PM Modi First Tour To Italy After Swearing: దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Modi) మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి విదేశీ పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి 15 వరకూ ఇటలీలోని పుగ్లియాలో జీ7 కూటమి సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రదాని మోదీ ఇటలీ పర్యటన ఈ నెల 14న ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల సమూహమైన జీ7 సదస్సులో పాల్గొనాలని ఇటలీ పీఎం జార్జియా మెలోని గత ఏప్రిల్‌లో మోదీని ఆహ్వానించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన మెలోనికి అప్పట్లో కృతజ్ఞతలు తెలిపారు.


ఈ అంశాలపై చర్చ


జీ7 కూటమిలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ సమావేశాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులు, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ వాణిజ్యం, ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధాలు, రష్యా - ఉక్రెయిన్ యుద్ధాల ప్రభావం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ సదస్సుకు జీ 20 ఫోరమ్‌లోని దక్షిణాఫ్రికా, బ్రెజిల్ కూడా హాజరు కానున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14న జీ7 సమావేశంలో పాల్గొననున్న ప్రధాని.. ఆ వెంటనే భారత్‌కు తిరిగి రానున్నారు. అటు, ఈ నెల 15న స్విట్జర్లాండ్‌లో ఉక్రెయిన్ శాంతి సమావేశం జరగనుంది.


బాధ్యతల స్వీకరణ


ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని పార్లమెంట్ సౌత్ బ్లాక్‌లోని కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పీఎం కిసాన్ నిధి నిధుల విడుదల దస్త్రంపై తొలి సంతకం చేశారు. దీంతో 9.30 కోట్ల మంది రైతులకు రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం అందుతుంది. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన అన్నారు. 'రాబోయే కాలంలో రైతులు, వ్యవసాయ రంగానికి మరింత కృషి చేస్తాం. మాది కిసాన్ కళ్యాణ్‌‌కు పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం.. అందువల్ల బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంతకం చేసిన మొదటి ఫైల్ రైతు సంక్షేమానికి సంబంధించినది కావడం సముచితం.' అని ప్రధాని పేర్కొన్నారు.


Also Read: PM Modi Cabinet 3.0: ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ 3.0 - ఈ విషయాలు మీకు తెలుసా?