బ్రహ్మానందం (Brahmanandam)... తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఆ పేరు చెబితే చాలు... పెదవులపై చిరునవ్వు వచ్చేస్తుంది. ఆ ఇమేజ్ అటువంటిది. ఒకటా? రెండా? వెయ్యికి పైగా సినిమాలు చేశారు. వందల పాత్రలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. 


'అహ నా పెళ్ళంట'లో అరగుండు క్యారెక్టర్ నుంచి మొదలు పెడితే 'మనీ'లో ఖాన్ దాదా, 'యమలీల'లో చిత్రగుప్తుడు, 'అనగనగా ఒక రోజు'లో మైఖేల్ జాక్సన్... ఎన్నో ఎవర్‌గ్రీన్ రోల్స్ ఉన్నాయి. అవన్నీ ఒక ఎత్తు... 20వ శతాబ్దంలో బ్రహ్మానందం చేసిన కామెడీ రోల్స్ మరో ఎత్తు. కేవలం ఆయన కామెడీ కొన్ని సినిమాలను విజయ తీరాలకు చేర్చిందంటే అతిశయోక్తి కాదు. ఆయన కామెడీ కిక్ వల్ల కొన్ని సూపర్ హిట్లు వచ్చాయి. స్టార్ హీరోలకు విజయాలు ఇచ్చిన ఘనత బ్రహ్మానందానిది. ఆ నవ్వు తెచ్చిన విజయాలు ఏవో చూద్దామా? 


శ్రీను వైట్ల కామె'ఢీ'...
ఇన్వాల్వ్ చేస్తే హిట్టే!
'రావు గారూ... నన్ను ఇన్వాల్వ్ చేయకండి' - 'ఢీ'లో బ్రహ్మానందం సిగ్నేచర్ డైలాగ్. ఈ మాటను, ఆ సినిమాలో బ్రహ్మి కామెడీని అంత ఈజీగా మర్చిపోలేం. 'ఢీ' నుంచి మొదలు పెడితే... బ్రహ్మీని శ్రీను వైట్ల సినిమాలో ఇన్వాల్వ్ చేస్తే హిట్టనే స్థాయిలో వాళ్ళ కాంబినేషన్ ప్రేక్షకులను నవ్వించింది. 'ఢీ'కి ముందు 'వెంకీ'... తర్వాత 'రెడీ', 'కింగ్', 'నమో వెంకటేశాయ', 'దూకుడు', 'బాద్ షా' - ఇలా ప్రతి సినిమాలో కామెడీ పండింది. ముఖ్యంగా 'బాద్ షా'లో జయసూర్యగా ఆయన వినోద విశ్వరూపమే చూపించారు. 


కామెడీ 'కిక్'...
సూపర్ హిట్!
'కిక్'లో మాస్ మహారాజా రవితేజ హీరో. ఆయనతో పాటు ఆ సినిమాలో మరో హీరో? బ్రహ్మానందం. రాజ్... హల్వా రాజ్... అంటూ రవితేజ, ఇలియానాతో కలిసి చేసిన కామెడీ యమా 'కిక్' ఇచ్చింది. సినిమాను సూపర్ హిట్ చేసింది. 'మీ పెద్దోళ్ళు ఉన్నారే...' అంటూ పెళ్ళి సంబంధానికి ఇలియానా ఇంటికి వెళ్ళే సన్నివేశాన్ని ఎవరు మర్చిపోతారు!?


బన్నీ 'రేసు గుర్రం'...
కిల్ బిల్ పాండే వినోదం!
'రేసు గుర్రం' మరో పాతిక నిమిషాల్లో సినిమా ముగుస్తుందని అనుకుంటుండగా స్క్రీన్ మీదకు వస్తారు. అక్కడ నుంచి ఓ పావుగంట కామెడీతో పిచ్చెక్కించారు. నో లాజిక్స్, ఓన్లీ బ్రహ్మి మేజిక్ వర్కవుట్ అయ్యిండక్కడ! ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ తిన్న ఫీలింగ్ ఇస్తుంది. కిల్ బిల్ పాండే పాత్రలో బ్రహి చెలరేగుతుంటే... అలా చూస్తూ ఉండిపోతాం! శ్రీను వైట్ల తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో బ్రహ్మిని ఆ స్థాయిలో వాడుకున్నది సురేందర్ రెడ్డి మాత్రమే అనుకుంట! 'కిక్' కూడా ఆయనదే.


ఒరేయ్ చారీ... అదిగో
'అదుర్స్' ఉంటుందిరా!
'ఒరేయ్ చారీ...' డైలాగ్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. బ్రహ్మానందం మన కళ్ళ ముందు కనపడతారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆయన కలిసి 'అదుర్స్'లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు మరి! నయనతారకు ఆయన లైన్ వేసే సన్నివేశాలు గానీ, ఆ తర్వాత హీరోను పట్టించాలని విలన్ వద్దకు వెళ్ళిన తర్వాత చేసిన నటన గానీ మహాద్భుతం! నవ్వుల అమృతం! 'అదుర్స్'తో పాటు వీవీ వినాయక్ తీసిన 'నాయక్', 'లక్ష్మీ' సినిమాల్లో బ్రహ్మి క్యారెక్టర్లు కూడా బావుంటాయి. 


మన్మథుడు...
నవ్వించాడు!
మాటలు తక్కువ... నవ్వులు ఎక్కువ - మాటల మాంత్రికుడిగా పేరొందిన త్రివిక్రమ్ రచయితగా, దర్శకుడిగా చేసిన సినిమాల్లో బ్రహ్మానందం క్యారెక్టర్స్ స్టైల్. నవ్వుల బ్రహ్మలో నటుడిని వాడుకుంటూ చిన్న మాటలతో చిరునవ్వులు తెప్పించారు.  ఓసారి 'మన్మథుడు'లో ఎయిర్ పోర్టులో ఎస్కిలేటర్ దిగే సన్నివేశంలో 'మాకు అలా దిగాలని తెలియక మామూలుగా దిగిపోయాం' అని నాగార్జున చెప్పిన తర్వాత బ్రహ్మానందం ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ ఒక్కసారి గుర్తు చేసుకోండి. అదొక్కటే కాదు... టీ తాగిన తర్వాత 'దే పెయిడ్ నో' అనడం కూడా! 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లేశ్వరి', 'అతడు', 'జల్సా', 'అత్తారింటికి దారేది' ఇలా చెబుతూ వెళితే త్రివిక్రమ్ సినిమాల్లో  బ్రహ్మికి మంచి క్యారెక్టర్లు పడ్డాయి.


Also Read : హ్యాపీ బర్త్ డే త్రివిక్రమ్ - ప్రేక్షకుడితో నడిచే జీవితం, ఎప్పటికీ మరువలేని పుస్తకం! ఆయన్ను ఎందుకు 'గురూజీ' అంటున్నారు? 
 
బ్రహ్మానందం లేకుండా స్టార్ హీరోలు హిట్లు అందుకున్నారు. వాళ్ళ ఇమేజ్ వల్ల సూపర్ హిట్స్ అయిన సినిమాలు ఉన్నాయి. అయితే, పైన చెప్పిన సినిమాల్లో బ్రహ్మానందం బదులు మరొకరిని ఊహించుకోలేం. ఆ సినిమాల విజయాల్లో ఆయనకూ వాటా ఉంది. 


Also Read : వయసుతో పాటు మారిన కథానాయకుడు, ప్రయోగాలకు భరోసా ఇచ్చిన 'విక్టరీ'