ముఖ్యమంత్రి జగన్‌ను చంపాలని చూస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపిస్తున్నారు. అదే అనుమానం ఉంది డిప్యూటీ సీఎం స్థాయి నేత కూడా బహిరంగంగానే చెబుతున్నారు. హత్యా రాజకీయాలు మీకే అలవాటు అని ప్రతిపక్షం ఎదురుదాడి చేస్తోంది. ఇవీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న రాజకీయాలు.  రాజకీయ ఆరోపణల్లో ఎంత స్థాయికైనా వెళ్లిపోయే పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది.  నిన్నామొన్నటి వరకూ సామాన్య ప్రజలు ఎవరూ భరించేలని బూతులు తిట్టుకునేవారు. ఇప్పుడు ఆ బూతులకు అదనంగా హత్యల వంటి విషయాలు జోడు కలుస్తున్నాయి. ఎందుకిలా జరుగుతోంది ? హత్యలు చేస్తారనే ప్రకటనలు అంత తేలిగ్గాఎలా చేయగలుగుతున్నారు..? ఈ ప్రకటనల వెనుక కుట్రేమైనా ఉందా ?


Also Read: ఏపీ హైకోర్టుకు అదనపు భవనం.. భూమి పూజ చేసిన చీఫ్ జస్టిస్ !


తెలంగాణకు చెందిన మల్లాది వాసు పెట్టినచిచ్చు !


తెలంగాణకు చెందిన మల్లాది వాసు అనే తెలంగాణ రాష్ట్ర సమితి కార్పొరేటర్ ఒకరు కార్తీక భోజనాల కార్యక్రమంలో చంద్రబాబు కుటుంబాన్ని కించ పరిచిన ఏపీకి చెందిన ముగ్గురు నేతల్ని అంతమొందిస్తే రూ. యాభై లక్షల నజరానా ఇస్తానని ప్రకటించారు. ఆయన ప్రకటన సహజంగానే సంచలనం సృష్టించింది. ఆ ప్రకటన చేసిన వ్యక్తి టీడీపీ కాదు.. ఏపీ అసలే కాదు. కానీ సామాజికవర్గ కోణంలో చేశారు. దాంతో ఏపీలో అధికార పార్టీ నాయకులు తీవ్రంగా రియాక్టయ్యారు. చాలా మంది మల్లాది వాసు సంగతి తేలుస్తామని ప్రకటించారు. అప్పట్నుంచి మల్లాది వాసు ఆజ్ఞాతంలోనే ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో  అనంతపురం జిల్లాలో  మల్లాది వాసును అభినందిస్తూ ఆగంతకులు ఫ్లెక్సీలు పెట్టారు. పరిటాల ఫ్యాన్స్ అని తమకు తాము చెప్పుకున్నారు. దీంతో ఉలిక్కి పడటం వైఎస్ఆర్‌సీపీ నేతల వంతయింది. ఎందుకంటే అనంతపురంలో గత రక్తచరిత్ర ఇప్పటికీ కళ్ల ముందు ఉంది.  మల్లాది వాసు చేసిన ప్రకటన హింసను ప్రేరేపించేదిలా ఉండటం.. దానికి పరిటాల ఫ్యాన్స్ పేరుతో కొంత మంది మద్దతు ప్రకటించడంతో సహజంగానే కలకలం రేగింది. ఏపీ పోలీసులు.. అనంతపురం పోలీసులు ఈ ఫ్లెక్సీల అంశంపై విచారణ చేసినప్పటికీ సరైన సమాచారం సాధించలేకపోయారు. 


Also Read: పవన్ ను ప్రజలు రిజెక్ట్ చేశారు... ఒక్కో సినిమాకు పవన్ రెమ్యునిరేషన్ ఎంత?... అంబటి రాంబాబు ఫైర్


సీఎం జగన్ హత్యకు కుట్ర చేశారంటూ రాప్తాడు ఎమ్మెల్యే ప్రకటన !


