Prajwal Revanna Latest News: జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) నుంచి బహిష్కరణకు గురైన నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కష్టాలు పెరిగిపోయాయి. అంతకుముందు ఆయన పలువురు మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హాసన్ లోక్‌సభ స్థానం నుండి బరిలోకి దిగి ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది.  ఇప్పుడు ఆయనపై మరింత ఉచ్చు బిగుస్తోంది. లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలపై బెంగళూరులోని ప్రత్యేక కోర్టు రేవణ్ణను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన మూడు లైంగిక వేధింపుల కేసుల్లో మొదటి కేసులో ఆయనను సోమవారం జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.  


భారతదేశంలోని మూడవ అతి పిన్న వయస్కుడైన ఎంపీగా ప్రజ్వల్ గుర్తింపు సంపాదించుకున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణల మధ్య దేశం విడిచిపెట్టిన ఒక నెల తర్వాత బెంగళూరుకు తిరిగి రాగానే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.  అతని తండ్రి హెచ్‌డి రేవణ్ణ మాజీ మంత్రి.. హోలెనరసిపుర ఎమ్మెల్యే కాగా, అతని తాత హెచ్‌డి దేవెగౌడ రాజ్యసభ ఎంపీ.. మాజీ ప్రధాని. ప్రజ్వల్ సోదరుడు సూరజ్ రేవణ్ణ జేడీఎస్ ఎమ్మెల్సీ, డాక్టర్ గానూ సేవలు అందిస్తున్నారు.   


రేవణ్ణపై కోర్టులో సిట్  ఆరోపణలు 
ఈ కేసు దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.  రేవణ్ణను సిట్ సోమవారం కోర్టులో హాజరుపరిచింది. అంతకుముందు మే 31న కోర్టు రేవణ్ణను జూన్ 6 వరకు సిట్ కస్టడీకి పంపింది. ఆ తర్వాత జూన్ 10 వరకు కస్టడీని పొడిగించారు.  అక్కడ ప్రజ్వల్ రేవణ్ణ కస్టోడియల్ విచారణను ఎదుర్కొన్నాడు. సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా రేవణ్ణను సిట్ విచారించింది. ఆ తర్వాత మాజీ ఎంపీపై కోర్టులో పలు అభియోగాలు దాఖలయ్యాయి. దీంతో కోర్టు కూడా ఆరోపణల తీవ్రతను అర్థం చేసుకుని రేవణ్ణ కస్టడీని 14 రోజుల పాటు పొడిగించింది. ఇప్పుడు ప్రజ్వల్‌ను జూన్ 24 వరకు సిట్ కఠినంగా విచారించాల్సి ఉంటుంది. ఆరోపణల తీవ్రత, సిట్ సమర్పించిన ఆధారాలను దృష్టిలో ఉంచుకుని జూన్ 24 వరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోర్టు నిర్ణయించింది.


జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్ 
హాసన్ లోక్‌సభ స్థానానికి ఓటింగ్ జరగక ముందు, ప్రజ్వల్  వివాదాస్పద, అభ్యంతరకరమైన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఓటు వేసిన మరుసటి రోజే ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి పరారయ్యారు. మరోవైపు రేవణ్ణ ఆచూకీ కోసం సీబీఐ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. మే 18న బెంగళూరులోని ప్రత్యేక కోర్టు రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మే 31న బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు ప్రజ్వల్ చేరుకున్న వెంటనే సిట్ ఆయనను అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.