PM Modi Cabinet 3.0 Specialities: కేంద్రంలో ఎన్డీయే సర్కార్ 3.0  కొలువుదీరింది. దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతో సహా 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 30 మందికి కేబినెట్ మంత్రులుగా, ఐదుగురికి స్వతంత్ర హోదా, 36 మందిని సహాయ మంత్రులుగా అవకాశం దక్కింది. ఈసారి కేబినెట్‌లో పాత, కొత్త వారికి చోటు లభించింది. ఈసారి కేంద్ర మంత్రివర్గంలో ఏడుగురు మాజీ సీఎంలు, ఏడుగురు మహిళలకు అవకాశం కల్పించారు. అటు, మోదీ 2.0 సర్కార్‌లో భాగమైన 37 మందికి ప్రస్తుతం చోటు దక్కలేదు. కాగా, సోమవారం సాయంత్రం జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో మంత్రుల శాఖపై స్పష్టత రానుంది. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


ఏడుగురు మాజీ సీఎంలకు ఛాన్స్


కేంద్ర మంత్రి వర్గంలో ఏడుగురు మాజీ సీఎంలకు చోటు లభించింది. ఈ జాబితాలో శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), రాజ్‌నాథ్ సింగ్ (యూపీ), మనోహర్ లాల్ ఖట్టర్ (హర్యానా), సర్బానంద్ సోనోవాల్ (అస్సాం), హెచ్‌డీ కుమారస్వామి (కర్ణాటక), జితిన్ రామ్ మాంఝీ (బీహార్) ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గతంలో గుజరాత్ సీఎంగా పని చేశారు. ఇందులో బీజేపీకి చెందిన వారు ఐదుగురు కాగా.. కుమారస్వామి, మంఝీలు జేడీ(ఎస్), హిందుస్థానీ అవామీ మోర్చాకు ప్రాతినిధ్య వహిస్తున్నారు.


ఏడుగురు మహిళలకు చోటు


ప్రధాని మోదీ సారథ్యంలో కొలువుదీరిన మంత్రివర్గంలో ఏడుగురు మహిళలకు ప్రాధాన్యత కల్పించారు. వారిలో ఇద్దరికి కేబినెట్ హోదా లభించింది. గత ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సహా బీజేపీ ఎంపీలు శోభా కరంద్లాజే, అన్నపూర్ణాదేవి, రక్షాఖడ్సే, సావిత్రి ఠాకుర్, నిముబెన్ బాంభణియా, అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్‌లకు మంత్రి పదవులు దక్కాయి. వీరిలో నిర్మలా సీతారామన్, అన్నపూర్ణాదేవిలకు కేబినెట్ హోదా పొందగా.. మిగిలిన వారు సహాయ మంత్రులుగా పదవులు పొందారు. గతంలో మోదీ కేబినెట్‌లో 10 మంది మహిళా మంత్రులు ఉండగా.. ఈసారి ఆ సంఖ్య 7కు తగ్గింది.


37 మందికి దక్కని చోటు


కాగా, గత ప్రభుత్వంలో మోదీ నేతృత్వంలో పని చేసిన 37 మందికి ప్రస్తుత కొత్త మంత్రివర్గంలో చోటు దక్కలేదు. వారిలో ఏడుగురు కేబినెట్ హోదా కలిగిన వారు కాగా.. 30 మంది సహాయ మంత్రులుగా పని చేశారు. స్మృతి ఇరానీ, నారాయణ్ రాణె, పురుషోత్తం రూపాలా, అర్జున్ ముండా, ఆర్.కె.సింగ్, అనురాగ్ ఠాకుర్, మహేంద్రనాథ్ పాండేలు గతంలో కేబినెట్ మంత్రులుగా ఉండగా ఈసారి వీరికి మోదీ 3.0 మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఈ 37 మందిలో 18 మంది ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అటు, గత ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ఉండి.. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయినా ఎల్.మురుగన్ మాత్రం పదవి నిలబెట్టుకున్నారు.


అప్పట్లో సహాయ మంత్రులు.. ఇప్పుడు నో ఛాన్స్


మోదీ 2.0 సర్కారులో సహాయమంత్రులుగా చేసి మోదీ 3.0 మంత్రి వర్గంలో చోటు దక్కని వారు.. వీకే సింగ్, అశ్వినీ చౌబే, ఫగ్గణ్ సింగ్ కులస్తే, రావ్‌సాహెబ్ దాదారావ్, సాధ్వీ నిరంజన్ జ్యోతి, సంజీవ్ బల్యాన్, రాజీవ్ చంద్రశేఖర్, సుభాష్ సర్కార్, నిశిత్ ప్రమాణిక్, రాజ్ కుమార్ రంజన్ సింగ్, ప్రతిమా భౌమిక్, మహేంద్రభాయ్, మీనాక్షిలేఖి, అజయ్ కుమార్ మిశ్రా, కైలాశ్ చౌదరి, కపిల్ మోరేశ్వర్ పాటిల్, భారతీ ప్రవీణ్ పవార్, కౌశల్ కిశోర్, భగవంత్ ఖుబా, వి.మురళీధరన్, భాను ప్రతాప్ సింగ్ వర్మ, జాన్ బార్లా, బిశ్వేశ్వర్ టుడు, భగవత్ కిషన్ రావ్ కరాడ్, అజయ్ భట్, నారాయణ స్వామి, దేవుసిన్హ చౌహాన్, సోమ్ ప్రకాశ్, రామేశ్వర్ తేలి, విక్రమ్ జర్దోశ్.