Jammu Kashmir Terrorist Attack: శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. కాల్పులు తప్పించే ప్రయత్నం చేయగా, బస్సు అదుపు తప్పి లోయలో పడటంతో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, బస్సులో ప్రయాణిస్తున్న మరో 33 మంది వరకు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యాత్రికులు బస్సులో జమ్ముకశ్మిర్లోని శివ్‌ఖోడీ ఆలయాన్ని సందర్శించి వస్తున్నారు. మార్గం మధ్యలో రియాసీ జిల్లాలోని పోనీ ప్రాంతంలోని తెర్వాత్ గ్రామంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఈ దుర్ఘటన జరిగింది. అది కూడా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
ఉగ్రవాదుల కాల్పులకు భయపడిపోయిన డ్రైవర్ బస్‌ను వేగంగా పోనిచ్చాడు. దీంతో బస్ లోయలో పడిపోయింది. దుర్ఘటన జరిగిన వెంటే భారీగా భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి. ప్రమాదంపై ప్రధానమంత్రి మోదీ ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందివ్వాలని సూచించారు. దాడికి పాల్పిడిన వారిని అసలు విడిచిపెట్టొద్దని అధికారులకు సూచించారు.