Central Minister Bandi Sanjay Political History: బీజేపీలో కింది స్థాయి నుంచి వచ్చిన నేతలకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభించింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఐదుగురికి మోదీ కేబినెట్ 3.0లో అవకాశం లభించింది. ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ.. అటు తెలంగాణ నుంచి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి చోటు దక్కింది. వీరు ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) ఓ సాధారణ కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఓసారి చూస్తే..
బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం
బండి సంజయ్ (Bandi Sanjay) కరీంనగర్ ఎంపీగా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న ఆయనకు.. ఇప్పుడు కేంద్ర మంత్రిగా మోదీ కేబినెట్‌లో అవకాశం దక్కింది. బండి సంజయ్ 1971, జులై 11న జన్మించారు. బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో స్వయం సేవకుడిగా, ఏబీవీపీలో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పని చేశారు. భారతీయ జనతా యువ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ, తమిళనాడు ఇంఛార్జీగా బాధ్యతలు చేపట్టారు.
- కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిగా 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్‌గా, రెండోసారి అదే 48వ డివిజన్ నుంచి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించారు. వరుసగా రెండు పర్యాయాలు నగర బీజేపీ అధ్యక్షునిగా విధులు నిర్వర్తించారు.
- 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, 52,000 వేల పైచిలుకు ఓట్లు సాధించి రెండో స్థానానికి పరిమితమయ్యారు. 2016లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామకమయ్యారు.
- 2019 ఎన్నికల్లో బీజేపీ తరఫున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి 66,009 ఓట్లను సంపాదించి రెండో స్థానంలో ఉండగా, రాష్ట్రంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో ప్రథమ స్థానంలో నిలిచారు.
- 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, టీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టి 96 వేల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు.
- 2019 ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబెర్‌గా నియామకం (ఇంకా కొనసాగుతున్నారు). 2019 అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంట్ కమిటీ మెంబెర్‌గా నియామకం (ఇంకా కొనసాగుతున్నారు). 2019 టొబాకో బోర్డు మెంబెర్‌గా నియామకమై సేవలందించారు.
- 2020 మార్చి 11 నుంచి 2023 జూలై 3 వరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశారు. 2023 జూలై 8న జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియామకం.
- 29 జూలై 2023న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, 89,016 ఓట్లు సాధించి 3,163 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2024 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 5,85,116 ఓట్లు సాధించి, 2,25,209 మెజార్టీతో రెండో సారి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ప్రధాని మోదీ కేబినెట్‌లో బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.