అయితే అనూహ్యంగా పరిటాల శ్రీరామ్‌పై రాప్తాడు నుంచి పోటీ చేసి విజయం సాధించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెరపైకి వచ్చి   చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని హత్య చేసి అయినా సరే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని అందుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.  ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉన్నదని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆరోపించారు. జగన్‌కు రక్షణ కల్పించేందుకు వైసీపీ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఒకరి తర్వాత ఒకరు ఇలా వైఎస్ఆర్‌సీపీ నేతలు జగన్ భద్రత కోణంలో తెర ముందుకు రావడం సహజంగానే రాజకీయాలను ఉద్రిక్తంగా మారుస్తున్నాయి. 


Also Read: జగనన్న ఉన్నాడు జాగ్రత్త... గుంతల రోడ్డుపై ఫ్లెక్సీ... వైరల్ అవుతున్న వీడియో


అదే కుట్ర జరిగిందని డిప్యూటీ సీఎం సైతం ప్రకటన !


వైఎస్ఆర్‌సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై టీడీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. హత్య రాజకీయాలు ఎవరివో ఒకసారి వెనక్కి చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. కోడి కత్తి పేరుతో డ్రామాలాడారని.. గొడ్డలి కత్తికి బాబాయ్‌కు బలి ఇచ్చారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి రాజకీయాలు చేయాలనుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో అంచనా వేసుకోవాలని సూచిస్తున్నారు. దారుణమైన పరిపాలనతో ప్రజల్ని నిలువదోపిడి చేస్తూ  విషయాన్ని పక్కదోవ పట్టించడానికే ఈ డ్రామాలు ఆడుతున్నారని విమర్శిస్తున్నారు. 


Also Read:  ఏపీలో శాంతి భద్రతలు దిగజారాయి... తిక్కారెడ్డిపై దాడి ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ


మరి పోలీసులేం చేస్తున్నారు ? 


నిజానికి ముఖ్యమంత్రి భద్రత అత్యంత క్లిష్టమైనది. ఈ విషయంలో ఏ చిన్న అనుమానం ఉన్న పోలీసులు..భద్రతా సిబ్బంది ఊరుకోరు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతారు. కానీ ఇక్కడ ప్రతిపక్ష నేతపై తీవ్రమైన ఆరోపణలను వైఎస్ఆర్‌సీపీ నేతలు చేస్తున్నారు. కానీ పోలీసులు స్పందించడంలేదు. ఆయన భద్రతకు ముప్పు ఉంటే జాగ్రత్తలు తీసుకునే అంశంపై పోలీసులు ఇప్పటికీ చర్యలు తీసుకుని ఉండేవారు. డిప్యూటీ సీఎం స్థాయి నేత కూడా కుట్ర చేశారని నేరుగా  చెబుతున్నందున పోలీసులు ఈ విషయంలో సీరియస్‌గా తీసుకుని సమాచారం సేకరించాలని అంటున్నారు.  అయితే పోలీసులు కూడా  వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న ఆరోపణలను రాజకీయ కోణంలోనే చూసి లైట్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. 


Also Read: ఏపీకి వైసీపీ హానికరం... లక్షల కోట్ల అప్పులున్న రాష్ట్రాన్ని ప్రైవేటీకరణ చేస్తారా.... ఉక్కు దీక్షలో పవన్


హత్యలు, కుట్రలతో  రాజకీయంతో మరింత దిగజారుతున్న రాజకీయాలు 


రాజకీయం కోసమే అయితే.. ఇలాంటి ఆరోపణలు చేయడం దిగజారిపోయిన రాజకీయ వాతావరణానికి సాక్ష్యంగా చెప్పుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకూ భాషా పరమైన కాలుష్యంతోనే రాజకీయం భ్రష్టుపట్టిపోయిందనుకుంటే ఇప్పుడు దారుణంగా హత్యల వరకూ ఆరోపణలు వెళ్లాయి. వీటికి రాజకీయ నేతలే అడ్డుకట్ట వేయకపోతే.. పరిస్థితి ఇంకా ఇంకా దిగజారిపోయే అవకాశం ఉందన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి