ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు భవన నిర్మాణానికి చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా శంకుస్థాపన చేశారు. సోమవారం ఉదయం 9.50 గంటలకు శాస్త్రోక్తంగా భూమిపూజ జరిగింది. ప్రస్తుతం ఉన్న భవనం పూర్తి స్థాయి కోర్టు విధుల నిర్వహణకు సరిపోకపోవడంతో హైకోర్టు ఎదురుగా అదనపు భవనం నిర్మాణానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ అదనపు భవనాన్ని జి ప్లస్ 5 సామర్థ్యంతో నిర్మించనున్నారు. ఈ అదనపు భవన నిర్మాణ ప్రణాళిక, ఇతర అంశాల వివరణను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఇతరులకు ఉన్నతాధికారులు వివరించారు. రూ. 29 కోట్ల 40 లక్షల అంచనా వ్యంతో 14 కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల చాంబర్లు తదితరాల కోసం సుమారు 76,000 చదరపు అడుగుల నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
నిజానికి ఈ అదనపు భవన ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం ... అమరావతి మాస్టర్ ప్లాన్‌లో జిల్లా కోర్టు కోసం ప్రతిపాదించారు. పూర్తి స్థాయి హైకోర్టు భవన నిర్మాణానికి గతంలో శంకుస్థాపన జరిగింది. అయితే ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణాలన్నింటినీ నిలిపివేసింది. హైకోర్టు భవనం కూడా పునాదుల స్థాయిలోనే ఆగిపోయింది. ఈ కారణంగా ప్రస్తుతం హైకోర్టు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగాలంటే మరో భవనం అవసరం అని ప్రతిపాదించారు. కానీ ప్రభుత్వం చాలా కాలం ఆలస్యం చేసింది. మూడు రాజధానులు చేస్తున్నందున కర్నూలుకు హైకోర్టుకు తరలించాలని భావిస్తున్నందున అదనపు నిర్మాణం కోసం ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదు.
Also Read: జగనన్న ఉన్నాడు జాగ్రత్త... గుంతల రోడ్డుపై ఫ్లెక్సీ... వైరల్ అవుతున్న వీడియో
చివరికి అంగీకారం తెలిపింది. ఆరు నెలల కిందటే నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం నిధుల మంజూరుకు అంగీకారం తెలిపిన తర్వాత టెండర్లు పిలిచారు. కానీ టెండర్లు దక్కించుకోవడానికి పెద్ద పెద్ద సంస్థలేవీ ముందుకు రాలేదు. ఇప్పటికే అమరావతిలో కట్టిన వాటికి పెండింగ్ బిల్లులు ఉండటమే దీనికి కారణం. అయితే రెండో సారి పిలిచిన టెండర్లకు స్పందన ఉండటంతో ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. కర్నూలుకు రాజధాని తరలింపుపై సందిగ్ధం ఉండటంతో శరవేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసే అవకాశం ఉంది.
Also Read: ఏపీలో శాంతి భద్రతలు దిగజారాయి... తిక్కారెడ్డిపై దాడి ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ
మూడు రాజధానుల బిల్లులు .. సీఆర్డీఏ రద్దు బిల్లును కూడా వెనక్కి తీసుకోవడంతో గతంలో ఏఎంఆర్డీఏ పేరు మీద జారీచేసిన టెండర్లు కూడా ఇప్పుడు సీఆర్డీఏ పేరు మీద ఖరారు చేస్తారు. మొత్తంగా చూస్తే హైకోర్టుకు మరిన్నిఅదనపు సౌకర్యాలు కలగనున్నాయి.