నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'అమిగోస్'. ఇందులో ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) నాయిక. తెలుగులో ఆమెకు తొలి చిత్రమిది. అయితే, కథానాయికగా మాత్రం కాదు. 


కన్నడలో ఆషికా రంగనాథ్ సుమారు పది సినిమాలు చేశారు. గత ఏడాది తమిళ తెరకు పరిచయం అయ్యారు. ఇప్పుడు 'అమిగోస్'తో మన ముందుకు వస్తున్నారు. 'ఎన్నో రాత్రులొస్తాయి గానీ...' రీమిక్స్ వీడియో సాంగ్ విడుదలైన తర్వాత ఎవరీ ఆషిక? అని కొందరు ఆరా తీస్తున్నారు. నందమూరి నయా నాయిక గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు... 


ఆషికా రంగనాథ్ కన్నడ అమ్మాయి. ఆమెది కర్ణాటకలోని హాసన్ జిల్లా. కాలేజీ రోజుల నుంచి నటన అంటే ఆసక్తి. అందాల పోటీల్లో కూడా పాల్గొన్నారు. 'మిస్ ఫ్రెష్ ఫేస్ బెంగళూరు 2014' రన్నరప్ ఆషిక. ఆ పోటీల వల్లే 'క్రేజీ బాయ్' ఛాన్స్ వచ్చింది. 


ఆ మూడు వచ్చాక...
తొలి సినిమా విడుదల



  • కన్నడ సినిమా 'క్రేజీ బాయ్'తో ఆషికా రంగనాథ్ కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ సినిమా ద్వారా ఆమెకు తొలి గుర్తింపు లభించింది. అయితే, ఆషిక సంతకం చేసిన తొలి సినిమా 'క్రేజీ బాయ్' కాదు.

  • ఆషికా రంగనాథ్ సంతకం చేసిన తొలి సినిమా 'రాజు కన్నడ మీడియమ్'. అందులో తొమ్మిదో తరగతి చదివే అమ్మాయిగా కనిపించారు. స్కూల్ డ్రస్‌లు వేశారు. ఆ సినిమా చూస్తే నిజంగా చిన్న అమ్మాయిలా ఉంటారు. అయితే, ఆషిక నాలుగో సినిమాగా అది విడుదల అయ్యింది. ఆ లోపే కన్నడలో గోల్డెన్ స్టార్ గణేష్ సరసన 'ముగులు నగే' సినిమా చేశారు.  
     
    అనువాద చిత్రాల్లో అతిథిగా...
    తెలుగు ప్రేక్షకుల ముందుకు!

  • 'అమిగోస్' ఆషికా రంగనాథ్ తొలి తెలుగు సినిమా. అయితే, ఆల్రెడీ ఆమె తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పునీత్ రాజ్ కుమార్ 'జేమ్స్'లో అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. కిచ్చా సుదీప్ 'కే3 కోటికొక్కడు' సినిమాలో ప్రత్యేక గీతం చేశారు. ధనుంజయ 'మదగజ' (తెలుగు ట్రైలర్ విడుదల అయ్యింది కానీ సినిమా విడుదల కాలేదు) లో కథానాయికగా నటించారు. అందులో జగపతి బాబు కూడా ఉన్నారు.






జిమ్ వీడియోస్ చూసి...
తమిళ సినిమాలో ఛాన్స్!



  • వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్'లో నటించిన అథర్వ గుర్తు ఉన్నారు కదా! ఆయన, 'పందెం కోడి' ఫేమ్ రాజ్ కిరణ్ నటించిన 'పట్టతు అరసన్'. ఆషికా రంగనాథ్ తొలి తమిళ చిత్రమిది. కబడ్డీ ప్లేయర్ రోల్ చేశారు. ఇందులో ఆమెకు ఛాన్స్ రావడం వెనుక జిమ్ వీడియోస్ కీలక పాత్ర పోషించాయి అంటే నమ్ముతారా? అవి చూసే ఆమెను తీసుకున్నారు. 

  • ఆషికా రంగనాథ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అంటే 'రాంబో 2'. దాంతో ఎక్కువ పాపులారిటీ వచ్చింది. అందులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నా ఆమెకు ఎక్కువ పేరు వచ్చింది. మంచు మనోజ్ హీరోగా 'పోటుగాడు' తీసిన పవన్ వడయార్ ఆ సినిమా దర్శకుడు.






'బొమ్మరిల్లు' సిద్ధార్థ్ అంటే క్రష్!



  • ఆషికా రంగనాథ్ కన్నడ అమ్మాయి అయినా... తెలుగు సినిమాలు చూడటం ఆమెకు అలవాటు. హీరో సిద్ధార్థ్ అంటే క్రష్. 'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాలు చాలాసార్లు చూశానని తెలిపారు. అన్నట్టు... ఇప్పుడు తమిళంలో సిద్ధార్థ్ సరసన నటించే అవకాశాన్ని ఆమె అందుకున్నారు. ఆ సినిమా తనకు ఎంతో స్పెషల్ అని చెబుతున్నారు. 






పునీత్ మరణంతో...  
ఆషిక కల కలగానే!



  • దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిర్మాణ సంస్థ పీఆర్కే ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'ఓ 2' సినిమాలో ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. ఆయన 'జేమ్స్'లో అతిథి పాత్ర చేశారు. ఆయనతో 'ద్విత'లో నటించే అవకాశం అందుకున్నారు. అయితే, పునీత్ మరణంతో ఆమె కల కలగా మిగిలింది.    







ఆషిక కంటే ముందు అనూష



  • ఆషికా రంగనాథ్‌ది సినిమా ఫ్యామిలీ కాదు. అయితే, ఆమె కంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఒకరు వచ్చారు. ఆషిక అక్క అనూష రంగనాథ్ కన్నడ నటి. అక్క బాటలో నడుస్తూ ఆమె కూడా ఇండస్ట్రీకి వచ్చారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ 'రోగ్' ఫేమ్ ఇషాన్ సరసన కన్నడలో ఓ సినిమా చేస్తున్నారు. తెలుగులో 'అమిగోస్' విడుదల తర్వాత కొత్త సినిమాలకు సంతకం చేయాలని భావిస్తున్నారు.