరిచిన సూపర్ హిట్ పాటల్లో 'తెలుసా... మనసా' ఒకటి. ఆ పాట కింగ్ అక్కినేని నాగార్జున, మనీషా కొయిరాలా జంటగా నటించిన 'క్రిమినల్' సినిమాలోది. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఆ పాట వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ సాంగ్ గురించి ఎందుకు? అంటే... ఆ పాటలో తొలి రెండు పదాలు ఓ సినిమాకు టైటిల్ మరి!
'కేరింత' ఫేమ్ పార్వతీశం (Parvateesam) కథానాయకుడిగా శ్రీబాలాజీ పిక్చర్స్ సంస్థ రూపొందిస్తున్న సినిమా 'తెలుసా మనసా' (Telusa Manasa Movie). ఈ చిత్రంలో జశ్విక కథానాయిక. దీనికి వైభవ్ దర్శకుడు. వర్షా ముందాడ, మాధవి నిర్మాతలు. పల్లెటూరి నేపథ్యంలో సరికొత్త కథ, కథనాలతో న్యూ ఏజ్ ప్రేమ కథగా తెరకెక్కించారు. ప్రముఖ అగ్ర నిర్మాత 'దిల్' రాజు (Dil Raju) చేతుల మీదుగా ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.
బెలూన్స్ అమ్ముకునే అబ్బాయిగా హీరో!
'తెలుసా మనసా' సినిమాలో ఒక పల్లెటూరిలో బెలూన్స్ (బుడగలు) అమ్ముకునే ఓ యువకుడు మల్లి బాబుగా హీరో పార్వతీశం కనిపించనున్నారు. ఆ ఊరిలో పని చేసే హెల్త్ అసిస్టెంట్ సుజాత పాత్ర హీరోయిన్ జశ్వికది. ఇద్దరి మనసుల్లోనూ ఒకరు అంటే మరొకరికి ప్రేమ ఉంటుంది. కానీ, ఎప్పుడూ వారిద్దరూ ఆ ప్రేమను వ్యక్తం చేసుకోరు. సుజాతకు ప్రపోజ్ చేయాలని పలు సందర్భాల్లో మల్లి బాబు ట్రై చేస్తాడు. అయితే, చెప్పలేకపోతాడు. ఓ సందర్భం తర్వాత అనూహ్యంగా మల్లి బాబు కలలు కూలిపోతాయి. సుజాతకు దూ కావాల్సి వస్తుంది. మళ్ళీ వారిద్దరూ కలుసుకున్నారా? లేదా? అనేది సినిమా కథ.
Also Read : స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?
ఫస్ట్ లుక్‌లో బామ్మ కూడా!
'తెలుసా మనసా' ఫస్ట్ లుక్ చూస్తే... హీరో హీరోయిన్లతో పాటు ఓ బాబు, బామ్మ రోల్ చేసిన రోహిణి హట్టంగడి కూడా ఉంటారు. ఆమె మంచంపై కూర్చుని ఉంటారు. బామ్మ ఒడిలో బాబు నిద్రిస్తూ ఉన్నాడు. ఆ లుక్‌లో హీరో పార్వతీశం ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన ఎందుకు అలా దిగాలుగా కూర్చుని ఉన్నారు? అనేది సినిమా చూస్తే గానీ తెలియదు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుందని, త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చిత్ర బృందం పేర్కొంది. కొత్త దర్శకుడు చక్కగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిపారు.
Also Read : ఎవరీ ఆషిక? నందమూరి నయా నాయిక గురించి ఆసక్తికరమైన విషయాలు...
మహేష్ అచంట, అలీ రెజా, లావణ్య, మాస్టర్ అద్వితేజ్, వెంకీ, శివ, శోభన్ తదితరులు ఈ సినిమాలో ఇతర తారాగణం. జాతీయ పురస్కారం అందుకున్న సంగీత దర్శకుడు గోపీ సుందర్ 'తెలుసా మనసా' చిత్రానికి స్వరాలు, నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : ప్రసాద్ ఈదర, కూర్పు : పాపారావ్, పాటలు : వనమాలి, కాసర్ల శ్యామ్, శ్రేష్ట, గాయనీ గాయకులు : రాహుల్ సిప్లిగంజ్, శ్రీరామచంద్ర, రమ్య బెహ్ర, శ్రీకృష్ణ, మాళవిక, సుధాంశు, సహ నిర్మాత : గిరిధర్, సమర్పణ : నైనీష్య, సాత్విక్, నిర్మాతలు: వర్షా ముందాడ, మాధవి, కథ - కథనం - మాటలు - దర్శకత్వం : వైభవ్.