PM Modi Swearing In: సాధారణ ఛాయ్‌వాలా ఓ సారి ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టడమే అద్భుతం. అలాంటిది నరేంద్ర మోదీ ఏకంగా మూడోసారి ఆ అద్భుతం సృష్టించారు. నెహ్రూ రికార్డుని సమం చేస్తూ హ్యాట్రిక్ విజయం సాధించారు. 2014లో తొలిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి మోదీ వేరు ఇప్పటి మోదీ వేరు. అప్పటికి ఉన్న చరిష్మా మూడింతలు పెరిగింది. దేశీయంగానే కాదు. అంతర్జాతీయంగానూ ఆయనకు ఎనలేని అభిమానం దక్కింది. 1950లో సెప్టెంబర్ 17న జన్మించారు మోదీ. అప్పటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి మూడేళ్లవుతోంది. ఇరుకైన ఇంట్లోనే ఆయన బాల్యం అంతా గడిచింది. పేదరికం కారణంగా చదువుకోడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. పొట్ట పోషించుకునేందుకు టీ స్టాల్‌ పెట్టుకున్నారు. పుస్తకాలు చదవడం అంటే మోదీకి మహా ఇష్టమని ఆయన బాల్య మిత్రులు చెబుతుండే వారు. స్థానిక గ్రంథాలయంలోనే గంటల కొద్ది సమయం గడిపేవారు మోదీ. ఈత కొట్టడమన్నా భలే సరదా. బౌద్ధ మత ప్రభావం ఎక్కువగా ఉన్న వాద్‌నగర్‌లో నివసించిన మోదీకి ఆధ్యాత్మికత అలవడింది. ఆ తరవాత స్వామి వివేకానంద స్ఫూర్తితో పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టారు. భారత్‌ని విశ్వగురు చేయాలన్న స్వామి వివేకానంద కలను నెరవేర్చుతానని మోదీ ఇప్పటికీ ప్రస్తావిస్తుంటారు. అంతగా ఆయన ప్రభావిమతమయ్యారు. 



17 ఏళ్ల వయసులో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మోదీ దాదాపు రెండేళ్ల పాటు దేశమంతా పర్యటించారు. రకరకాల సంస్కృతులను పరిశీలించారు. ఆ సమయంలోనే అహ్మదాబాద్‌కి వెళ్లి RSS సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆ సంస్థలో చేరారు. 1972లో RSS ప్రచారక్‌గా మారారు. RSSలో క్రమంగా ఎదుగుతూ వచ్చిన నరేంద్ర మోదీ 1980 నాటికి ఆర్గనైజర్‌గా మారారు. గుజరాత్‌ బీజేపీ యూనిట్‌కి జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. మొట్టమొదటి సారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 1990లో గుజరాత్‌లో కాంగ్రెస్‌కి బీజేపీ గట్టి పోటీ ఇవ్వగలగడంలో కీలక పాత్ర పోషించారు. 1995 నాటికి పార్టీకి విజయాన్ని అందించారు. 1995 లోనే బీజేపీ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.


2001 మోదీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ సమయానికి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కేశుభాయ్ పటేల్‌ ఆరోగ్యం క్షీణించింది. అదే సమయానికి అక్కడ భారీ భూకంపం వచ్చింది. ఓ బలమైన నేత అవసరం అక్కడ ఉంది. అందుకే వెంటనే అప్పటి ప్రధాని వాజ్‌పేయీ మోదీకి కాల్ చేసి తన ఇంటికి పిలిపించుకున్నారు. గుజరాత్‌కి సీఎంగా వెళ్లాలని ఆదేశించారు. అలా వాజ్‌పేయీ పిలుపుతో అప్పటికప్పుడు గుజరాత్‌లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోదీ 2014 వరకూ అదే పదవిలో కొనసాగారు. వరుసగా 13 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి అఖండ విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రధాని పదవిలోనే కొనసాగుతున్నారు. ఈ సారి బీజేపీకి కాస్త మెజార్టీ తగ్గినప్పటికీ ఆయన చరిష్మా మాత్రం చెక్కుచెదరలేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 7 దేశాల అధినేతలు హాజరయ్యారు. విదేశాంగ విధానంలో సంస్కరణలు తీసుకురావడంలో మోదీ సర్కార్ విజయం సాధించిందనడానికి ఇదో ఉదాహరణ అని చెబుతారు రాజకీయ విశ్లేషకులు. 


Also Read: PM Modi Oath Ceremony: మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం, దేశ చరిత్రలో నిలిచిపోయే రికార్డు