NIA Investigation On Terror Attack On Tourist Bus In Reasi District: జమ్మూ కశ్మీర్‌‌లోని రియాసీ జిల్లాలో పర్యాటక బస్సుపై ఆదివారం జరిగిన ఉగ్ర దాడికి సంబంధించి దర్యాప్తునకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రంగంలోకి దిగింది. ఈ దారుణానికి పాల్పడింది తామేనంటూ పాకిస్థాన్‌ లష్కరే తొయిబాకు చెందిన ది రిసెస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించుకుంది. అంతే కాకుండా మరిన్ని ఉగ్రదాడులకు పాల్పడతామంటూ హెచ్చరించింది. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజే ఈ దాడి జరగ్గా.. భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. పాక్ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్లు పేర్కొన్న క్రమంలో ఎన్ఐఏ బృందం రియాసీకి చేరుకుని స్థానిక పోలీసులతో కలిసి పరిస్థితి అంచనా వేసింది. ఫోరెన్సిక్ బృందం సైతం సాక్ష్యాలను సేకరించడంలో నిమగ్నమైంది. అటు, రియాసీలో భారత సైన్యం ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అటవీ ప్రాంతంలో డ్రోన్లతో జల్లెడ పడుతోంది. ఆర్మీ, సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు కలిసి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. రియాసీ, ఉదంపుర్, పూంఛ్, రాజౌరీ ప్రాంతాల్లోనే ఉగ్రమూకలు తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో అనువణువూ తీవ్రంగా గాలిస్తున్నారు.










ఆలయానికి వెళ్తుండగా..


ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన టూరిస్ట్ బస్సులో యాత్రికులు జమ్ముకశ్మీర్‌లోని శివ్‌ఖోడీ ఆలయాన్ని సందర్శించి అక్కడి నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి ఆదివారం వెళ్తున్నారు. మార్గం మధ్యలో రియాసీ జిల్లాలోని పోనీ ప్రాంతం తెర్వాత్ గ్రామంలో ఉగ్రవాదులు టూరిస్ట్ బస్సుపై మెరుపుదాడి చేశారు. డ్రైవర్‌కు బుల్లెట్ తాకడంతో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. 33 మంది గాయపడ్డారు. డ్రైవర్‌తో పాటు కండక్టర్ సైతం మరణించినట్లు అధికారులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు లోయలో పడడంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. అయినా శ్రమించిన అధికారులు క్షతగాత్రులను బయటకు తీసి ప్రాణాలు రక్షించారు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను సైతం వెలికితీశారు.


'చనిపోయినట్లు నటించాం'


ఈ దాడిలో ప్రాణాలతో బయటపడిన బాధితులు ఆ భయానక క్షణాలు తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. 'ముఖాలకు మాస్కులు పెట్టుకున్న ఆరుగురు లేదా ఏడుగురు ఉగ్రవాదులు ఒక్కసారిగా బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. తొలుత అన్ని వైపుల నుంచి కాల్పులు జరిపిన ఉగ్రవాదులు.. బస్సు లోయలో పడగానే అటుగా వచ్చి మళ్లీ కాల్పులు కొనసాగించారు. ఆ సమయంలో మేము భయాందోళనతో చనిపోయినట్లు నటించాం. కదలకుండా మౌనంగా ఉండిపోయాం. ఆ సమయంలో ఎలాగైనా ప్రాణాలతో బయటపడడమే ముఖ్యం అనుకున్నాం. ఓ 15 నిమిషాల తర్వాత స్థానికులు, పోలీసులు, భద్రతా సిబ్బంది వచ్చి మమ్మల్ని రక్షించారు. గాయాలతో ఉన్న మమ్మల్ని ఆస్పత్రికి తరలించారు.' అని బాధితులు మీడియాకు వెల్లడించారు.


Also Read: Biren Singh: మణిపుర్ సీఎం కాన్వాయ్‌పై ఉగ్ర దాడి - భద్రతా సిబ్బందికి గాయాలు