మహేష్ బాబు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు శనివారం రాత్రి హఠాత్తుగా మరణించారు. అతని అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఘట్టమనేని కుటుంబసభ్యులతో పాటూ, కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అంత్యక్రియల వేళ ఘట్టమనేని కుటుంబం కన్నీరుమున్నీరైంది.  అంతకుముందు అభిమానులు, పరిశ్రమలోని వారి చివరి చూపు కోసం పద్మాలయ స్టూడియోస్‌లో కాసేపు రమేష్ బాబు భౌతిక కాయాన్ని ఉంచారు.  అక్కడ కుటుంబసభ్యులంతా నివాళులు అర్పించారు. యాభై ఆరేళ్ల వయసులోనే రమేష్ బాబు మరణించడం వారి కుటుంబానికి తీరని లోటే. కొడుకు మృతదేహాన్ని చూసి తల్లి ఇందిరా దేవి, తండ్రి కృష్ణ భోరున విలపించారు. 


రమేష్ బాబు బాలనటుడిగా ఎన్నో సినిమాలు చేశారు. ఆ తరువాత హీరోగా కూడా మారారు. తండ్రి, తమ్ముడితో కలిసి కూడా నటించారు. పదిహేను సినిమాలకు పైగా నటించారు. 1997లో చివరిసారి తెరపై కనిపించారు. ఆ తరువాత  సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. 2004లో మహేష్ బాబు హీరోగా అర్జున్ అనే సినిమాను నిర్మించారు. ఆ సినిమాతో రమేష్ బాబు నిర్మాతగా మారారు. ఆ తరువాత తమ్ముడి సినిమాలకు సమర్పకుడిగా మారారు. మహేష్ బాబు సినిమాల్లో ఆగడు, దూకుడు అతని సమర్పణలో వచ్చినవే.


రమేష్ బాబు అంత్యక్రియలకు మహేష్ బాబు దూరమయ్యారు. కరోనా సోకి ఐసోలేషన్లో ఉన్నారు. అన్నయ్యను చివరిసారి చూసుకునే అవకాశం లేకుండాపోయింది. దీంతో సోషల్ మీడియా వేదికగా అన్నయ్యపై ప్రేమను వ్యక్తపరిచారు. ‘నువ్వు లేకుంటే ఈ రోజు నేను లేను. నువ్వే నాకు అన్నీ. ఇంతవరకు నాకోసం చేసిన అన్నింటికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి తీసుకో. ఈ జన్మలోనే కాదు, నాకు మరో జన్మంటూ ఉంటే అప్పుడు కూడా నువ్వే నా అన్నయ్య, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అంటూ పోస్టు చేశారు మహేష్ బాబు.