సూపర్ స్టార్ మహేష్ మరోసారి తన మంచి మనసు చాటారు. ఓ చిన్నారి గుండె ఆపరేషన్‌కు సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. మహేష్ బాబు భార్య నమ్రతా శుక్రవారం ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. మహేష్ బాబు చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులకు గుండె సంబంధిత సమస్యలకు శస్త్రచికిత్సలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా స్కిమిటార్ సిండ్రోమ్(scimitar syndrome) అనే సమస్యతో బాధపడుతున్న సహస్ర అనే చిన్నారి సర్జరీకి మహేష్ బాబు సాయం చేశారు. చికిత్స తర్వాత చిన్నారి కోలుకుందని, ఇప్పుడు క్షేమంగానే ఉందని నమ్రతా తెలిపారు. ఇప్పటివరకు మహేష్ బాబు 1050 మందికి శస్త్ర చికిత్సలు చేయించారు. 


మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కరోనా వైరస్ వల్ల వాయిదా పడింది. ఫిబ్రవరి 14న ఈ సినిమా తొలిపాటను విడుదల చేసేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. మహేష్ బాబు మోకాలి సర్జరీ చేయించుకోవడం, ఆ తర్వాత ఆయనకు కరోనా రావడంతో షూటింగుకు బ్రేక్ పడింది. ఫిబ్రవరిలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేయాలనుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ తేదీకి చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ‘ఆచార్య’ను తీసుకురానున్నట్లు ప్రకటించారు. దీంతో స‌ర్కారు వారి పాట వెన‌క్కి వెళ్లింద‌ని తెలుస్తోంది. అయితే... దీనిపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.


మహేష్ బాబు సరసన కీర్తీ సురేష్ కథానాయికగా నటిస్తున్న 'సర్కారు వారి పాట'కు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. 'ఆంజనేయులు', 'శ్రీరస్తూ శుభమస్తు' తర్వాత దర్శకుడితో తమన్ కు మూడో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇటీవలే మహేష్ బాబుకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. అదే సమయంలో ఆయన సోదరుడు రమేష్ బాబు మరణం ఆ కుటుంబాన్ని విషాదంలో నింపింది.