Latest Gold-Silver Prices June 2024: బంగారం అంటే బంగారమే. ఒక సాధారణ కుటుంబాన్నే కాదు, అగ్రరాజ్యాలను కూడా కష్టకాలంలో ఆదుకుంటుంది. ఆర్థిక మాద్యం భయాలు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గత కొన్నేళ్లుగా చాలా దేశాల కేంద్ర బ్యాంక్‌లు నెలనెలా టన్నుల కొద్దీ పసిడిని కొంటున్నాయి. డిమాండ్‌ పెరిగేసరికి ఎల్లో మెటల్‌ సామాన్యుడికి అందనంత ఎత్తు ఎక్కి కూర్చుంది. తాజాగా, గోల్డ్‌ కొనడం ఆపేశామన్న చైనా కేంద్ర బ్యాంక్‌ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ప్రకాశం తగ్గింది.


రేట్ల పెరగడమేగానీ తగ్గడం జరగదు!
ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని కొంటోంది చైనానే. ఇకపై తమకు గోల్డ్‌ అక్కర్లేదన్న డ్రాగన్ కంట్రీ ప్రకటనతో బంగారం ధరలు దిగొస్తాయని జనం ఆశ పడ్డారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ‍‌(WGC) ఆ ఆశలపై నీళ్లు చల్లింది. కొత్త నిక్షేపాలు కనిపెట్టడం కష్టంగా మారడంతో బంగారం ఉత్పత్తిలో వృద్ధి కనిపించడం లేదంటూ షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. దీనివల్ల, సప్లై తగ్గి రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది.


“2023 మొదటి త్రైమాసికంతో (జనవరి-మార్చి కాలం) పోలిస్తే, 2024 మొదటి త్రైమాసికంలో బంగారు గనుల ఉత్పత్తి 4% పెరుగుతుందని అంచనా వేశాం. కానీ అలా జరగలేదు. 2016, 2018 సంవత్సరాల్లో ఎంత తవ్వి తీశారో ఇప్పటికీ అదే స్థాయిలో మైనింగ్‌ జరుగుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి వృద్ధి లేదు. 2008 నుంచి 10 సంవత్సరాల పాటు వేగంగా పెరిగిన మైనింగ్‌ ఇండస్ట్రీ, గత వైభవాన్ని కొనసాగించడానికి ఇప్పుడు కష్టపడుతోంది" - WGC చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ జాన్ రీడ్


ఇంటర్నేషనల్ ట్రేడ్ అసోసియేషన్ డేటా ప్రకారం, 2022తో పోలిస్తే, 2023లో గ్లోబల్‌గా గోల్డ్‌ మైనింగ్‌ 0.5% మాత్రమే పెరిగింది. 2022లో వృద్ధి సంవత్సరానికి 1.35%, 2021లో 2.7%గా ఉంది. 2020లో అయితే 1% క్షీణించింది.


WGC ప్రకారం, ప్రపంచంలో ఉన్న బంగారు గనులన్నింటినీ ఇప్పటికే కనుగొన్నారు. కొత్త నిక్షేపాలు దాదాపుగా లేవు. ఒకవేళ ఉన్నా కనిపెట్టడం కష్టం. ఒక గోల్డ్‌ మైన్‌ను కనిపెట్టాక దానిలో మైనింగ్‌ చేయడం సామాన్యమైన విషయం కాదు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, మైనింగ్‌ ఎక్స్‌పర్ట్స్‌, ఆధునిక పరికరాలు కావాలి. ఒక గనిని ఉత్పత్తికి సిద్ధం చేయడానికి సగటున 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. అంతేకాదు... కనిపెట్టిన ప్రతి గనిలో పసడి పుష్కలంగా ఉంటుందన్న గ్యారెంటీ లేదు. కనిపెట్టిన గనుల్లో కేవలం 10% వాటిలో మాత్రమే మైనింగ్‌కు తగినంత ఎల్లో మెటల్‌ ఉంటుంది.


ఇక మిగిలింది 57,000 టన్నులే! 
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 1,87,000 మెట్రిక్ టన్నుల బంగారాన్ని తవ్వి తీశారు. దీనిలో ఎక్కువ మొత్తం చైనా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్న మైన్స్‌లో సుమారు 57,000 టన్నుల ముడి పసిడి ఉంటుందని అంచనా.


బంగారాన్ని కనిపెట్టడమే కాదు, దానిని తవ్వి తీసేందుకు ప్రభుత్వ అనుమతులు పొందడం కూడా కష్టమే. అన్ని రకాల లైసెన్స్‌లు పొందడానికి ఏళ్ల సమయం పడుతోంది, గోల్డ్‌ మైనింగ్‌ ఇండస్ట్రీని ఈ ప్రక్రియ చాలా ఇబ్బంది పెడుతోంది.


ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు (28.35 గ్రాములు) 2,294.3 డాలర్లుగా ట్రేడవుతోంది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి