నాలుగేళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ‘పఠాన్’ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్నారు. జనవరి 25న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.600 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పటికీ భారీ వసూళ్లతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘పఠాన్’ చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌ పాల్గొన్నారు. ఇందులో షారుఖ్ ఖాన్ కీలక విషయాలు వెల్లడించారు. వరుస పరాజయాలతో తను ఎలాంటి బాధను అనుభవించారో వివరించారు.     


‘జీరో’తో సినిమాలకు బ్రేక్


2018లో షారుఖ్ నటించిన ‘జీరో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని పొందింది. మంచి విజయాన్ని అందుకుంటుంది అనుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ‘ఫ్యాన్’, ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ లాంటి సినిమాలు సైతం బాగా ఆడలేదు. వరుస పరాభవాలతో మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు చెప్పారు. వరుస పరాజయాలకు తట్టుకోలేక బాత్ రూమ్ లో కూర్చొని ఏడ్చినట్లు వెల్లడించారు. అదే సమయంలో కొంత కాలం పాటు సినిమాలకు విరామం తీసుకోవాలని భావించినట్లు చెప్పారు. లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన ‘పఠాన్‘ తన కెరీర్ లో బెస్ట్ విజయాన్ని అందించిందని చెప్పుకొచ్చారు.   


పరాజయాలను తట్టుకోలేక ఎన్నోసార్లు ఏడ్చాను-షారుఖ్


“ప్రతి ఒక్కరూ వైఫల్యాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని తట్టుకునే శక్తిని ఒక్కోసారి కోల్పోతాం. ఆ సమయంలో చాలా బాధపడతాం. ఒక్కోసారి ఏడ్పు వస్తుంది. నాకు కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యింది. ‘జీరో’తో పాటు వరుసగా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మా ఇంట్లో ఓ స్పెషల్ బాత్ రూమ్ ఉంది. నేను అందులోకి చాలా బాధలో ఉన్నప్పుడు మాత్రమే వెళ్తాను. ‘జీరో’ మూవీ తర్వాత అలా చాలా సార్లు వెళ్లాను. నేను అందులోకి వెళ్తే ఏడుస్తాను అనే విషయం మా ఇంట్లో వాళ్లకు తెలుసు. కానీ, అక్కడే ఉండిపోలేం కదా. రేపటి విజయం కోసం ప్రయత్నించాల్సిందే. తిరిగి మనల్ని మనం నిరూపించుకోవాల్సిందే!” అని షారుఖ్ వివరించారు.    






‘డుంకీ’, ‘జవాన్’ సినిమాలపై భారీ అంచనాలు


షారుఖ్ చెప్పినట్లుగానే వరుస పరాజయాల తర్వాత తను అద్భుత విజయాన్ని అందుకున్నారు.  ‘పఠాన్‘ మూవీతో బాలీవుడ్‌ లో అతిపెద్ద ఓపెనింగ్స్‌ ను సాధించారు. ఈ బ్లాక్ బస్టర్ హిట్ తో అతడి రాబోయే సినిమాలు ‘డుంకీ’, ‘జవాన్’పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆయన ఈ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. శర వేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయి. ఈ సినిమాలు సైతం ‘పఠాన్’ లాంటి హిట్ అందుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.


Read Also: చెన్నై ఎయిర్ పోర్టులో చేదు అనుభవం, ఎయిర్ ఇండియాపై ఖుష్బూ ఆగ్రహం