Kalki 2898 AD Trailer: ఆత్మ నిర్భర భారత్. ప్రధాని మోదీ ఎన్డీయే 2 ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకువచ్చిన నినాదం. విదేశాల్లో సాంకేతికను వినియోగించుకుంటూ అక్కడి సౌకర్యాలతో కాకుండా పూర్తిగా భారత్‌లోనే ఓ ప్రొడక్ట్ తయారు అయితే ఆ వస్తువుకు ఎంతటి పొగరు ఉంటుందో అదే ఆత్మ నిర్భర భారత్. పక్కా లోకల్ అన్నమాట. ఇప్పుడు నాగ్ అశ్విన్ విడుదల చేయటానికి సిద్ధం చేసిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) కూడా అంతే. ఆత్మ నిర్భర భారత్. యానిమల్ సినిమాలో విలన్స్ ని చంపటం కోసం రణ్ బీర్ కపూర్ కి ఫ్రెడ్డీ అనే వ్యక్తి ఓ మిషన్ గన్ వెహికల్ తయారు చేసి ఇస్తాడు కదా. అప్పుడు చెప్తాడు. ఇందులో ఒక్కో పార్ట్ ఒక్కో నగరంలో తయారైందని.. మొత్తంగా ఇండియాలోనే చేశామని.. ఆత్మనిర్భర భారత్ అని సెల్యూట్ కొడతాడు. కల్కి సినిమా కూడా అంతే. హాలీవుడ్ రేంజ్ సినిమా అంటే హాలీవుడ్ కే వెళ్లి తీయనక్కర్లేదు. మన దగ్గరున్న ఫెసిలిటీస్‌తో, మినిమం బడ్జెట్‌తో ఆ రేంజ్ అవుట్ పుట్ ఇవ్వొచ్చని నాగి ఈ రోజు విడుదల చేసిన కల్కి ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.


అంత డబ్బా అని ఆశ్చర్యం...
ఒక సినిమా బడ్జెట్‌కు రూ. 600 కోట్లు ఖర్చు పెడుతున్నారనే వార్త బయటకు రాగానే అందరూ నాగికి ఏమైనా స్క్రూ లూజ్ అయిందేమోనని అనుకున్నారు. ఎంత మహానటి లాంటి హిట్ కొడితే మాత్రం..నేషనల్ అవార్డులు రాబడితే మాత్రం..వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ అల్లుడి మీద అంత డబ్బు ఖర్చు ఎలా పెట్టేస్తారంటూ డౌటానుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఈరోజు విడుదలైన కల్కి ట్రైలర్ లో ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. బ్లాక్ బస్టర్ కొట్టబోయే మాస్టర్ పీస్‌ను చూస్తున్న ఫీలింగ్ కలుగక మానదు.


ఇండియన్ మైథాలజీకి ట్రెండీ టచ్ ఇస్తూ... ఆరువేల సంవత్సరాల భారీ టైమ్ లైన్‌లో జరిగే గ్రాండ్ స్కేల్ కథనే తీసుకున్నాడు నాగ్ అశ్విన్. క్రీస్తు పూర్వం 3102 నుంచి ఆరు వేల సంవత్సరాలు ప్రయాణించి క్రీస్తు శకం 2898 వరకూ జరిగే ఈ కథలో కల్కి అవతారాన్ని ప్రస్తావిస్తారా లేదా భైరవనే కాశీనే కాపాడే కల్కినా లాంటి సస్పెన్స్ ఎలిమెంట్‌ను రివీల్ చేయకుండానే ట్రైలర్ కట్ చేసిన నాగ్ అశ్విన్ విజువల్స్ తో మాత్రం మెస్మరైజ్ చేశారు. సినిమాలో కనిపిస్తున్న సెట్ వర్క్, ఆర్ట్ వర్క్ అంతా ఇండియాలోనే కంప్లీట్ చేశారు. రామోజీ ఫిలిం సిటీ నుంచి రాయ దర్గం మెట్రో స్టేషన్ వరకూ అంతా లోకల్‌లోనే షూట్ చేశారు. ప్రభాస్, దిశాపటానీల మధ్య వచ్చే ఒక్క పాట కోసమే ఇటలీ వెళ్లారు తప్ప మిగిలినదంతా మేడిన్ ఇండియా. 


మహీంద్రాతో టై అప్...
చెన్నైలోని మహేంద్ర రీసెర్చ్ వ్యాలీ స్పేస్‌ను వాడుకుని మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీతో టై అప్ అయ్యి రూపొందిచిన ఫ్యూచరిస్టిక్ వెహికల్స్ కానీ, బుజ్జి లాంటి ఏఐ హ్యూమనాయిడ్ రోబో కార్స్ కానీ అన్నీ మేడిన్ ఇండియా అంటే ఆశ్చర్యం కలుగక మానదు. హాలీవుడ్ లో సినిమాలు అద్భుతం అని మనందరం నోరు వెళ్ల బెట్టి చూస్తుంటాం కానీ అక్కడ ఒక్కో సినిమాను ప్రొడ్యూస్ చేయటానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తుంటారు. పదుల సంఖ్యలో నిర్మాణ సంస్థలు భాగస్వామ్యమై ఏకంగా కంపెనీలను నెలకొల్పి ఏళ్ల పాటు సినిమాలను సిరీస్‌లుగా తీస్తున్న వాళ్లను మనం చూస్తుంటాం. కానీ 600 కోట్ల రూపాయల ఖర్చుతో వైజయంతీ మూవీస్ అనే తెలుగు నిర్మాణ సంస్థ... ఒకరిద్దరు హాలీవుడ్ నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని రూపొందించిన ఈ భారీ ప్రాజెక్ట్ మాత్రం హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంది. తీసేవాడిలో కంటెంట్ ఉండాలే కానీ క్రియేటివిటీని వాడుకుంటూ మినిమం బడ్జెట్‌లో అద్భుతాలు ఎలా సృష్టించొచ్చో కల్కి ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది.


Also Readహాలీవుడ్‌కు దిమ్మ తిరిగేలా కల్కి ట్రైలర్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్, ఇక రికార్డ్స్ చూసుకోండి



టార్గెట్ హాలీవుడ్
శాండియాగో కామికాన్ ఫెస్టివల్ లో సినిమాను ప్రమోట్ చేయటం మొదలుపెట్టినప్పుడే నాగ్ అశ్విన్ టార్గెట్ హాలీవుడ్ అని అర్థమైంది. రైడర్స్ అనే పేరుతో మాస్క్ మెన్‌ను రెడీ చేయించి ఆయన చేయించిన ప్రచారం... సినిమాకు తీసుకువచ్చిన బజ్ అన్నీ కల్కి ప్రాజెక్టుపై అందరీ దృష్టి పడేలా చేశాయి. ప్రత్యేకించి సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి కూడా మాట్లాడుకోవాలి. లెజండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి నటులను ప్రభాస్, దీపికా పదుకోన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు తీసుకోవటం, పశుపతి, రాజేంద్రప్రసాద్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ను కథకు మిళితం చేయటం అన్నీ కల్కి సినిమా రేంజ్ ను ఆకాశానికి తీసుకువెళ్లాయి. ఐపీఎల్, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఇలా ఏ ఒక్క ఈవెంట్ ను వదలకుండా సినిమా ప్రమోట్ చేస్తూ వచ్చిన టీమ్ ఈనెల 27న సినిమాను విడుదల చేయటానికి సిద్ధమైపోతోంది.


Also Readదీపిక పోస్టర్ విడుదల చేసిన కల్కి టీమ్ - భర్త రణవీర్ కామెంట్ చూశారా?