ఒక్క సినిమాకు కోట్లలో పారితోషికాలు తీసుకునే నటులు, సంపాదనకు తగ్గట్టే ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ జూబ్లీ హిల్స్ లో ఓ ఇల్లు కొన్నారు. ఇప్పుడు అదే ఏరియాలో మహేష్ బాబు కూడా ఓ ప్లాటు కొన్నట్టు రియల్ ఎస్టేట్ వివరాలను అందించే ఓ వెబ్ సైట్ ప్రచురించింది. ఆ వెబ్ సైట్ చెప్పిన వివరాల ప్రకారం.... మహేష్ బాబు కొన్న ఇల్లు ఖరీదు రూ.26 కోట్లు. దాదాపు 1442 గజాల్లో ఈ ప్లాటు ఉంది. దీన్ని ఆయన విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి నుంచి కొన్నారు. స్టాంప్ డ్యూటీ కింద కోటి నలభై మూడు లక్షల రూపాయలు చెల్లించారు. అలాగే ట్రాన్ఫర్ డ్యూటీ కింద మరో రూ.39 లక్షలు చెల్లించినట్టు వెబ్ సైట్ ప్రచురించింది. 


టాలీవుడ్ హీరోలంతా ఎక్కువగా తమ సంపాదనను స్థిరాస్థుల మీదే పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ నగర శివార్లలో స్థలాలు కొన్నారు. ఇంకొంతమంది ఫామ్ హౌస్‌లు కట్టుకున్నారు. నగర శివార్లలో అనేక మంది సెలెబ్రిటీలకు స్థలాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ లో గజం భూమి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల దాకా ధర పలుకుతోంది.  మహేష్ బాబు ప్లాటు నవంబర్ 17న రిజిస్ట్రేషన్ అయినట్టు తెలుస్తోంది.


ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలపై తీసినట్టు సమాచారం. ఈ సినిమా మొన్నటివరకు సంక్రాంతి బరిలో నిలిచింది. జనవరి 13న విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్. ఆ తరువాత వేసవి సెలవుల్లో విడుదల చేస్తామంటూ వాయిదా వేశారు. 


Read Also: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల



Also Read:సమంత ఐటెం సాంగ్.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్..